- రాజకీయ లబ్ధి కోసం మండుటెండల్లో వద్ధులను ఇబ్బంది పెడతారా
- పింఛన్లపై వైసీపీ నేతల విషప్రచారం
- గత ప్రభుత్వంలో వాలంటీరు వ్యవస్థ లేకపోయినా అందరికీ పింఛన్ అందింది
- మాజీమంత్రి దేవినేని ధ్వజం
అమరావతి(చైతన్యరథం): జగన్‌రెడ్డి ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలు పరమావధిగా కనీస మాన వత్వం లేకుండా వ్యవహరిస్తోందని టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరు లతో మాట్లాడుతూ అవ్వాతాతలను పింఛన్ల కోసం మండుటెండల్లో సచివాలయాలకు రమ్మని చెప్పటం దుర్మార్గమన్నారు. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వ యంత్రాం గం తప్పుడు విధానాల వల్ల 56లక్షల పింఛన్ దారులు రోడ్డున పడ్డారు. వృద్ధులను కనికరం లేకుండా పింఛన్ల కోసం సచివాలయాలకు రావాలని చెప్పడం దారుణం. వైసీపీ ప్రభుత్వానికి లబ్ధి చేయాలనే కుట్రతో సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆదేశాలమేరకు సీఎస్ జవహర్ రెడ్డి, సెర్ప్ సీఈఓ మురళీధర్‌రెడ్డి, సీఎం పేషీ కీలక అధికారి ధనుంజయరెడ్డి కలిసి ఇంతటి దారుణానికి పాల్పడ్డా రు. ముఖ్యమంత్రి కనుసన్నల్లో కొంతమంది అధికారులు ఫింఛన్ దారులను మండుటెండల్లో నిలబెట్టి స్వార్థపూరిత కుట్రతో ఆలోచిస్తున్నారు.
గత ప్రభుత్వంలో కొద్దిపాటి సంఖ్యలో విలేజ్ సెక్రటరీలు ఉన్నప్పుడే అందరికీ పింఛన్లు అందేలా చర్యలు తీసుకున్నాం. మరి ఈ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 15 వేల సచివాలయాలు, 1.35 లక్షల సచివాలయ సిబ్బంది ఉన్నారు. వీళ్ల ద్వారా పింఛన్లు అందించడం సాధ్యమేనని జిల్లా కలెక్టర్లు కూడా చెప్పారు. కానీ మురళీధర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి ఈ కుట్రలో కీలక పాత్ర వహించి కలెక్టర్లు చెప్పిన సమాచారాన్ని పక్కదోవ పట్టించారు. ఈ కుట్రలో భాగంగానే వృద్ధులను మండుటెండలో సచివాలయాలకు రమ్మనడం జగన్‌రెడ్డి నియంత పోకడలకు నిదర్శనం. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి ఏకపక్షంగా వ్యవహరించడం దుర్మార్గం. ఏసీ గదుల్లో కూర్చుని 34 లక్షల మంది వృద్ధులను పింఛన్ల కోసం సచివాలయాలకు రావాలని చెప్పిన జగన్ రెడ్డికి మానవత్వం ఉందా? రాబోయే ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసం కక్ష పూరితమైన కుట్రలకు వైసీపీ ప్రభుత్వం పాల్పడుతోందని దేవినేని ధ్వజమెత్తారు.
ప్రజలు అర్థం చేసుకోవాలి
వ్యవసాయ అనుబంధ రంగాల్లో 14,232 మంది ఉద్యోగులు ఉన్నారు. వీళ్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయవచ్చు. గత ప్రభుత్వంలో వాలంటీరు వ్యవస్థ లేకపోయినా అందరికీ పింఛన్ అందింది. గత ప్రభుత్వంలో ముందు పింఛన్ దారులకు డబ్బులు అందిచిన తర్వాతే ఉద్యోగులకు, మిగతా వారికి అందించేవారు. కానీ, ఈ ప్రభుత్వంలో ఉన్న డబ్బులన్నీ సొంత మనుషులైన కాంట్రాక్టర్లకు, వైసీపీకి అనుకూలంగా పనిచేసిన వారికి, పంచేశారు. అస్మదీయులకు జగన్‌రెడ్డి ఖజానా దోచిపెట్టడం వల్లనే పింఛన్ దారులకు డబ్బులు పంచడానికి నిధులు లేవు. 3 తారీఖు వచ్చినా సచివాలయ సిబ్బంది చేతికి డబ్బులు అందలేదంటే జగన్మోహన్ రెడ్డి ఎంత కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలని దేవినేని అన్నారు. జగన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం అమలు చేస్తున్న కుట్రలో భాగంగా 34 లక్షల మంది వృద్ధులు, 15 లక్షల మంది వితంతువులు సహా మొత్తం 56 లక్షల పింఛన్ దారులును సచివాలయాలకు రమ్మనడం దుర్మార్గమన్నారు.
ఈసీ చర్యలు తీసుకోవాలి
వైసీపీ ప్రభుత్వ పెద్దలు చెప్పిందల్లా వెనుకాముందూ ఆలోచించకుండా చేసినందుకు 9 మంది అధికారులు బలయ్యారు. చట్టాలను అతిక్రమించి, వైసీపీ నేతలు చెప్పిన అడ్డగోలు పనులు చేసిన ఐఏఎస్, ఐపీిఎస్ అధికారులను ఈసీ బదిలీ చేసి ఎన్నికల విధుల నుంచి తప్పించినా జగన్ రెడ్డికి చీమకుట్టినట్టు కూడా లేదు. మితిమీరిన స్వామి భక్తి ప్రదర్శిస్తున్న జగన్ భక్త అధికారులకూ ఇదే గతి పడుతుందనే విషయం గుర్తుంచుకోవాలి. వైసీపీ కార్యకర్తలు పింఛన్ల కోసం వృద్ధులను మంచాలపై సచివాలయాలకు మోసుకొస్తూ టీడీపీపై విషప్రచారం చేస్తున్నారు. వీరిపై ఈసీ చర్యలు తీసుకోవాలని దేవినేని డిమాండ్ చేశారు.