.పిఎం స్వనిధి స్కీమ్ ను జగనన్న తోడుగా మార్పు
.ఇచ్చింది రూ.6 కోట్లు.. ప్రచారానికి రూ. 10కోట్లు
.రూ.2వేలకోట్లు ఇచ్చానని తప్పుడు ప్రకటనలు
.టిడిపి వాణిజ్య విభాగం అధ్యక్షుడు డూండీ రాకేష్
అమరావతి: జగనన్న తోడు పేరుతో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రారంభించిన పథకం పచ్చి బూటకమని తెలుగుదేశం పార్టీ వాణిజ్యవిభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండీ రాకేష్ ధ్వజమెత్తారు. గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ కేంద్రప్రభుత్వ పథకం పిఎం స్వనిధికి జగన్ రెడ్డి స్టిక్కర్ వేసుకుని జగనన్న తోడుగా ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు. ఈ పథకం కింద చిరువ్యాపారులకు రూ.2వేల కోట్లరూపాయలు ఇచ్చామని తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 20లక్షలమంది చిరువ్యాపారులు ఉంటే ఈ పథకం కింద జగన్ రెడ్డి ఇచ్చినట్లు చెబుతున్నది కేవలం 3.95లక్షలు. అది కూడా చాలామందికి అందలేదు. ఒక్కొక్కరికి 10వేలరూపాయల చొప్పున ఈ ఏడాది 395కోట్లు ఇచ్చామని అంటున్నారు. ఆ సొమ్మంతా బ్యాంకురుణం మాత్రమే. ఈ పథకంలో రూ.16కోట్ల వడ్డీ రాయితీని మాత్రమే ప్రభుత్వం వ్యాపారులకు అందజేస్తోంది. అందులో కూడా కేంద్ర ప్రభుత్వం 10కోట్లరూపాయలు ఇవ్వగా, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కేవలం రూ.6కోట్ల రూపాయలు మాత్రమే. అరకొరగా కొద్దిమంది వ్యాపారులకు రూ.6కోట్లు ఇచ్చి తమ సొంతపత్రిక సాక్షితో సహా ప్రకటనలకు రూ.10కోట్లరూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. నామమాత్రపు సాయం చేసిన జగన్ రెడ్డి ప్రభుత్వం ఇంటిపన్ను, చెత్తపన్ను, విద్యుత్ చార్జీల రూపంలో మోయలేని భారం మోపారు. చివరకు తోపుడు బండ్ల వ్యాపారులను కూడా ట్రాఫిక్ పోలీసుల ఫైన్ల పేరుతో ఇబ్బందులు పెడుతున్నారు. వాస్తవాలను మరుగునపెట్టి జగన్ రెడ్డి ప్రభుత్వం జగనన్న తోడు పేరుతో చేస్తున్న హడావిడిగా వ్యాపార, వాణిజ్యవర్గాలన్నీ గమనించాలి. గతమూడేళ్లుగా వివిధ రకాల పన్నుల చార్జీల భారం వేయడమేగాక రకరకాలుగా వేధింపులకు గురిచేస్తున్న జగన్ రెడ్డి సర్కారును గద్దె దించేందుకు చిరువ్యాపారులు, వాణిజ్యవర్గాలన్నీ ఏకతాటిపైకి రావాలని డూండీ రాకేష్ పిలుపునిచ్చారు.