.నాన్న తాగితేనే అమ్మఒడి, కొడుకు తాగితేనే తల్లికి పెన్షన్
.టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ధ్వజం
అమరావతి: స్వాతంత్య్ర దినోత్సవం రోజున జగన్ రెడ్డి మాట్లాడినవన్నీ అబద్ధాలు, అసత్యాలేనని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ప్రతిపక్షంపై విమర్శలు చేస్తున్నారన్నారు. మద్యపాన నిషేధం చేశాకే ఓట్లు అడుగుతానన్న జగన్ రెడ్డి విశ్వనీయత నేడు ఏమైందని ప్రశ్నించారు. గత మూడేళ్లలో ఏం చేశారో, భవిష్యత్తులో ఏం చేస్తారో కూడా జగన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. మూడేళ్లలో చేసింది ఏమీ లేక, భవిష్యత్తులో ఏం చేయాలో తెలియక ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోస్తున్నారని మండిపడ్డారు. ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, శేఖర్ రెడ్డి అనుయాయులు ఏడాదికి రూ.5వేల కోట్ల చొప్పున ఇసుకలో దోచుకున్న విషయం వాస్తవం కాదా? అని అడిగారు. భవన నిర్మాణ కార్మికులు, పేదల కోసం చంద్రబాబు నాయుడు 8 లక్షల టిడ్కో ఇళ్లను నిర్మిస్తే, జగన్ రెడ్డి మూడేళ్ల మూడు నెలల పాలనలో పేదల ఇల్ల నిర్మాణంలో జగన్ రెడ్డి నిర్లక్ష్యం వహించారని చెప్పారు. వైసీపీ మేనిఫెస్టో ప్రకారం ఏడాదికి 5 లక్షల ఇళ్ల చొప్పున ఇప్పటికి 15 లక్షల ఇళ్లు నిర్మించవలసి ఉందని తెలిపారు. కేవలం 5 ఇళ్లు నిర్మించారని కేంద్రమే చెప్పిందన్నారు. పెన్షన్ల విషయంలో కూడా అబద్ధాలే వల్లె వేశారని, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్ ను రూ.2 వేలకు పెంచింది చంద్రబాబు అన్న సంగతి గుర్తుంచుకోవాలని చెప్పారు. రూ.3వేలకు పెంచుతామని చెప్పి మాట తప్పినట్లు తెలిపారు. విశ్వసనీయత లేకపోతే గడ్డి పెట్టాలని జగన్ రెడ్డి మాట్లాడతారని, ఇప్పుడు గడ్డి ఎవరికి పెట్టాలో చెప్పాలన్నారు. పాఠశాలల్లో నాడు-నేడు అని మాట్లాడుతూ, 30 వేల టీచర్ల పోస్టులు భర్తీ చేయకుండా ఎగ్గొట్టేందుకు పదివేల ప్రాథమిక పాఠశాలలను మూసేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీల గురించి మాట్లాడే అర్హత జగన్ రెడ్డికి లేదని చెప్పారు. విద్య విషయంలో చంద్రబాబు అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చినట్లు తెలిపారు. మరోవైపు దశలవారీ మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్ రెడ్డి రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని పేర్కొన్నారు. విదేశీ విద్యను పేద విద్యార్థులకు దూరం చేశారని చెప్పారు. బెస్ట్ అవైలబుల్స్ స్కూల్స్ ను కూడా దూరం చేశారన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను అటకెక్కించడంతో ఆ వర్గాలే జగన్ రెడ్డిని ఈసడిరచుకుంటున్నాయని చెప్పారు. ఫీజు రీయింబర్స్ మెంట్‌లో కోతలు పెట్టినట్లు తెలిపారు. వైద్యం విషయంలోనూ జగన్ రెడ్డి అబద్ధాలు చెప్పారని, ఆరోగ్యశ్రీని చంద్రబాబు కొనసాగించి, మెరుగుపర్చి, మెరుగైన వైద్యం అందించినట్లు పేర్కొన్నారు. చంద్రబాబు సీఎంఆర్‌ఎఫ్ ద్వారా పేదలను ఆదుకున్నారని, నేడు అది రద్దు చేశారన్నారు. మద్యపాన నిషేధం అంటూ మద్యంపై వచ్చే ఆదాయాన్ని 15 ఏళ్లకు తాకట్టుపెట్టి రూ.25వేల కోట్లు అప్పు తెచ్చుకున్నట్లు తెలిపారు. ఆడ బిడ్డల తాళిబొట్లను 15 సంవత్సరాలకు తాకట్టుపెట్టిన జగన్ రెడ్డికి వారి గురించి మాట్లాడే అర్హత ఉందా అని అడిగారు. అమ్మఒడి, చేయూత, పెన్షన్ పథకాలను మద్యం ఆదాయంతో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నాన్న తాగితేనే అమ్మఒడి వస్తుందని, కొడుకు తాగితేనే తల్లికి పెన్షన్ వస్తుందని, జగన్ రెడ్డి తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ధ్వజమెత్తారు. 16 మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నామని డమ్మీ బటన్ నొక్కారని విమర్శించారు. వికేంద్రీకరణ అంతా బూటకం, తలను మూడు ముక్కలు చేస్తే వికేంద్రీకరణా? కాదు.. అది విధ్వంసం అని పేర్కొన్నారు. స్థానిక సంస్థలు బలోపేతం చేస్తే అది వికేంద్రీకరణ అని చెప్పారు. పంచాయతీల నిధులు రూ.15 వేల కోట్లు, మునిసిపాలిటీల నిధులు రూ.5వేల కోట్లు దారిమళ్లించినట్లు రామానాయుడు తెలిపారు.