- ప్రజలచుట్టూ తిరిగి సేవలందిస్తా
- శభాష్ లోకేష్ అన్పించుకుంటా
- ఇచ్చిన ప్రతిహామీ నిలబెట్టుకుంటా
- మీ బిడ్డలా ఆశీర్వదించండి
మంగళగిరి(చైతన్యరథం): ఇసుక, మద్యం, గంజాయి ద్వారా అడ్డగోలుగా దోచుకున్న జగన్… కుప్పం, మంగళగిరి నియోజకవర్గాలకు రూ.300 కోట్ల చొప్పున దోపిడీ సొమ్ము పంపించారని యువనేత నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో శుక్రవారం జరిగిన రచ్చబండ సభలో లోకేష్ మాట్లాడుతూ… ఈ రెండు నియోజకవర్గాల్లో ఓటుకు 10వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారని సమాచారం ఉందన్నారు. గత ఐదేళ్లుగా ఒక్కో ఓటరు వద్దనుంచి లక్షరూపాయలు దోచుకున్న జగన్… ఇప్పుడు ఖర్చుచేస్తున్నది పదోవంతే, ఆ డబ్బు మీదే… తీసుకొని ఓటు మాత్రం నిరంతరం ప్రజలకోసం శ్రమిస్తున్న తమకు వేయాలని కోరారు. మంగళగిరికి కంపెనీలే వచ్చే అవకాశం లేదని ఎమ్మెల్యే ఆర్కే చెబుతున్నారు, నేను మంత్రిగా ఉండగా మంగళగిరి ఆటోనగర్లో తెచ్చిన పైకేర్ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో ఈరోజు 580 మంది పనిచేస్తున్నారు. అధికారంతో పాటు అభివృద్ధి చేయాలనే సంకల్పం కూడా ఉంటేనే ఇది సాధ్యం. ప్రజాప్రభుత్వం వచ్చిన వెనువెంటనే రాజధాని పనులు ప్రారంభించి యువతకు స్థానికంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తా. ప్రతిఏటా సింగిల్ జాబ్ నోటిఫికేషన్ తో ప్యూన్ నుంచి గ్రూప్-1 వరకు ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీచేస్తామని లోకేష్ చెప్పారు.
రచ్చబండ సభల్లో యువనేత నారా లోకేష్….
ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఐదేళ్లుగా మంగళగిరి ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ వెన్నంటిఉన్నా, గత ఎన్నికల్లో ఓటమి తర్వాత నిరంతరం జనంలో ఉంటూ సేవలందించి వారి మనసులు గెలిచా…ప్రజల ఆశీస్సులతో ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తానని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరు, ఇప్పటం, వడ్డేశ్వరం గ్రామాల్లో శుక్రవారం జరిగిన రచ్చబండ సభల్లో యువనేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ… ఎన్నికల్లో గెలిచాక పనుల కోసం ప్రజలు నా చుట్టూ తిరగాల్సిన పనిలేదు, నేనే ప్రజల చుట్టూ తిరిగి సేవలందించి ఐదేళ్ల తర్వాత శభాష్ లోకేష్ అన్పించుకుంటా. గత ఎన్నికల్లో ఓడిపోయాక టీడీపీకి కంచుకోటలాంటి సీటు ఎంచుకోవాలని సన్నిహితులు సలహా ఇచ్చారు, కానీ ఓడిన చోట గెలవాలన్న పట్టుదలతో మంగళగిరినే ఎంచుకున్నా. ప్రజల మనసు గెలవాలని నిర్ణయించుకున్నా. సొంత డబ్బుతో మంగళగిరిలో 29 సంక్షేమ పథకాలు అమలుచేశా. గుళ్లు, చర్చిల మరమ్మతులకు నిధులిచ్చా. పాడైన రోడ్లు వేయించాను. 25ఏళ్లుగా రెండు కుటుంబాలకు మీరు అవకాశమిచ్చారు, వారు ఏనాడైనా కనీసం వాటర్ ట్యాంకర్ పంపించారా? నా తల్లిదండ్రులు నాకు ప్రజలకు సేవచేయడమే నేర్పించారు, కరకట్ట కమలాసన్లా యాక్షన్ చేయడం రాదు. పేదరికం లేని మంగళగిరిగా మార్చడం, దేశం మొత్తమ్మీద మంగళగిరిని అభివృద్ధికి చిరునామాగా మార్చడం నా లక్ష్యాలు, అహర్నిశలు శ్రమించి ఆ లక్ష్యాలను సాధిస్తానని లోకేష్ అన్నారు.
షరతులు లేకుండా సంక్షేమ పథకాలు…
జగన్ అధికారంలోకి వచ్చాక కుంటిసాకులతో పేదలకు పెన్షన్ ఇతర సంక్షేమ పథకాలు కట్ చేస్తున్నారు, ప్రజాప్రభుత్వం వచ్చాక షరతులు లేకుండా గతంలో మాదిరి సంక్షేమ పథకాలు అందజేస్తామని యువనేత లోకేష్ చెప్పారు. జగన్ మంగళగిరికి వచ్చి పదేపదే బటన్ నొక్కానని అంటున్నాడు. సంక్షేమం పేరుతో రూ.10 ఇచ్చి వంద కొట్టేయడం జగన్కు వెన్నతోపెట్టిన విద్య. గతంలో వందల్లో వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు వేలల్లో వస్తోంది. ఆర్టీసీ ఛార్జీలు, పెట్రోలు, డీజిల్, గ్యాస్, మద్యం ధరలన్నీ పెంచేశారు. 3132 కి.మీ.ల యువగళం పాదయాత్రలో ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూశా. అవి విన్నాక చంద్రబాబు, పవనన్న సూపర్ -6 హామీలను ప్రకటించారు. ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలిస్తాం, ఉద్యోగం వచ్చేవరకు నిరుద్యోగులకు నెలకు రూ.3వేల చొప్పున భృతి అందిస్తాం. జగన్ శవరాజకీయం కోసం పెన్షన్ల పేరిట ఎండల్లో తిప్పి 32 మంది వృద్ధులను నిర్దాక్షిణ్యంగా చంపేశారు. మేం అధికారంలోకి వచ్చాక రూ.3వేల పెన్షన్ను రూ.4వేలు చేసి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇళ్లవద్దకే అందిస్తాం. పనిచేయడానికే వచ్చా…ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటా, మీ ఇంటిబిడ్డలా సేవలందిస్తా, ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని లోకేష్ విజ్ఞప్తిచేశారు.
ఇప్పటం ప్రజల పోరాటం చరిత్రలో నిలుస్తుంది….
అరాచకపాలనపై ఇప్పటం గ్రామ ప్రజలు చేసిన పోరాటం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని యువనేత లోకేష్ అన్నారు. ఇప్పటం గ్రామ రచ్చబండ సభలో లోకేష్ మాట్లాడుతూ… ఇప్పటంలో జేసీబీలు తెచ్చి ఇళ్లు కూలగొట్టారు, న్యాయం కోసం మేమంతా పోరాటం చేశాం, సైకో పోవాలి, సైకిల్ రావాలనే నినాదం ఇప్పటం నుంచే వచ్చింది. ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ కారణంగా నష్టపోయిన బాధితులకు అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో పరిహారం అందిస్తాం. ఇళ్లు నిర్మించి తాళాలు అందజేస్తాం. ఎన్నికల ప్రచారంలో ఇప్పటం గ్రామానికి వెళ్లాలని పవనన్న నన్ను కోరారు. యువత భవిష్యత్తు కోసం మేం పొత్తుపెట్టుకున్నాం. మనమధ్య చిచ్చుపెట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. అప్రమత్తంగా ఉండి వారి కుటిల యత్నాలను అడ్డుకోవాలని లోకేష్ అన్నారు.
ఈ సందర్భంగా ఇప్పటం గ్రామస్తులు పలు సమస్యలను యువనేత దృష్టికి తెచ్చారు. ఇప్పటం గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలి. కెఎల్ వర్సిటీ అనుసంధానంగా బ్రిడ్జి నిర్మించాలి. ఇళ్లులేని వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. బుడగజంగాలకు ఇళ్లు, కులధృవీకరణ పత్రాలు అందించాలి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. లోకేష్ స్పందిస్తూ ఇప్పటం గ్రామానికి రోడ్డువేసి బస్ సౌకర్యం కల్పిస్తామన్నారు. కెఎల్యుకి వెళ్లే బ్రిడ్జి నిర్మిస్తాం. ఇళ్లులేని పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తాం. బుడగ జంగాలకు కులధృవీకరణ పత్రాలు ఇచ్చి సంక్షేమ పథకాలు అందజేస్తామని హామీ ఇచ్చారు.
యువనేత దృష్టికి ఆత్మకూరు సమస్యలు….
రచ్చబండ సందర్భంగా ఆత్మకూరు ప్రజలు పలు సమస్యలను యువనేత లోకేష్ దృష్టికి తెచ్చారు. గ్రామంలోని వడ్డెరపాలెం రోడ్డు అధ్వాన్నంగా తయారైంది. గ్రామశివార్లలో వంతెన శిథిలావస్థకు చేరుకుంది. కోవిడ్ సమయంలో సేవలందించిన పారామెడికల్ సిబ్బందికి ఇప్పటివరకు బకాయిలు చెల్లించలేదు. జీతాల కోసం ధర్నాచేస్తే మాపై కేసులు పెట్టారు. ఆత్మకూరులో రోడ్డు విస్తరణ సందర్భంగా 100 కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. పానకాలస్వామి గుడిపైకి మెట్లమార్గంలో వృద్ధులు వెళ్లలేకపోతున్నారు. ఉచిత బస్సు ఏర్పాటుచేయాలి. సగంలో ఆగిపోయిన మంగళగిరి ఐటి పార్కు పనులను పునఃప్రారంభించండి. కౌలురైతులకు సాయం అందించేలా చర్యలు తీసుకోండి. ఇళ్లకు మంచినీటి కుళాయిలు, సైడ్ కాల్వలు నిర్మించండి. జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరారు. నారా లోకేష్ స్పందిస్తూ… అధికారంలోకి వచ్చాక గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి, తాగునీటి పైప్ లైన్ వేశాక సిమెంటు రోడ్లను నిర్మిస్తాం. శిథిలావస్థకు చేరిన వంతెన పునర్నిర్మిస్తాం. కోవిడ్ సమయంలో సేవలందించిన పారామెడికల్ సిబ్బందికి బకాయిలు చెల్లిస్తాం. రోడ్డు విస్తరణలో నిరాశ్రయులైన వారికి స్థలాలు కేటాయించి, ఇళ్లు నిర్మించి ఇస్తాం. పానకాలస్వామి గుడివద్దకు ఉచిత ఎలక్ట్రిక్ బస్సు ఏర్పాటు చేస్తాం. మంగళగిరి ఐటి పార్కుకు కంపెనీలు తెస్తాం. కౌలురైతు చట్టాన్ని పకడ్బందీగా అమలుచేసి సాయం అందిస్తామని తెలిపారు. చంద్రబాబు, పవనన్నతో పోరాడి నిధులు తెచ్చి మంగళగిరిని అభివృద్ధి చేయాలంటే రాబోయే ఎన్నికల్లో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని లోకేష్ కోరారు.