విజయవాడ: రాష్ట్రంలో శాంతి,భద్రతలపై ప్రధానికి లేఖ రాసిన మాజీ సీఎం జగన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. పురందేశ్వరి ఆధ్వర్యంలో నాలుగు జిల్లాలకు చెందిన పలువురు నాయకులు శుక్రవారం బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారికి పురందేశ్వరి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ ప్రధాని మోదీ పై ప్రజలకు ఉన్న నమ్మకమే ఎన్డీఏ కూటమికి మూడోసారి విజయం దక్కేలా చేసిందన్నారు. పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమం మాకు ముఖ్యం అన్నారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ నినాదాన్ని కార్యాచరణలో పెడతామని స్పష్టం చేశారు.
ఐదేళ్లపాటు జగన్ అరాచక పాలన
ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. వైసీపీ పాలనలో జరిగిన దారుణాలపై జగన్ ఎప్పుడూ స్పందించలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు కాకుండానే ఏమీ లేకపోయినా ఏదో జరిగిపోతోందంటూ గగ్గోలు పెడుతున్నారన్నారు. ప్రధానికి జగన్ లేఖ రాయడం సరికాదన్నారు. జగన్ గుండెల మీద చెయ్యి పెట్టుకుని ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. ఐదేళ్ల వైసీపీ అరాచక పాలనని ప్రజలు మర్చిపోలేదన్నారు. తన అక్కని వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు 16 సంవత్సరాల బీసీ బాలుడిని నోట్లో గుడ్డలు కుక్కి, ఒంటిపై పెట్రోల్ పోసి కిరాతకంగా చంపారు. దీనిపై జగన్ స్పందించలేదు. కరోనా సమయంలో మాస్కులు లేవని ప్రశ్నించిన విశాఖకు చెందిన వైద్యుడిని తీవ్రంగా వేధించి ప్రాణాలు తీశారు. లోకల్ బాడీ ఎన్నికల్లో నామినేషన్ వేయటానికి వెళ్ళిన అభ్యర్థులపై దౌర్జన్యం చేసి వారి చేతుల్లోని నామినేషన్ పత్రాలు చింపేశారు. నెల్లూరులో కత్తులతో బీజేపీ మహిళా కార్యకర్తని గాయపరిచారు. దళితులపై దాడులు, హత్యలు లెక్కలేనని జరిగాయి. వీటన్నిటిపై జగన్ ఆత్మపరిశీలన చేసుకోవాలని పురందేశ్వరి హితవు పలికారు.
రాష్ట్రానికి కేంద్రం అన్ని విధాల సహకరించింది అనడానికి మెడ్ టెక్ ఉదాహరణ అని పురందేశ్వరి అన్నారు. మెడ్ టెక్ పార్క్ ఎండీ జితేంద్ర శర్మ స్వయంగా జగన్ నుండి సహకారం లేదని చెప్పారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సహకారంతోనే పురోగతి సాధించామని చెప్పారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల చేసే పసలేని విమర్శలు మానుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వ సహాయం లేనిదే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యం కాదన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రజాహిత పాలన అందిస్తారని భావిస్తున్నానన్నారు.