- వచ్చే విద్యాసంవత్సరం నుంచి తల్లికి వందనం
- మాది ప్రజాప్రభుత్వం, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం
- దేశ, విదేశాల్లో అధ్యయనం ద్వారా ఏపీ మోడల్ ఎడ్యుకేషన్‌కు రూట్ మ్యాప్
- రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి లోకేష్ స్పష్టీకరణ
అమరావతి (చైతన్యరథం): పద్ధతి ప్రకారం ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తున్నాం.. హామీ ఇవ్వని పథకాలను కూడా అమలు చేస్తున్నాం.. ఎవరూ అడగకుండానే ఇంటర్ విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నాం.. పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి గాలిలో కాకుండా రోడ్డుపైకి వచ్చి మేం చేస్తున్న మంచి పనులను చూడవచ్చని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చురకలు వేశారు. శనివారం విజయవాడ పాయకాపురం జూనియర్ కళాశాల ఆవరణలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన అనంతరం మంత్రి లోకేష్ విలేకరులతో మాట్లాడుతూ… జగన్ ప్రజల్లోకి వచ్చి సమస్యలు తెలుసుకోవడంలో తప్పులేదు.. ఇప్పుడు రోడ్లు కూడా మంచివి వేశాం, ఆయన నిర్భయంగా రోడ్లపైకి రావచ్చునన్నారు. ఇంకా మేం చేయాల్సి చాలా ఉంది, అన్నీ చేస్తాం. జగన్ వచ్చి మేం అమలుచేస్తున్న మంచి కార్యక్రమాలు చూడాలని కోరుతున్నాం. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. వైసీపీ మాదిరి మాది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం కాదు. ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నాం. ప్రజాదర్బార్ ద్వారా సమస్యలు తెలుసుకుంటున్నాం. గత ప్రభుత్వ తప్పుల వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకుంది. నెలకు రూ.4వేల కోట్ల వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.4వేల సామాజిక పెన్షన్ అందజేస్తున్నాం. గత ప్రభుత్వం మూసివేసిన అన్న క్యాంటీన్లు తెరిచాం. ఉచిత గ్యాస్ పథకాన్ని ఇప్పటికే అమలుచేస్తున్నామని మంత్రి లోకేష్ వివరించారు.
ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్స్ మెరుగుపరుస్తాం
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్స్ మెరుగుదలకు కృషిచేస్తున్నాం.అంతర్జాతీయంగా టాప్ -100 వర్సిటీల్లో ఏపీ విశ్వవిద్యాలయాలను నిలపడానికి ప్రయత్నిస్తున్నాం. ఉన్నత విద్యావంతుడ్ని హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్‌గా నియమించాం, మిగతా విశ్వవిద్యాలయాలకు కూడా మంచి వీసీలను ఎంపికచేసే పనిలో సెర్చి కమిటీలు ఉన్నాయి. రాష్ట్రాన్ని నాలెడ్జి సొసైటీగా, నాలెడ్జి ఎకానమీగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నాం. ప్రభుత్వరంగంతోపాటు ప్రైవేటురంగంలో పలు ప్రఖ్యాత విద్యాసంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయి. యువగళం పాదయాత్రలో ఇంటర్ విద్యార్థులు నన్ను కలిసినపుడు వారి తల్లిదండ్రులకు ప్రైవేటు కాలేజీలకు పంపే ఆర్థిక స్థోమత లేకపోవటంతో పభుత్వ కాలేజీల్లో చేరుతున్నామని చెప్పారు. ప్రభుత్వ కళాశాలల్లో ప్రైవేటుకు దీటుగా సౌకర్యాలు, కరిక్యులమ్ మెరుగుపర్చాలని వారు కోరారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక ఆ దిశగా చర్యలు ప్రారంభించాం. జూనియర్ కాలేజీల్లో ఉచితంగా టెక్స్ట్ బుక్స్ ఇచ్చాం, తాజాగా మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించామని మంత్రి లోకేష్ చెప్పారు.
ఏపీ మోడల్ ఎడ్యుకేషన్‌కు రూట్ మ్యాప్
నాలెడ్జి సొసైటీలో హెచ్‌ఆర్ విభాగం కీలక పాత్ర పోషిస్తుంది. అటువంటి శాఖకు మంత్రిగా తాను బాధ్యతలు చేపట్టడం అదృష్టంగా భావిస్తున్నాను. కెేజీ నుంచి పీజీ వరకు విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు కృషిచేస్తున్నాం. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో మెరుగైన విద్యా విధానాలపై అధ్యయనం చేస్తున్నాం. గతంలో మాదిరి ఏకపక్షంగా కాకుండా యూనియన్లతో చర్చిస్తున్నాం. వాస్తవంగా విద్యార్థులకు ఏం కావాలో తెలసుకున్నాకే నిర్ణయాలు తీసుకుంటున్నాం. నేను స్వయంగా పాఠశాలలు, లైబ్రరీల ఆకస్మిక తనిఖీలకు వెళ్లి విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యలు తెలసుకున్నాను. ఏపీ మోడల్ స్కూల్ ఎడ్యుకేషన్‌కు రూట్ మ్యాప్ తయారైంది. హయ్యర్ ఎడ్యుకేషన్ కరిక్యులమ్ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నాం. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలను తీర్చిదిద్దే బాధ్యత నాది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రైవేటుకు దీటుగా మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషిచేస్తున్నట్లు మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.