- టీడీపీ-జనసేన పొత్తుపై జగన్ కుయుక్తులు
- జగన్రెడ్డి తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు
- సీట్ల సర్దుబాటు అంటూ సోషల్ మీడియాలో నకిలీ లేఖలు
అమరావతి: సోషల్ మీడియా వేదికగా తప్పుడు వార్తల ప్రచారంలో జగన్ రెడ్డి గోబెల్స్ని మించిపోయాడని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. టీడీపీ-జనసేన సీట్ల కేటాయింపులపై అసత్య కథనాలు ప్రచారం చేసే నీచ రాజకీయానికి తెరలేపాడని ఒక ప్రకటనలో అచ్చెన్నాయుడు విమర్శించారు. దురుద్దేశంతో తప్పుడు నివేదికలు విడుదల చేస్తూ ప్రజల్లో గందరగోళం రేకెత్తించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇలాంటి నీచ రాజకీయాలను ప్రజలు సహించరని జగన్ రెడ్డి గుర్తించాలి. టీడీపీ-జనసేన సీట్ల కేటాయింపు పేరుతో వైసీపీ నేతలు నకిలీ లేఖ విడుదల చేశారు. ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. ఈ విషయాన్ని ప్రజలు, తెలుగుదేశం, జనసేన శ్రేణులు నమ్మొద్దు. తప్పుడు ప్రచారాలతో బతికే జగన్ రెడ్డి తుప్పు వదిలించే జాబితా త్వరలో అధికారికంగా విడుదల చేస్తాం. అంత వరకు ప్రజలు, పార్టీ శ్రేణులు జగన్ రెడ్డి తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టాలని అచ్చెన్నాయుడు పిలుపు ఇచ్చారు.