- ఎన్నికల హామీల మోసాలపై తెదేపా చార్జిషీట్
- 99 శాతం హామీల అమలు వట్టి బూటకం
- టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం
- చరిత్రలో ఫెయిల్యూర్ సీఎంగా నిలిచిపోతాడని వ్యాఖ్య
అమరావతి: అబద్ధాలు, అసత్యాలతో ప్రజలను వంచిస్తున్న జగన్‌కు ప్రజాకోర్టులో శిక్ష ఖాయమని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. చరిత్రలో అతి పెద్ద ఫెయిల్యూర్ సీఎంగా జగన్ నిలిచి పోతాడని వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు ఊరూరా తిరిగి అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్, నేడు ప్రజలను నిట్టనిలువునా ముంచేశాడని దుయ్యబట్టారు. ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబు అధ్యక్షతన ఆదివారం టీడీఎల్పీ సమావేశం జరిగింది. సమావేశంలో ప్రధానంగా అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. మొత్తం పది అంశాలపై చర్చకు పట్టుబట్టాలని తెలుగుదేశం నిర్ణయానికి వచ్చింది. సమావేశంలో సీఎం జగన్‌రెడ్డి ఎన్నికల హామీల మోసాలను ఎండగడుతూ… ‘ప్రజాకోర్టు – జగన్ నెరవేర్చని హామీలపై టీడీఎల్పీ ఛార్జ్‌షీట్’ పేరిట సంకలనాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… మేనిఫెస్టో, పాదయాత్రలో మొత్తం 730 హామీలిచ్చిన జగన్.. 21 హామీలు కూడా అమలు చేయలేదన్నారు. కొత్త అబద్ధాల తో ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తూ.. వేదికలపై 99శాతం అమలు చేశానంటూ ప్రజల్ని వంచిస్తున్నాడన్నారు. మోస పూరిత మాటలతో ప్రజలను మోసం చేస్తున్న జగన్‌కు మరో రెండు నెలల్లో ప్రజాకోర్టులో శిక్ష తప్పదని చంద్రబాబు హెచ్చరించారు. ‘‘విద్యుత్ ఛార్జీలు పెంచనని హామీ ఇచ్చిన జగన్.. మాట మార్చి మడమ తిప్పి రాష్ట్రంపై రూ.64 వేల కోట్ల భారం మోపాడన్నారు. మద్య నిషేధం హామీని అటకెక్కించి మద్యం అమ్మకాలపై ఆదాయాన్ని తాకట్టు పెట్టి రూ.25 వేల కోట్లు అప్పులు తెచ్చన జగన్‌ను ప్రజలు క్షమించరన్నారు.
2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ హామీ గాలికొదిలేశాడని, నిత్యావసర వస్తువుల ధరలు, పన్నులు, ఛార్జీలతో ఒక్కో కుటుంబంపై రూ.8 లక్షల భారం మోపాడని దుయ్యబట్టారు. పెట్రోల్ డీజిల్ ధరలపై మాట తప్పి… జనం జేబులు కొల్లగొడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎస్ రద్దు హామీపై మాట తప్పాడని, తెలియక హామీ ఇచ్చానంటూ తప్పించుకున్నాడన్నారు. మెడలు వంచైనా ప్రత్యేక హోదా సాధిస్తానన్న హామీని ఎన్నికల సభల్లో ప్రస్తావించకపోవడం జగన్ దుర్మార్గపు రాజకీయానికి నిలువుటద్దమని ఎద్దేవా చేశారు. జలయజ్ఞం అంటూ ఆర్భాటంగా ప్రకటించి, ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేదని, ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ హామీని జగన్ మర్చిపోయాడని మండిపడ్డారు. సొంత జిల్లాలో ఏర్పాటు చేస్తానన్న స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై నాలుక మడతేయడం జగన్‌కే సాధ్యమైందని ఎద్దేవా చేశారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ హామీ గాలికొదిలేరంటూ.. ఇలా ఒక్కటని కాదు….జగన్ ఇచ్చిన ఏ హామీనీ అమలు చేయలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
10 అంశాలపై చర్చకు పట్టు
పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు హాజరైన టీడీఎల్పీ భేటీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చ జరిగింది. సమావేశాల్లో మొత్తం పది అంశాలపై చర్చకు పట్టుబట్టాలని తెలుగుదేశం యోచిస్తోంది. అప్పుల ఊబిలో రాష్ట్రం, సౌర విద్యుత్ ప్రాజెక్టుల పేరిట ప్రభుత్వ పెద్దల బినామీలకు వేల ఎకరాల కేటాయింపు, అనుచిత రాయితీలు తదితర అంశాలపై టీడీఎల్పీ భేటీలో చర్చించారు. వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల బాదుడు, స్థానిక సంస్థల నిధుల దారి మళ్లింపు, బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయకపోవడాన్ని సభలో చర్చకు తేవాలని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. విశాఖ రైల్వే జోన్‌కు అవసరమైన భూమి అప్పగించకుండా రాష్ట్ర ప్రభుత్వం మోకాలడ్డటంపై టీడీఎల్పీ చర్చించింది. కరవు మండలాల ప్రకటనలో వైఫల్యం, మిచౌంగ్ తుపాను బాధిత రైతుల్ని అదుకోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపైనా శాసనసభాపక్షం సుదీర్ఘంగా చర్చించింది. ఈ సందర్భంలో పవన్ కల్యాణ్‌తో భేటీ సారాంశాన్ని చంద్రబాబు నేతలకు వివరించారు. త్వరలో మూడు స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నందున అభ్యర్థిని నిలబెట్టే అంశంపైనా టీడీఎల్పీలో చర్చ జరిగినట్టు విశ్వసనీయ సమాచారం.