- కేంద్రం ఇచ్చిన వేల కోట్ల నిధులను దారి మళ్లించారు
- కేంద్రమంత్రి పియూష్ గోయల్ విమర్శలు
విజయవాడ: ఐదేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించిందని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ విమర్శించారు. సీఎం జగన్ స్వార్థ్ధ ప్రయోజనాలే చూసుకున్నారని, ఏ వర్గాన్ని కూడా పట్టించుకోలేదనిన్నారు. రైతులు, కార్మికులు, యువతను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. విజయవాడలో గురువారం కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇసుక, ల్యాండ్, లిక్కర్ మాఫియాతో జగన్‌రెడ్డి, ఆయన పార్టీ నాయకులు కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. ప్రధాని ఆవాస్ యోజన కింద 23 లక్షల ఇళ్లను ఏపీకి ప్రధాని నరేంద్ర మోదీ కేటాయిస్తే, జగన్ ప్రభుత్వం కేవలం 3.5 లక్షల ఇళ్లనే నిర్మించిందన్నారు. కేంద్రం ఇచ్చిన వేల కోట్ల నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. అనేక ప్రాజెక్టుల్లో వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిరదని స్పష్టం చేశారు.
విశాఖ రైల్వే జోన్ ఇస్తామని విభజన చట్టంలో పేర్కొన్నారని, కానీ రైల్వే ప్రాజక్టులకు అవసరమైన భూములను జగన్ ప్రభుత్వం కేటాయించలేదని కేంద్రమంత్రి వివరించారు. ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తే విశాఖ రైల్వే జోన్ సాకారమవుతుందని ఉద్ఘాటించారు. ఏపీలో కూటమి విజయం సాధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఎన్నో సహజవనరులు ఉన్నాయని గోయల్ తెలిపారు. పంచాయతీలకు కేటాయించిన నిధులు జగన్‌రెడ్డి దుర్వినియోగం చేశారన్నారు. గ్రామాల అభివృద్ధి లేకుండా జగన్ సొంత అవసరాలకు డబ్బులు వినియోగించారని, ఏపీని అన్ని విధాలా నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డని తీవ్రస్థాయిలో విమర్శించారు.