- పులివెందులలోనూ సానుభూతి డ్రామాలా
- చెల్లెలి చీరపై మాట్లాడేంతగా దిగజారాలా
- ధ్వజమెత్తిన టీడీపీ నేత బీటెక్ రవి
కడప: రాష్ట్రంలో పెత్తందార్లకు అసలైన ప్రతినిధి సీఎం జగనేనని టీడీపీ నేత, ఆ పార్టీ పులివెందుల అభ్యర్థి బీటెక్ రవి విమర్శించారు. వేల కోట్ల ఆస్తులున్న జగన్ ఎక్కడికి వెళ్లినా పేదలకు, పెత్తందార్లకు మధ్య పోరాటం జరుగుతోందని ఊదరగొడుతున్నారని ధ్వజమెత్తారు. కడపలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ నేత శ్రీనివాసరెడ్డితో కలిసి బీటెక్ రవి మాట్లాడుతూ ఎన్నికల అఫిడవిట్ లో సుమారు రూ.750 కోట్ల ఆస్తులు ఉన్నట్లు జగన్ పేర్కొన్నారని.. ఆయనపై పోటీ చేస్తున్న తన ఆస్తి దాదాపు రూ.80 లక్షలు మాత్రమేనని బీటెక్ రవి చెప్పారు. దీన్ని బట్టి పేదవాడు ఎవరో? పెత్తందారు ఎవరో పులివెందుల ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు. నుదిటికి ప్లాస్టర్‌తో వచ్చి పులివెందులలోనూ సానుభూతి సంపాదించాలనుకుంటున్నారా.. ఇక్కడి ప్రజలు అంత అమాయకులని భావిస్తున్నారా? అని ధ్వజమెత్తారు.
ప్రజలు ఆలోచించుకోవాలి
సొంత చెల్లెలు షర్మిల వస్త్రధారణపై జగన్ చాలా అసభ్యకరంగా మాట్లాడారని.. ఏ స్థాయికి ఆయన దిగజారిపోయారో ప్రజలు ఆలోచించాలని బీటెక్ రవి కోరారు. సీఎం సతీమణి భారతి పసుపు వస్త్రాలు ధరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇంట్లో ఉన్న ఆ రంగు చీరలను బయట పడేస్తారా? వివేకాకు రెండో పెళ్లి జరగలేదా? అంటూ సొంత చిన్నాన్న గురించి పులివెందులలోనే మాట్లాడటం సిగ్గుచేటుగా లేదా? 2017 ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనే జగన్‌కు ఈ విషయం తెలుసు.. అయినా ఎమ్మెల్సీ టికెట్ ఎలా ఇచ్చారు? అప్పుడు వివేకా వ్యక్తిత్వం గుర్తురాలేదా? ప్రతిపక్షంలో ఉన్నా మేం ఏనాడూ వివేకా వ్యక్తిగత జీవితంపై మాట్లాడలేదు. కానీ సొంత అన్న కుమారుడే వివేకాపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణం’’ అని బీటెక్ రవి అన్నారు.
వివేకా హత్య కేసులో సీబీఐ నిందితుడిగా చేర్చిన అవినాష్‌రెడ్డికి సీఎం జగన్ ఏ విధంగా క్లీన్చిట్ ఇస్తారని బీటెక్ రవి ప్రశ్నించారు. విధిలేని పరిస్థితుల్లోనే చిన్నపిల్లాడు, అమాయకుడని అవినాష్‌ను జగన్ వెనకేసుకొస్తున్నారని ఆరోపించారు. జగన్ నామినేషనుకు డబ్బు, మద్యం ఇచ్చి జనసమీకరణ చేశారని బీటెక్ రవి అన్నారు. సీఎం అహంకారానికి, సొంత నియోజకవర్గం పట్ల చూపిన నిర్లక్ష్య వైఖరికి ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారన్నారు.