- 32మంది వృద్ధుల మరణాలు ప్రభుత్వ హత్యలే
- పథకం ప్రకారమే జరిగిన కుట్ర
- జగన్‌వి దుర్మార్గ శవరాజకీయాలు
- అతనిపై కేసులుపెట్టి లోపల వేయాలి
- పేదల పక్షాన ప్రశ్నించే హక్కు నాది
- పాలకుడిగా జగన్ సమాధానం చెప్పాలి
- తెదేపా అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
- పింఛన్ల సక్రమ పంపిణీ బాధ్యత సర్కారుదే
- చాతకాకుంటే తప్పుకోమన్న బాబు
గోపాలపురం, కొవ్వూరు (చైతన్య రథం): రాష్ట్రంలో పెన్షన్ పంపిణీ రాద్ధాంతంలో చోటుచేసుకున్న వృద్ధుల మరణాలన్నీ జగన్ చేసిన హత్యలుగా పరిగణించాలని, వృద్ధులను చంపింది జగనేనని తెలుగుదేశం జాతీయా ధ్యక్షుడు చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. 32మంది పెన్షన్‌దారులు చనిపోయినట్టు అధికార పక్షమే చెప్తోందని, అవన్నీ ప్రభుత్వ హత్యలేనన్నారు. 3వ తేదీన పెన్షన్ ఇస్తామంటూ గతనెల 28నే ప్రకటించడాన్ని చూస్తుంటే, వృద్ధులను చంపడానికి ముందుగానే పథకం వేసినట్టు అర్థమవుతుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల తరుణంలో శవరాజకీయాలకు తెరలేపిన జగన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పింఛను పంపిణీపై రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాల్ని ఉద్దేశించి మాట్లాడుతూ `‘జగన్‌కు బుద్దీ జ్ఞానం లేదు. ప్రభుత్వం జగన్‌దే. ముఖ్యమంత్రి జగనే. ఎలాంటి అవకతవకలు, అవాంతరాలు తలెత్తకుండా పెన్షన్లు పంచొచ్చు. 1.3లక్షల సచివాలయ ఉద్యోగులు న్నారు. అయినా పింఛన్లు అందించలేకపోయారని, ముఖ్యమంత్రి తన అసమర్థతో వృద్ధుల ఉసురు తీశాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాగళం ఎన్నికల ప్రచార సభల్లో భాగంగా గురువారం కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాల్లో పెద్దఎత్తున నిర్వహించిన సభల్లో చంద్రబాబు మాట్లాడారు. ‘రాష్ట్రంలో సమస్య తలెత్తినపుడు పేదల తరఫున ప్రశ్నించే హక్కు నాది. తప్పు చేస్తే ప్రజాసహకారంతో భూస్థాపితం చేస్తా’ అంటూ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు. ‘ఈ రోజు పెన్షన్లు పంపిణీ చేయకపోతే, ఈనెల నుంచే రూ.4000 ఇస్తానని చెప్పా. దీంతో జగన్ వెన్నులో వణుకు మొదలైంది. పింఛను పంపిణీ మొదలుపెట్టాడు. 86 శాతం డిస్ట్రిబ్యూషన్ పూర్తి చేశారు. ఈ బుద్ధి రెండు రోజుల ముందు ఏమైంది? అని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ డిఎన్‌ఏలోనే శవరాజకీయం ఉందని, జగన్ రెడ్డికి అదే అలవాటుగా మారిందని విమర్శించారు. మనుషుల ప్రాణాలు తీసి.. ఎదుటివారిపైకి నెట్టి.. సానుభూతితో ఓటడిగే దుర్మార్గుడు జగన్ అని దుయ్యబట్టారు. తెలుగుదేశం డిఎన్‌ఏలో సేవా రాజకీయం ఉందని అంటూ, శవరాజకీయాలకు, సేవా రాజకీయాలకు ఉన్న తేడాను ప్రజలు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. జగన్‌రెడ్డి చేసినదంతా చేసేసి నంగనాచిలా మాట్లాడుతున్నాడన్నారు. ఆయన ఒక్కో మీటింగ్‌కు 1500 బస్సులు పెడుతున్నారు. మద్యం పోసి ప్రజలను మీటింగులకు తరలిస్తున్నారు. పేదలకు పింఛన్ ఇవ్వమని బెదరిస్తున్నారు. పెన్షన్ ఏమన్నా వీళ్ల తాత సొత్తా. న్యాయానికి న్యాయం, ధర్మానికి ధర్మం, దెబ్బకు దెబ్బ తీయడానికి సిద్ధంగా ఉన్నాం. ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
జగన్ అనుసరిస్తున్న శవరాజకీయాలను ప్రజలు ఆమోదించరని అంటూనే, అలాంటి నీచ రాజకీయాల కు దిగజారవద్దని హితవు పలికారు. రాష్ట్రాన్ని వల్లకాడు చేయడం ఎంతమాత్రం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. ‘నేనే ముఖ్యమంత్రిని అయివుంటే మొదటిరోజే పింఛనుదారులు అందరికీ ఇంటి వద్దనే పింఛన్లు అందేలా చేసేవాడిని. అది నా సమర్థత’ అని చంద్రబాబు స్పష్టంచేశారు. నిజానికి పింఛన్లు చెల్లిం చేందుకు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని, అందువల్లే అపసవ్యమార్గాలను అనుసరిస్తోందని వ్యాఖ్యానించారు. వాలంటీర్ల వ్యవస్థను ప్రస్తావిస్తూ `ప్రజా సేవకులుగా వాలంటీర్లు ఉన్నంత వరకూ ఇబ్బంది లేదు. పేదలు కట్టే పన్నులతో ప్రభుత్వ ధనంగా జీతాలు తీసుకుంటు న్నారు. ప్రజలకు మంచి చేస్తే ఎవరూ ఏమీ అనరు. వైసీపీకి ఊడిగం చేస్తే సహించేది లేదని చాలాసార్లు చెప్పాను. ఎన్నికల సంఘం సైతం ఎన్నికల విధులకు వాళ్లను దూరం పెట్టింది. అందులో తప్పేమీ లేదు’ అని వ్యాఖ్యానించారు. గతంలో 2 వందలున్న పింఛన్‌ను 2 వేలు చేశానని గుర్తు చేశారు. ఇంటికి పెద్ద కొడుకులా ఉంటానని ఆరోజే చెప్పాను. 2వేలు ఇస్తానని చెప్పి అమలు చేసిన వ్యక్తిని నేను. అన్నా క్యాంటిన్‌కు వెళ్లి మూడు పూటలా భోజనం చేసేవారు. మందులు కూడా ఫ్రీగా ఇచ్చేవాడిని. ఖర్చు లుపోను, మిగిలిన వెయ్యి రూపాయలు మనవళ్లకు, మనవరాళ్లకు ఆనందంగా ఖర్చుపెడితేవారు గారాబంగా చూసుకునేవారు. అలాం టి హక్కు నేనే కల్పించానని చంద్రబాబు చెప్పారు.
హెలికాప్టర్ ప్రమాదంలో తండ్రి చనిపోతే `రిలయన్స్‌పై నేరం మోపిన జగన్, అధికారంలోకి రాగానే అదే రిలయన్స్‌వారికి రాజ్యసభ సీటిచ్చి శవరాజకీయం చేశాడన్నారు. 2014లో తండ్రిలేని బిడ్డనని చెప్పుకుని ఓటడిగాడని, 2019లోనూ మళ్లీ శవరాజకీయానికి తెరలేపాడున్నారు. కోడికత్తి డ్రామా, బాబాయి బాత్రూం మర్డర్, ఆ నెపాన్ని నాపైకి నెట్టడం శవరాజకీయంలో భాగమేనన్నారు. ‘బాబాయిని ఎవరు చంపారో, జగన్‌రెడ్డీ ఇప్పటికైనా సమాధానం చెప్పు. నీ చెల్లెలు సమాధానం అడుగుతుంది’ అని అంటూ, ఇలాంటి శవ రాజకీయాలు చేసే వారు మనకు అవసరమా? అని చంద్రబాబు ప్రజలకు అడిగారు. అరాచకాలకు పాల్పడే నువ్వు పార్టీ గుర్తుగా గొడ్డలి పెట్టుకోమంటూ ఎద్దేవాచేశారు. ఫ్యాన్‌ని ముక్క లు చేసేందుకు ప్రజలు సిద్ధమయ్యారన్నారు. జగన్‌రెడ్డి పాలనలో రైతులు, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఏ వర్గమూ సంతోషంగా లేదని, ఏ వర్గానికీ ఎలాంటి ప్రయోజనం ఒనగూరలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌రెడ్డి లాంటి అరాచకాన్ని అంగీకరిస్తామా? అని నిలదీశారు.
నాది విజన్.. జగన్‌ది పాయిజన్
విజన్ ఉండే వ్యక్తిని నేనైతే జగన్‌ది పాయిజన్. దూరదృష్టి ఉండే పార్టీ టీడీపీ. జగన్ మొత్తం దోచేసు కుని ప్రజల పట్ల విషం చిమ్మేపార్టీ అని దయ్యబట్టారు. పశుపతి అని తనను జగన్ కామెంట్ చేశాడని, శివుడు ఏవిధంగా విషాన్ని కంఠంలో పెట్టుకొని అమృతం కోసం పోయినట్లు నేను మంచి కోసం ముందుకు వెళ్తున్నానని చంద్రబాబు అన్నారు. జగన్ ఏసీ బస్సుల్లో తిరుగుతుంటే, తాను రోడ్లపై తిరుగుతున్నానని, అతను జనాల్ని తోలుతుంటే, తాను స్వచ్ఛందంగా వచ్చే జనాలతో మాట్లాడుతున్నానని అన్నారు. జగన్ నీ నాటకాలిక సాగవు. తల్లికి వందనంలో మోసం చేశావు. కోతల రాయుడివి నువ్వు అని విమర్శించారు. ఒక బిడ్డ ఉంటే రూ.15వేలు, ఇద్దరుంటే 30వేలు, ముగ్గురుంటే 45 వేలు, నలుగురు పిల్లలుంటే 60 వేలు ఇచ్చే బాధ్యత తనదని, తాను పేదల మనిషినని అంటూ, జగన్‌రెడ్డి దేశంలోనే అత్యంత ధనవంతుడైన సీఎం, పెత్తందారు అన్నారు.
జగన్.. పేదల మనిషా?
43 వేల కోట్లు దిగమింగి, సీబీఐ, ఈడీ ఛార్జిషీట్లు ఎదుర్కొంటున్న జగన్‌రెడ్డి పేదల మనిషా అని నిల దీశారు. నిజానికి ఇది పాత లెక్కని, ఈ ఐదేళ్లలో ఎన్ని లక్షల కోట్లు వెనకేశాడో అర్ధంకాని పరిస్థితి అన్నారు. పేదలకు కడుపు నింపడం కోసం అన్న క్యాంటీన్ పెట్టిన మనిషి పెత్తందారుడా? రద్దుచేసి కడుపు కొట్టినోడు పెత్తందారుడా? పేద పిల్లలకు విదేశీ విద్యతో పేదలకు ప్రపంచ దేశాల్లో చదివించిన వారు పెత్తందారుడా? రద్దు చేసిన వారు పెత్తందారుడా? ఈయన కుమార్తెలు లండన్, అమెరికాలో చదువు కుంటారు. పేదల పిల్లలు మాత్రం విదేశాల్లో చదవకూడదా? తెలివైన వారిని ఎంతవరకైనా చదివించి, ఉన్నత ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది అని చంద్రబాబు హామీ ఇచ్చారు. అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని విధ్వంసానికి గురి చేసి, అప్పులు మిగిల్చిన జగన్‌ను క్షమించేది లేదన్నారు. మాటలతో సంపద రాదు. అభివృద్ధి చేస్తేనే సంపద సృష్టి జరుగుతుందని చంద్రబాబు అన్నారు. ‘రోడ్లు వేయడం, పరిశ్రమలు తీసుకురావడం, కాలేజీలు రావడంతో భూముల విలువ పెరుగుతుంది. తలసరి ఆదాయం పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరుగుతుంది. అంతేగానీ, అప్పులు చేసి సంక్షేమం చేయడం అభివృద్ధి కాదు. కాళ్లు కడుక్కోవడానికి కూడా నీళ్లు లేని పరిస్థితులు రాష్ట్రం లోని చాలా ప్రాంతాల్లో నెలకొంది. హామీ ఇస్తున్నా. సంపద సృష్టిస్తా. దాన్ని ప్రజలకు పంపిణీ చేస్తా. నాకు విజన్ ఉంది. నిర్ధిష్టమైన ప్రణాళిక రూపొందించాను’ అని చంద్రబాబు ధీమాగా ప్రకటించారు.
రాష్ట్రానికి బెస్ట్ డ్రైవర్‌ను
రాష్ట్రాభివృద్ధికి తాను బెస్ట్ డ్రైవర్‌నని చంద్రబాబు అభివర్ణించుకున్నారు. పెరిగిన ధరలు తగ్గిస్తానని, ఆడ బిడ్డలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇంటికి పంపిస్తానని హామీ ఇచ్చారు. ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తానని, ఆడబిడ్డలు బస్సులు ఎక్కి సూపర్ సిక్స్ చంద్రన్న ఇచ్చిన వరం అని గట్టిగా చెప్పండి. మీరెవ్వరూ అడ్డుపడలేరని గట్టిగా చెప్పండి అని చంద్రబాబు ఉత్సాహంగా ప్రకటించారు.