- ఆ వివాదంతో టీడీపీకి, చంద్రబాబుకు సంబంధమేంటి
- వైవీ, కరుణాకర్‌రెడ్డి, సజ్జల పిచ్చిప్రేలాపనలు
- అబద్ధాలతో ప్రజలను ఎల్లకాలం మోసం చేయలేరు
- టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి ధ్వజం
అమరావతి (చైతన్యరథం): జగన్ కుటుంబంలో మహిళల ఆవేదన రాష్ట్రం మొత్తం చూస్తోంది.. సొంత తల్లిని, చెల్లిని బజారుకు ఈడ్చి, కోర్టుబోనుకు ఎక్కించి వారిని జగన్‌రెడ్డి మానసిక క్షోభకు గురిచేస్తున్నాడని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ధ్వజమెత్తారు. సొంత అన్న చేతిలో మోసపోయానంటూ మీడియా ముందుకు వచ్చి షర్మిల బోరున ఏడిస్తే జగన్ భజన బృందం మాత్రం విషయాన్ని తప్పుదారి పట్టిస్తూ ఆ కుటుంబ వివాదాన్ని సీఎం చంద్రబాబుకు ఆపాదించేందుకు యత్నిస్తున్నారని పట్టాభి మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో పట్టాభి మాట్లాడుతూ తన అన్నలాంటి దుర్మార్గుడు ఈ ప్రపంచంలో ఇంకోకరు ఉండరని షర్మిల బహిరంగంగానే చెప్పిందన్నారు. సొంత తల్లితో కంటనీరు పెట్టిస్తున్నాడని కన్నీరు పెట్టుకుంది. ఇంకా ఎందుకు బతికి ఉంచావు దేవుడా అని విజయమ్మ అన్నట్లుగా మీడియా ముందు షర్మిల కన్నీరు మున్నీరు అవ్వడం బాధాకరం. వృద్ధాప్యంలో ఉన్న తల్లిని క్షోభపెడుతూ జగన్ రెడ్డి రాక్షసానందం పొందుతున్నాడు. వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, కరుణాకర్ రెడ్డి వీరందరూ.. తాడేపల్లి కొంపకు ఊడిగం చేసే తోడుదొంగల ముఠా. తాడేపల్లి కొంప నుండి వచ్చిన ఆదేశాలను తోక ఊపుకుంటూ పాటిస్తుంటారు. తాడేపల్లి ప్యాలెస్ నుండి వచ్చే స్క్రిప్ట్‌ను నిబద్ధతతో మీడియా ముందుకు వచ్చి చదవడమే మాత్రమే వీరికి అప్పగించిన బాధ్యత అని పట్టాభి దుయ్యబట్టారు.
జనం గొర్రెలనుకుంటున్నారా..
సీఎం చంద్రబాబు చేతిలో షర్మిల కీలుబొమ్మ అని, చంద్రబాబు ఆడినట్లు షర్మిల ఆడుతుందని వైసీపీ నేతలు అంటున్నారు. ఆ కుటుంబంలో ఏది జరిగినా చంద్రబాబుకు ఆపాదిస్తున్నారు. నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. మీడియా ముందుకు వచ్చి పిచ్చిగా వాగుతున్నారు. ఈ పిచ్చి వాగుడు వాగే విజయసాయిరెడ్డి, కరుణాకర్ రెడ్డిలను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. 2019లో జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆయనకు, షర్మిలకు మధ్య కుదిరిన ఒప్పందానికి జగన్ రెడ్డి కట్టుబడి ఉండకుండా తిరిగి తనపై, తన తల్లిపై కేసుపెట్టారని షర్మిల మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి, షర్మిల ఎంఓయూ చేసుకునే ముందు చంద్రబాబును పిలిచి ఏమైనా ఒప్పందం చేసుకున్నారా? చంద్రబాబును మధ్యవర్తిత్వం పెట్టి ఏమైనా ఎంఓయూ చేసుకున్నారా? వారి ఒప్పందాలకు చంద్రబాబుకు ఏంటి సంబంధం ? సిగ్గులేకుండా చంద్రబాబు మీద పడి ఎందుకు ఏడుస్తున్నారు జగన్ రెడ్డి చేత కోర్టులో చంద్రబాబు ఏమైనా పిటిషన్ వేయించారా? తల్లి, చెల్లిపై పిటిషన్ వేయమని జగన్‌కు చంద్రబాబు చెప్పారా? మీరు ఏది చెబితే అది నమ్మడానికి జనం ఏమైనా గొర్రెలు అనుకుంటున్నారా. విజయసాయిరెడ్డి, కరుణాకర్ రెడ్డి ఇద్దరూ కొంచెమైనా బుద్ధి, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. రచ్చ చేసుకుని తల్లి, చెల్లిని కొర్టుకు లాగింది జగనే కదా? ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు వైసీపీ నేతలు పడరాని పాట్లు పడుతున్నారని పట్టాభి ధ్వజమెత్తారు.
కుంభకోణాల కరుణాకర్‌రెడ్డి
ప్రతి ఇట్లో ఉండే గొడవలే అంటూ, చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారని జగన్ రెడ్డి అంటుంటే, తానే తన చెల్లిని, తల్లిని కోర్టుకు ఈడ్చానని జగన్ రెడ్డి ఒప్పుకుంటుంటే.. విజయసాయి రెడ్డి, కరుణాకరరెడ్డి మాత్రం సిగ్గులేకుండా చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నారు. వాస్తవం ఏమిటో.. వెళ్లి మీ నాయకుడు జగన్ రెడ్డిని అడగండి. లేదా.. అక్కడ ఉండే జీతగాడు, స్క్రిప్టులు రాయించే సజ్జల రామకృష్ణారెడ్డిని అడగండి. తిరుపతి దొడ్డాపురం వీధిలో ఒక చిన్న ఇంట్లో అద్దెకున్న చరిత్ర కరుణాకర్ రెడ్డిది. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా కాట్రగడ్డ సాయి అనే వ్యక్తికి చెందిన జిరాక్స్ షాప్‌లో చిన్న భాగస్వామి కరుణాకరరెడ్డి. టీడీఆర్ బాండ్ల స్కామ్‌లో, టీటీడీలో స్వామివారి సొమ్ములు కొట్టేసి వేలకోట్లు కూడబెట్టింది వాస్తవం కాదా? కరుణాకర్ రెడ్డి ఇన్ని కోట్లు ఎలా సంపాదించారని పట్టాభి సూటిగా ప్రశ్నించారు.
చంద్రబాబుతో జగన్‌కు పోలికా?
ఒక కుటుంబాన్ని చూస్తే ఒక పండుగ గుర్తుకు రావాలి. అటువంటి కుటుంబం చంద్రబాబు కుటుంబం. సంక్రాంతి వస్తే అందరూ చంద్రబాబు ఇంట్లోనే ఉంటారు. ఆయన తన తండ్రి ఇచ్చిన ఆస్తులనే కాకుండా తన కష్టార్జితాన్ని కూడా చెల్లెళ్లకు ఇచ్చారు. తన అన్న జగన్ అన్యాయం చేశాడని షర్మిల ఏడ్చినట్లు.. తన అన్న చంద్రబాబు తమకు అన్యాయం చేశాడని ఏనాడు ఆయన చెల్లెళ్ల్లు బయటకు రాలేదు. తల్లిని, చెల్లిని రోడ్డుమీదకు ఈడ్చిన జగన్‌ను అసలు మనిషి అంటారా? మళ్లీ ఆయనను చంద్రబాబుతో పోల్చడానికి సిగ్గుండాలని పట్టాభి దుయ్యబట్టారు.
ఏ వ్యాపారాలతో సంపాదించారు..
జగన్ రెడ్డి అత్యంత కరుణామయుడు, దయామయుడని తోక పత్రికలో పిచ్చి రాతలు రాస్తున్నారు. జగన్‌రెడ్డి చెమటోడ్చి, తన తెలివితేటలతో సంపాదించిన సొమ్మును షర్మిల ఎలా అడుగుందని బ్లూ మీడియాలో రోత రాతలు రాస్తున్నారు. ఏ కష్టం చేసి జగన్ రెడ్డి ఇన్ని లక్షలు కోట్లు సంపాదించాడు. 2003 -2004 లో జగన్ రెడ్డి ప్రకటించిన ఆదాయం రూ.9 లక్షల 19 వేలు మాత్రమే. నేడు దేశంలో అత్యంత ధనిక ముఖ్యంత్రి జగన్ రెడ్డి అని జాతీయ మీడియా చెబుతోంది. 2024లో జగన్ రెడ్డి ప్రకటించిన ఆస్తులే దాదాపు రూ. 800 కోట్లు. తండ్రి ముఖ్యమంత్రి కాకముందు జగన్ రెడ్డి ఏ వ్యాపారం చేశాడు? 2001 వరకు జగన్ రెడ్డి పేరుమీద ఏ కంపెనీ లేదు. 2001లో దివాలా తీసిన సాండూర్ పవర్ కంపెనీని కర్నాటకలో ఉన్న వ్యక్తి దగ్గర నుండి జగన్ పేరుమీదకు బదలాయించారు. 1972 లో పుట్టిన జగన్ 29 సంవత్సరాలు వచ్చే వరకు పనిపాటలేకుండా గాలికి తిరిగేవాడు. చదువు కోసం అమెరికాకు పంపిస్తే పారిపోయి వచ్చాడని స్వయంగా ఆయన తండ్రే చెప్పాడు. తండ్రి ముఖ్యమంత్రి అయ్యాక పెట్టుబడిదారులను బ్లాక్‌మెయిల్ చేసి క్విట్ ప్రోకో ద్వారా జగన్ వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడు. న్యాయస్థానాలను కూడా తప్పుదోవ పట్టించి మొట్టికాయలు వేయించుకున్న వ్యక్తి జగన్ రెడ్డి. అసలు జగన్ రెడ్డి డిగ్రీ కూడా పూర్తి చేశారా అనేది అనుమానమే. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వ్యాపార సామ్రాజ్యం స్థాపించుకుని ప్రజల సొమ్ములు దోచుకోవడం మాత్రమే జగన్‌కు తెలుసు. అధికారం అడ్డం పెట్టుకుని చంద్రబాబు ఏనాడూ వ్యాపారం చేయలేదు. హెరిటేజ్ సంస్థను ఆయన అధికారంలో లేనప్పుడు పెట్టారు. భువనేశ్వరమ్మ, బ్రాహ్మణిలు 30 సంవత్సరాలకు పైగా కష్టబడి తమ మేధస్సుతో వ్యాపారాన్ని విస్తరింపజేసుకున్నారని పట్టాభి తెలిపారు.
క్విడ్ ప్రో కోలో ఆరితేరిన విజయసాయి..
క్విట్ ప్రోకో విధానంలో సొమ్ములు కాజేయడంలో ఆరితేరిన వ్యక్తి విజయసాయిరెడ్డి. జగన్ రెడ్డితో సూట్ కేస్ కంపెనీలు, షెల్ కంపెనీలు పెట్టించిందే విజయసాయిరెడ్డి. కూతురు పేరుతో వేలకోట్ల భూములు కబ్జా చేసి.. ఎన్నో కేసుల్లో ఏ2 ముద్దాయిగా ఉన్న వ్యక్తి. ఆఖరికి నీచంగా ఒక గిరిజన కుటుంబంలో చిచ్చు పెట్టిన వ్యక్తి. డీఎన్‌ఏ టెస్ట్ అంటే పారిపోయిన వ్యక్తి ఈ విజయసాయిరెడ్డి. సిగ్గులేకుండా నేడు కుటుంబాల గురించి మాట్లాడుతున్నాడు. రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక రిలయన్స్ హస్తం ఉందని అప్పట్లో ఆ సంస్థ స్టోర్‌లను తగలబెట్టించి విధ్వంసానికి తెరతీశారు. మళ్లీ అదే రిలయన్స్ సంస్థకు చెందిన పరిమళ్ నత్వానీకి వైసీపీ తరఫున రాజ్యసభ సీటు ఇచ్చారు. ఇప్పుడేమో రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక షర్మిల హస్తం ఉందని కారుకూతలు కూస్తున్నారు. ఆధారాలు లేకుండా నోటికి ఏది వస్తే అది వాగడం, నోరుపారేసుకోవడం వైసీపీ నేతలకు పరిపాటిగా మారింది. 2019 ఎన్నికలకు ముందు తిరుమల స్వామివారి పింక్ డైమండ్ మాయమయిందన్నారు. చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. తరువాత పింక్ డైమండే లేదన్నారు. విజయసాయిరెడ్డి మాట్లాడే మాటలకు ఏమైనా విలువ ఉందా అని పట్టాభి తప్పుబట్టారు.
సుబ్బారెడ్డికి ఆ అర్హత లేదు..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బమిడకలొద్ది వద్ద ల్యాటరైట్, బాక్సైట్ అక్రమంగా తవ్వుకుని వేలకోట్ల రూపాయలు దోచుకుని, టీటీడీ టికెట్లు సైతం అమ్ముకున్న చరిత్ర సుబ్బారెడ్డిది. తిరుమల స్వామి వారి ప్రసాదాన్ని కూడా కలుషితం చేసిన ద్రోహులు మీరు. అసలు ఏ అర్హత ఉందని మీరు చంద్రబాబు కుటుంబం గురించి మాట్లాడుతున్నారు? నీచుడైన జగన్ నాయకత్వంలో పనిచేయడానికి మీకు సిగ్గుండాలి. తాడేపల్లి కొంపనుండి పంపించిన స్క్రిప్ట్‌లు చదవడమే మీకు తెలుసు. మీరు దోచుకున్నవన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. ఈ అసంబద్ధ ప్రేలాపనలు, పిచ్చి మాటలు ఇక కట్టిబెట్టాలి. తల్లిని, చెల్లిని రోడ్డుమీదకు ఈడ్చి క్షోభపెడుతున్నందుకు జగన్ మొఖాన జనం ఉమ్ముతున్నారు. ప్రజలు 11 సీట్లు ఇచ్చి బుద్ది చెప్పినా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. ఇంకోసారి చంద్రబాబు కుటుంబం గురించి నోరు జారితే సహించేది లేదు. వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న విజయసాయిరెడ్డి.. ఎర్రన్నాయుడి గురించి పిచ్చిమాటలు మాట్లాడుతున్నాడు. ఇక ఒక్క మాట నోరు జారినా ఖబడ్దార్. ఎర్రన్నాయడిని ఉత్తరాంధ్ర ప్రజలు దేవుడిగా కొలుస్తారు. విజయసాయిరెడ్డి ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలి. లేదంటే అక్కడి ప్రజలే పిచ్చికుక్కను కొట్టినట్లు కొట్టి తరిమేస్తారని పట్టాభి హెచ్చరించారు.