- ట్రిపుల్ ఐటిలో మౌలిక సదుపాయాల కల్పన హామీ ఏమైంది?
- డెల్టా సుగర్ తెరిపిస్తామని చెప్పి మాటతప్పి మడమతిప్పారు
- జగన్ రెడ్డి హామీలు – నీటిమీద రాతలు – 14
(చైతన్యరథం ప్రత్యేక ప్రతినిధి – అమరావతి)
చైతన్యానికి మారుపేరైన కృష్ణాజిల్లా ప్రజలు జగన్మోసానికి బలయ్యారు. ప్రజాసంకల్పయాత్రలో ఉమ్మడి కృష్ణాజిల్లాకు 22 హామీలు ఇచ్చిన జగన్ ఒకే ఒక్క హామీని మాత్రం పాక్షికంగా అమలుచేసి, మిగిలినవన్నీ గాలికొదిలేశారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి బ్రోకర్లను ఏర్పాటుచేసుకొని క్యాసినో, పేకాట క్లబ్బులను నిర్వహిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలకు నీళ్లొదిలారు. నూజివీడు ట్రిపుల్ ఐటిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పి, కనీస సదుపాయాలు కూడా కల్పించలేదు. డెల్టా సుగర్స్ ను పునఃప్రారంభించి రైతులు, కార్మికులను ఆదుకుంటామన్న హామీ అమలు కాలేదు. బందరు పోర్టు నిర్మాణం హామీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా తయారైంది. మచిలీపట్నంలో భూకబ్జాలను అడ్డుకుంటామని చెప్పి, తన సామంతరాజులతో యథేచ్చగా భూఆక్రమణలకు పాల్పడుతున్నారు. నీరు-చెట్టు పథకాన్ని పారదర్శకంగా అమలుచేసి కూలీలను ఆదుకుంటామని చెప్పి, అసలు పథకమే లేకుండా చేశారు. ఉప్పుటేరు ముఖద్వారం వద్ద రెగ్యులేటర్ ఏర్పాటు చేస్తామని చెప్పి, 4.9ఏళ్లుగా పట్టించుకున్న పాపానపోలేదు. అక్రమ మట్టి, ఇసుక, గ్రావెల్ తవ్వకాలకు చెక్ పెడతానన్న జగన్… తానే మాఫియారాజ్ అవతారమెత్తి తమ సామంతరాజులతో యథేచ్చగా సహజవనరుల దోపిడీకి పాల్పడుతున్నారు. కొల్లేరు కాంటూరు హద్దులపై రీసర్వే చేయించి, మిగులు భూములతో పేదలకు మేలు చేస్తామని చెప్పిన హామీని అటకెక్కించారు. కలిదిండి మండలం పెదలంక డ్రైన్ మీద గతంలో ఉన్న అండర్ టన్నెల్‌కు గేట్లు ఏర్పాటు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని చెప్పి ఆ ఊసే ఎత్తడంలేదు. బుగ్గలు నిమురుతూ ముద్దులుపెట్టి ఒక్కచాన్స్ పేరుతో అధికార పగ్గాలు చేపట్టిన జగన్… మాటతప్పుడు, మడమ తిప్పుడుకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయారు.