- ప్రజలకు పిలుపునిచ్చిన వివేకా కుమార్తె సునీత, భార్య సౌభాగ్యమ్మ
- అంత:కరణ శుద్ధి అంటే తెలుసా జగనన్నా అని నిలదీసిన సునీత
- నాన్నను మేమే చంపివుంటే పట్టించి నగదు బహుమతి అందుకోండి
- రక్తపు మరకలు వదిలించుకోవాలంటే వైసీపీ నుంచి బయటికి రావాలి
- నా భర్త హంతకుల్ని జగన్ కాపాడుతున్నారన్న సౌభాగ్యమ్మ
- రాష్ట్రానికి మంచి పాలకుడు రావాలన్న వివేకా సతీమణి
- వివేకా భార్య, కుమార్తె పిలుపుతో కడప జిల్లాలో ప్రకంపనలు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఐదవ వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి, భార్య సౌభాగ్యమ్మ వివేకా హత్య జరిగిన తీరు, అనంతర పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తూ.. ఈ మొత్తం వ్యవహారంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తీరుపై ధ్వజమెత్తారు.శుక్రవారంనాడు కడపలో జరిగిన వివేకా స్మారక సభలో సునీత తన బాధను, ఆందోళనను వ్యక్త పరచగా సౌభాగ్యమ్మ ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో తన మనోగతాన్ని వెల్లడిరచారు. రానున్న ఎన్నికల్లో జగన్‌రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేయాలని వారిద్దరు ప్రజలకు పిలుపునిచ్చారు.
రక్తపుధారల్లో వైసీపీ పునాదులు
తన తండ్రి వివేకానందరెడ్డి మృదు స్వభావాన్ని, మంచితనాన్ని, వ్యక్తిత్వాన్ని పెదనాన్న రాజశేఖర్ రెడ్డితో ఆయనకు ఉన్న ఆత్మీయతను గుర్తు చేసుకున్న సునీత వివేకా హత్య జరిగిన విధానాన్ని, హంతకులకు లభి స్తున్న రక్షణను వివరిస్తూ తన మనో వేదనను బహి ర్గతం చేశారు. వైఎస్ కుటుంబం కోసం నిరంతరం పనిచేసిన వివేకా గతాన్ని మరచిపోయారా అని హత్య సూత్రధారులను సునీత ప్రశ్నించారు. అన్నం పెట్టిన చేతిని నరకటం..వివేకా వ్యక్తిత్వం మీద బురద జల్లడం దారుణమని ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. గొడ్డలి వేటుకు చిందిన వివేకా రక్తం.. కోడికత్తి రక్తంలో వైసీపీ పునా దులు ఉన్నాయని సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఈ పాపంలో భాగ స్వాములు కాకుండా ఉండాలంటే వారంతా పార్టీని వదలి బయటికిరావాలని కూడా ఆమె పిలుపునిచ్చారు. వివేకా ఆత్మసాక్షిగా సంకల్పం తీసుకొని, పవిత్రమైన మన ఓటు ద్వారా.. చెడు మీద మంచి, అబద్ధంపై నిజం, అన్యాయంపై న్యాయం గెలుస్తుందని నిరూపిం చాలని ఎంతో ఆవేదనతో సునీత విజ్ఞప్తి చేశారు.
అంత:కరణ శుద్ధి అంటే తెలుసా జగనన్నా?
తన తండ్రి వివేకానందరెడ్డికి అంత కీడుఎలా తలపెట్టా రని ఆలోచిస్తున్నప్పుడే జగనన్న సీఎం అయ్యారని, ప్రజ లందరికి న్యాయం చేస్తానని ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పడు ఎంతోగర్వించామని..అయితే నేడు ‘అంత: కరణ శుద్దిగా’అంటే అర్థం తెలుసా జగనన్నా అని సునీ త నిలదీశారు. వివేకాను చంపినవారికి, చంపించిన వారికి శిక్షపడేలా చేయాల్సిన బాధ్యత ఉండి కూడా హత్య జరిగి ఐదేళ్లయినా హంతకులకు శిక్షపడేలా ఎం దుకు చేయలేదని, ప్రమాణాన్ని ఎందుకు నిలుపు కోలేదని ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిని సునీత నిలదీశారు.
మేమే హంతకులమైతే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
నేరస్థులకు శిక్ష పడాలని పోరాడుతున్న నాపై నింద లు మోపటం న్యాయమా? నా కుటుంబానికి వివేకా హత్యతో సంబంధం ఉందని చెప్పటం మీకు ఎబ్బెట్టుగా లేదా? అధికారంలో ఉండి ఇలాంటి ఆరోపణలు చేయడమేంటి? పక్షపాతం లేకుండా వ్యవహరిస్తానని ప్రమాణం చేసిన మీరు మమ్ములను పట్టించి.. హంత కులను పట్టంచినవారికి లభించే రూ.5 లక్షలు బహు మతి పొందవచ్చుకదా అని సునీత అన్నారు. సాక్షి పత్రి కలో మాపై పదేపదే నిందలు మోపుతూ వార్తలు రాస్తు న్నారు.. ఆధారాలుంటే సీబీఐకి ఇవ్వండని సాక్షి ఛైర్మన్ భారతికి సునీత విన్నపం చేశారు. ఆధారాలు ఉండి పోలీసులు ఇవ్వకపోవటం నేరమని ఆమె అన్నారు.