- మంగళగిరిని నా సొంతం చేసుకుని అహర్నిశలు కష్టపడ్డా
- బాపనయ్య నగర్ రచ్చబండ కార్యక్రమంలో నారా లోకేష్
మంగళగిరి(చైతన్యరథం): ఎన్నికల్లో లబ్ధి కోసం గులకరాయితో తనపై హత్యాయత్నం చేశారంటూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి డ్రామాలాడుతున్నారని టీడీపీ యువనేత నారా లోకేష్ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి బాపనయ్య నగర్-హుడా కాలనీలో మంగళవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో యువనేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. 2019లో కోడికత్తితో జగన్ రెడ్డే పొడిపించుకుని సానుభూతి డ్రామా ఆడారన్నారు. ఇప్పుడు గులకరాయి వేయించుకొని డ్రామా ఆడుతున్నారు. 2014లో తండ్రి శవాన్ని, 2019లో సొంత బాబాయి చంపి నెపం మాపై వేశారు. నేడు సునీతారెడ్డి బయటకు వచ్చి వాస్తవాలు చెప్పడంతో జగన్నాటకం బయటపడిరది. ఈ నెలలో ఒకటో తేదీనే పింఛన్ ఇవ్వకుండా 32 మంది వృద్ధులను చంపి శవరాజకీయం చేశారు.
రూ.200 పెన్షన్ ను రూ.2వేలు చేసింది, రేపు కూటమి ప్రభుత్వం రాగానే రూ.3వేల పెన్షన్ ను రూ.4వేలు చేసేది చంద్రబాబే. వాలంటీర్ వ్యవస్థను కొనసాగించి పింఛన్‌తో పాటు అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇంటివద్దనే అందిస్తాం. ఓడిపోయినా మంగళగిరిని నా సొంతం చేసుకుని అహర్నిశలు కష్టపడ్డా. ప్రతిపక్షంలో ఉండి 29 అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. పేదరికం లేని మంగళగిరిగా తీర్చిదిద్దుతా. అభివృద్ధి, సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్ గా మంగళగిరి నియోజకవర్గాన్ని మారుస్తా. తనను ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని లోకేష్ కోరారు.
యువనేత దృష్టికి హుడా కాలనీ సమస్యలు
మంగళగిరి బాపనయ్య నగర్-హుడా కాలనీ వాసులు తమ సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. తలసేమియా వ్యాధితో బాధపడేవారిని ఆదుకోవాలి. ఇళ్లు లేని వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. బీ-ఫారం పట్టాల్లో నివసిస్తున్న వారికి శాశ్వత పట్టాలు ఇవ్వాలి. షరతులు లేకుండా పింఛన్ అందించాలి. డ్రైనేజీ, రోడ్డు, తాగునీటి వసతి కల్పించాలి. నీటి వసతి లేని ప్రాంతంలో బోరింగ్ లు వేయాలి. టిడ్కో ఇళ్లకు రుణం చెల్లింపు భారంగా ఉంది. ముస్లిం మైనార్టీల శ్మశానానికి స్థలం కేటాయించాలని కోరారు. లోకేష్ స్పందిస్తూ.. తలసేమియాతో బాధపడేవారికి క్లినిక్ ఏర్పాటు చేసి ఆదుకుంటాం. నిరుపేదలకు ఇళ్లు నిర్మిస్తాం. బీ-ఫారం పట్టాల్లో నివసిస్తున్న వారికి శాశ్వత పట్టాలు అందజేస్తాం. కోతలు లేకుండా సంక్షేమం అందిస్తాం. శాశ్వత భూగర్భ డ్రైనేజీ నిర్మాణంతో పాటు కుళాయి ద్వారా ప్రతి ఇంటికి తాగునీటి వసతి కల్పిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.