విజయవాడ: గత అసెంబ్లీ ఎన్నికలలో గెలుపు కోసం జగన్ ఆడిన డ్రామాయే కోడి కత్తి దాడి అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. ఆంధ్రరాష్ట్రంలో అంటరానితనం విశృంఖలంగా ఉంది.. కానీ, అది బహిర్గతం కాకుండా దానిపైన రాజ కీయ మేలి ముసుగు కప్పి ఉందన్నారు. కోడికత్తి శ్రీనుకు న్యాయం చేయాలంటూ సమతా సైనిక్ దళ్ బుధవారం విజయవాడలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో వర్ల రామయ్య పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలని ఆశపడ్డ ఒక దళిత యువకుడు ఐదేళ్లుగా జైల్లో మగ్గిపోవడం అంటరాని తనమే అన్నారు. జనుపల్లి శ్రీను అనే దళిత యువ కుడికి బెయిల్ రాకపోవడం అంటరానితనం తప్ప మరోటి కాదు. కోడికత్తి శ్రీను ఇతర అగ్రవర్ణాలకు చెందిన యువకుడైతే ఇన్నేళ్లు జైల్లో మగ్గిపోయేవాడు కాదు. ఇతర కుల సంఘాల మాదిరి దళిత సంఘాలకు ఆర్థిక స్వావలంబన ఉండదు గనుకనే కోడికత్తి శ్రీను ఐదేళ్లుగా జైల్లో ఉన్నాడు. భారతదేశ న్యాయ చరిత్రలో 307 సెక్షన్ కింద ఆరోపణ ఎదుర్కొంటూ రిమాండ్ ఖైదీగా ఐదేళ్లు జైల్లో ఉండటం ఎక్కడా, ఎన్నడూ జరగలేదు. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించడానికి జగన్ మోహన్ రెడ్డి చేసిన కుట్రలో శ్రీను బలైపోయాడు. అధికారం లోకి రావడానికి జగన్‌రెడ్డి తొక్కిన అడ్డదారులకు కోడి కత్తి శ్రీను ఉదంతం ఒక మంచి ఉదాహరణ. జగన్ మోహన్‌రెడ్డిని ఎవరో చంపబోయినట్లుగా…చావు తప్పి కన్ను లొట్టబోయినట్టుగా ఒక అద్భుతమైన డ్రామా సృష్టించారు. ఎన్‌ఐఏ ఈ కేసు దర్యాప్తును నిశితంగా విచారణ చేసినట్లైతే కోడికత్తి కేసులో ప్రధాన ముద్దాయి జగన్ మోహన్ రెడ్డే అని తేలుతుంది. ఈ కేసులో జగన్ మోహన్‌రెడ్డి కోర్టుకు హాజరై సాక్ష్యం ఎందుకు చెప్పడం లేదో అర్థం కావడం లేదు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య మంత్రి కావడం కోసం శ్రీను అనే దళిత బిడ్డను వాడు కున్నాడు గనుక జగన్ మోహన్‌రెడ్డిని ఏ1 గా చేర్చాలని వర్ల డిమాండ్ చేశారు.