- 2.3 లక్షల విద్యార్థులు పాఠశాలలను వదిలేశారు
- కమీషన్ల కోసం పిచ్చి ప్రయోగాలు
- లోపభూయిష్ట విధానాలతో పాఠశాలలు సర్వనాశనం
- జగన్, వైసీపీ నేతలు జవాబు చెప్పాలి
- టీడీపీ అధికార ప్రతినిధి నీలయపాలెం విజయ్ కుమార్ ధ్వజం
అమరావతి (చైతన్యరథం): గత ప్రభుత్వ హయాంలో 2.3 లక్షల విద్యార్థులు ఎందుకు పాఠశాలలను వదిలేయాల్సి వచ్చిందో జగన్ రెడ్డి, వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ నిలదీశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…వైసీపీ ప్రభుత్వం ఆర్థిక రంగాన్ని సర్వనాశనం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దానిని చక్కదిద్దుతోందన్నారు. అలాగే విద్యారంగాన్ని సైతం వైసీపీ ప్రభుత్వం కకావికలం చేసింది. విద్యార్థుల భవిష్యత్తును అన్ని రకాలుగా నాశనం చేశారు. అప్పటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దీనికి ఆద్యుడుగా మారాడు. విద్యార్థుల భవిష్యత్తును తాకట్టు పెట్టారు. విద్యార్థుల్ని స్కూళ్ల నుంచి పంపేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల విద్యార్థులకు ఇంటి దగ్గరలో ఉన్న స్కూళ్లను మూసివేయించారు. కూటమి ప్రభుత్వం గత నాలుగు నెలల్లో ఈ విషయాలపై పరిశీలన చేసింది. 2 లక్షలకు పైగా విద్యార్థులు స్కూల్ డ్రాపవుట్స్‌గా మారారు.
స్కూళ్లకు వెళ్లడం మానేశారు. 1నుంచి 15 సంవత్సరాల లోపు వారు కచ్చితంగా బడికి వెళ్లాలన్న నిబంధనలకు నీళ్లొదిలారు. జగన్ విద్యార్థుల విషయంలో అతి దారుణంగా వ్యవహరించారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు తోడు ఆ శాఖలో ఆరుగురు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నా ఉపయోగం లేకుండా పోయింది. బహుశ ఏ శాఖలో కూడా ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉండరమో? విద్యాశాఖ దిగజారడంలో అప్పటి కీలక అధికారి ప్రవీణ్ ప్రకాష్ పాత్ర కూడా ఉంది. వైసీపీ హయాంలో విద్యాశాఖ ఏం సాధించిందో ప్రజలకు తెలపాలి. సీబీఎస్‌ఈ, బైజూస్ కంటెంట్, టోఫెల్ కోచింగ్ అంటూ కమీషన్లకు కక్కుర్తి పడ్డారు. నాడు నేడు పథకం ద్వారా స్కూళ్లకు రంగులు వేసి వేలకోట్ల రూపాయలు స్వాహా చేశారు. ఇంగ్లీష్ మీడియం, మధ్యాహ్న భోజన పథకంలో, ట్యాబ్‌ల కొనుగోలులో కూడా అవినీతికి పాల్పడ్డారు. జీవో నెంబర్ 117 తెచ్చి విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు గ్రామాల్లో పాఠశాలలు అవసరం లేదని కొత్త కొత్త నిబంధనలు తెచ్చారు. 3వ తరగతి నుంచి అందరూ మండల కేంద్రానికి వెళ్లి చదువుకోవాలనే నిబంధన పెట్టారని విజయ్ కుమార్ దుయ్యబట్టారు.
పిచ్చి ప్రయోగాలు
కూటమి ప్రభుత్వం వచ్చాక ఆర్థిక రంగాన్ని తీర్చిదిద్దడానికి అనేక కష్టాలు పడాల్సి వచ్చింది. విద్యారంగాన్ని సరిదిద్దడం అంతకంటే కష్టం అవుతోంది. జగన్, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆ శాఖ సెక్రటరీ వీరంతా.. ఐబీ విద్యా విధానం మంచిదా, బైజూస్ కంటెంట్ మంచిదా, దేంట్లో కమీషన్లు ఎక్కువ అంటూ రీసర్చ్ చేయడంలో మునిగిపోయి విద్యార్థుల చదువులను సర్వనాశనం చేశారు. గత ఐదేళ్లలో రాష్ట్ర విద్యార్థులపై జగన్ ప్రభుత్వం పిచ్చి,పిచ్చి ప్రయోగాలు చేసింది. దీంతో ప్రభుత్వ బడుల నుంచి విద్యార్థులు లక్షల సంఖ్యలో వెళ్ళిపోయారు. స్కూళ్ళకు రంగులన్నారు, నాడు – నేడు అన్నారు, అన్ని స్కూళ్లలో బలవంతంగా ఇంగ్ల్లీష్ మీడియం తెచ్చారు. మధ్యాహ్న భోజన పధకం పేరు మార్చారు. తర్వాత సీబీఎస్‌ఈకి మారి పోదాం అన్నారు, బైజూస్ కంటెంట్ ఫ్రీ అన్నారు ఆ పేరుతో పది లక్షల ట్యాబ్‌లు కొనిపించిన బైజూస్ ఓనర్ ఇప్పుడు అప్పులు పాలయి పారిపోయి దుబాయిలో దాక్కున్నాడు. చివర్లో కొత్తగా ఐబీ (Iఅ్‌వతీఅa్‌ఱశీఅaశ్రీ దీaషషaశ్రీaబతీవa్‌వ) సిలబస్ అంటూ మరో వెర్రి ప్రయోగం చేశారు. దీంతో పెద్ద ఎత్తున విద్యార్థులు.. ప్రభుత్వ స్కూళ్ళు మాకొద్దు అని ప్రైవేటుస్కూళ్ళకు వెళ్ళారు. కొంత మంది పాఠశాల విద్యకు దూరమయ్యారు. ఇంత జరుగుతుంటే జగన్, విద్యాశాఖ మంత్రి, పాఠశాల విద్య కార్యదర్శులు చోద్యం చూస్తూ గడిపేశారని విజయ్ కుమార్ దుయ్యబట్టారు.
లోపభూయిష్ట విధానాలతో..
మరోపక్క పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. జగన్ ప్రభుత్వమే నియమించిన బాలకృష్ణ కమిషన్ చెప్పిన లెక్కల ప్రకారమే మూడేళ్లలో 27 వేల మంది ఉపాధ్యాయులు తగ్గిపోయారు. సింగిల్ టీచర్ స్కూళ్లు 9 వేలకు పైబడి ఉన్నాయి. 2022తో పోలిస్తే తరువాతి సంవత్సరాల్లో ప్రైవేటు స్కూళ్ళలో 5 లక్షల మంది విద్యార్థులు పెరిగినట్టు అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. జగన్ పాలనలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయకపోవడమే విద్యా రంగానికి ఆయన చేసిన ద్రోహానికి అద్దం పడుతోంది. స్థూలంగా జగన్ ప్రవేశ పెట్టిన లోపభూయిష్ట విధానాలే విద్యారంగం నాశనానికి కారణమని విజయ్ కుమార్ ధ్వజమెత్తారు.
హేతుబద్ధీకరణతో పాఠశాలల మూత
మూడో తరగతి నుంచి సబ్జెక్టు టీచర్లతో బోధన పేరుతో చేసిన హేతుబద్ధీకరణతో చాలా పాఠశాలలు మూతపడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 4,234 ప్రాథమిక పాఠశాలల విద్యార్థులను ఉన్నత పాఠశాలల్లో ప్రభుత్వం విలీనం చేసింది. 3, 4, 5 తరగతులను తరలించడంతో 1, 2 తరగతుల పిల్లలే ఆ పాఠశాలల్లో మిగిలారు. కేవలం రెండు తరగతులే అక్కడ ఉండటం, పిల్లల సంఖ్య తక్కువగా ఉండటం, ఉపాధ్యాయుడు ఒక్కడే బోధించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలను ఆశ్రయించారు. పిల్లలు లేరనే కారణం చూపుతూ మరి కొన్ని స్కూళ్ళను మూసేసారు. 117 జీఓతో ఉపాధ్యాయులను తగ్గించి పిల్లలను బడికి దూరం చేశారని విజయ్ కుమార్ విమర్శించారు.
విద్యా వ్యవస్థ ప్రక్షాళన
ఈ నాలుగు నెలల్లో కూటమి ప్రభుత్వం ముందుగా జీవో నెంబర్ 117 ను రద్దు చేసింది. అంటే పాఠశాలల విలీనాలు వుండవు. మూసేసిన పాఠశాలలను తెరుస్తోంది. కొత్తగా 16 వేలకు పైగా టీచర్ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తోంది. దానికి ముందుగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించి ఫలితాలను కూడా విడుదల చేసింది. బైజూస్, ఐబీ అంటూ కమీషన్‌ల కోసం చేసే ప్రహసనాలకు స్వస్తి పలికింది. విద్యాశాఖలో సమూల మార్పులు తెచ్చి, కమీషన్ల వ్యవస్థలను రద్దు చేసింది. వచ్చే సంవత్సరం మొదట్లో ఇవ్వాల్సిన స్కూల్ యూనిఫారం, పుస్తకాలు షూలు, బెల్ట్ లకు ఇప్పటి నుంచే సేకరణ మొదలు పెట్టింది. పూర్తి పారదర్శకతతో, కౌన్సిలింగ్ ద్వారా టీచర్ల బదిలీలు చేపట్టిందని నీలాయపాలెం విజయ్ కుమార్ వివరించారు.