- గేట్ వే ఆఫ్ జగన్‌గా మార్చి దోచుకునేందుకు కుట్ర
- కేఎస్పీఎల్ మీద దాడి…బెదిరించి అరబిందో సంస్థకు వాటాల బదిలీ
- రూ.200 కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీని కొట్టేసిన జగన్ బినామీలు
అమరావతి (చైతన్యరథం): కంటపడిరదల్లా దోచుకునే దోపిడీల జగన్ కళ్లు తీర ప్రాంతంపై పడ్డాయని.. తీర ప్రాంతాన్ని గేట్ వే ఆఫ్ జగన్ గా మార్చి దోచుకునేందుకు తెరలేపారని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో 974 కిలో మీటర్ల మేర ఉన్న సువిశాలమైన సముద్ర తీరాన్ని రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించి ‘గేట్ వే ఆఫ్ ఇండియా’గా మార్చడానికి గతంలో చంద్రబాబునాయుడు కృషి చేస్తే.. జే గ్యాంగ్ దాన్ని దోపిడీకి ‘గేట్ వే ఆఫ్ జగన్’ గా మార్చారన్నారు.
షేర్లకోసం తుపాకీలతో బెదిరింపులు
జగన్ రెడ్డి దోపిడీకి అడ్డు, అదుపు లేకుండా పోయిందని ఆనం మండిపడ్డారు. తీర ప్రాంతాల అభివృద్ధిని గాలికి వదిలేసి జగన్ రెడ్డి దోపిడీకి ప్రణాళికలు రచించడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు హయాంలో కాకినాడ పోర్టులో విస్తృతంగా అభివృద్ధి జరిగితే. జగన్ కాకినాడ సీ పోర్టు లిమిటెడ్ (కేఎస్పీఎల్)లో షేర్లు కొట్టేసేందుకు కుట్రలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డిని రంగంలోకి దింపి దోపిడీకి ప్రణాళికలు రచించారన్నారు. కేఎస్పీఎల్ లో షేర్లు ఇవ్వాలంటూ ఆ కంపెనీ యజమానులను తుపాకులతో బెదిరించారన్నారు. విజయసాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డికి చెందిన అరబిందో ఇన్ఫ్రా.. కేఎస్పీఎల్ షేర్ కొనే నాటికి అప్పడు దాని విలువ రూ. 220 ఉంది. ఆ షేర్ ను ఎంత ప్రీమియం చెల్లించి కొన్నారు. ఏ రూపంలో చెల్లింపులు చెల్లించారో కూడా బయటపెట్టడంలేదు.
ప్రపంచంలో ఎక్కడైనా… లాభాల్లో నడిచే కంపెనీనీ తక్కువ మొత్తానికి అమ్ముకోవడం జరగదు. కానీ జే గ్యాంగ్ బెదిరింపులతో లాభాల్లో నడుస్తున్న కేఎస్పీఎల్ షేర్లను తక్కువ మొత్తానికి అమ్ముకున్నారు. అప్పట్లో కేఎస్పీఎల్‌కు మొత్తం టర్నోవర్‌లో 32 శాతం లాభాలు వస్తున్నాయి. ఇంత లాభాల్లో నడిచేవి అప్పట్లో రాష్ట్రంలో ఐదు కంపెనీలు కూడా లేవు. పోరులో 15 బెర్తులు పూర్తి చేసి మొత్తం నెట్‌వర్త్ విలువ రూ.1780 కోట్లు ఉంది. అయినా పోర్టు యాజమాన్యం తన వాటాను తక్కువ మొత్తానికి అమ్మిందంటే జే గ్యాంగ్ ఎంతగా బెదిరించిందో అర్థం చేసుకోవచ్చు. కాకినాడ సీ పోర్టుకు 2020 లో రూ. 170 కోట్లు, 2021 లో రూ. 205 కోట్లు, 2022 లో రూ.241 కోట్లు, 2023 లో రూ. 240 కోట్ల లాభాఉ వచ్చాయి. అటువంటి కంపెనీని ఎవరైనా అమ్ముకుంటారా? ఈ పోర్టు కొన్న అరబిందో ఇన్ఫ్రా అనుభవం ఏంటి? ఈ కంపెనీ జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డి అల్లుడు పెనాక శరత్ చంద్రారెడ్డిది. ఈ రియల్ ఎస్టేట్ కంపెనీకి కేఎస్పీఎల్‌లో వాటాల బదిలీకి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అనుమతి ఇచ్చింది. అంతకుముందు అరబిందో ఇన్‌ఫ్రాకు దేశంలో ఎక్కడా పోర్టుల్లో పనిచేసిన అనుభవం లేదు. పోర్టులు నిర్వహించే, నిర్మించే అర్హత లేని సంస్థకు, కనీసం పోర్టు గోడలకు ఎప్పుడూ రంగులు కూడా వేని కంపెనీకి కేఎస్పీఎల్‌లో ప్రధాన వాటా దక్కేలా జగన్‌రెడ్డి చక్రం తిప్పారు. అరంబిందో ఇన్ఫ్రా ద్వారా పోర్టులో వాటాలు చివరికి జగన్ రెడ్డికి వస్తాయి కాబట్టే ఆగమేఘాలమీద బదిలీకి ఆమోదం తెలిపారు.
జైలుకు పోతారంటూ బెదిరించి..
ఎంత బెదిరించినా జేె గ్యాంగ్‌కు మొదట్లో కేఎస్పీఎల్ యాజమాన్యం లొంగలేదు. దీంతో ఆడిట్ నివేదిక అంటూ కేఎస్పీఎల్ రూ. 965.65 కోట్లు ఎగ్గొట్టినట్లు తప్పుడు రిపోర్టులు సృష్టించారు. ఆ నగదును ప్రభుత్వానికి కట్టేందుకు కూడా కేఎస్పీఎల్ యాజమాన్యం అంగీకరించింది. దాంతో విజయసాయిరెడ్డి మరోసారి 1999 నుండి ఆడిట్ కు ఆదేశించారని.. మరోవైపు అరబిందో సంస్థకు షేర్లు అమ్మకపోతే కాకినాడ సీ పోర్టు యాజమాన్యంతో పాటు వారి కుటుంబ సభ్యులను, పిల్లలను సైతం జైళ్లకు పంపిస్తామని బెదిరించారు. ఒకవైపు విజయసాయిరెడ్డి, మరోవైపు ప్రభుత్వం నుండి వస్తున్న బెదిరింపులు, వేధింపులు తట్టుకోలేక కాకినాడ సీ పోర్టు యాజమాన్యం దశాబ్దాల పాటు శ్రమించి సృష్టించుకున్న వ్యాపార సామ్రాజ్యాన్ని వదులుకోవాల్సి వచ్చింది. వాటాల బదిలీలకు కంపెనీ యాజమాన్యం చేత 2020, డిసెంబర్ 5వ తేదీన బలవంతంగా లేఖ రాయించుకుని ఐదు రోజుల వ్యవధిలో అదే నెల 10న ఆంధ్రప్రదేశ్ మారిటోరియం బోర్డ్ నుండి అంగీకారం తీసుకుని, ఆ నెలలోనే 24వ తేదీన జీవో నెంబర్ 17ను ఆగమేఘాలమీద ఇచ్చి.. వాటాలు బదిలీ చేయించారు. ఈ జీవో వెనుక సీఎంఓ ఒత్తిళ్లు, జగన్ రెడ్డి బెదిరింపులు ఉన్నాయి. ఏడాదికి దాదాపు రూ. 200 కోట్లకు పైగా లాభాల్లో ఉన్న కంపెనీ షేర్లను తక్కు వ మొత్తానికి కొట్టేసి విజయసాయిరెడ్డి గ్యాంగ్ కోట్లు దండుకున్నారని ఆనం ఆరోపించారు.
రూ.965.65 కోట్లు..రూ.9కోట్లుగా మారిన వైనం
జగన్ బినామీలకు కేఎస్సీఎల్ వాటాలు అమ్మిన తరువాత జగన్ ప్రభుత్వం మరోసారి ఆడిట్ చేయించి కట్టాల్సిన రూ. 965.65 కోట్లను, రూ. 9కోట్లుగా మార్చి మాయ మాయ చేసింది. ఈ 965 కోట్లలో జగన్ రెడ్డి వాటా ఎంతనేది తేలాలి. విజయసాయిరెడ్డి అల్లుడు సంస్థ అరబిందో ఇన్ఫ్రాకు షేర్లు బదిలీ అయిన తరువాత ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను కూడా మాఫీ చేసేశారు. రూ. 1780 కోట్ల విలువైన పోర్టును అత్యంత తక్కువకు చేజిక్కించుకోవడం వెనుక ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగం ఉంది. టీడీపీ అధికారంలోకి రాగానే వడ్డీతో సహా వసూలు చేస్తామని ఆనం హెచ్చరించారు.
అవినీతిపై చర్యలు
అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా టీడీపీ పాలన సాగిందన్నారు. కాకినాడ పోర్టును విస్తరించిన ఘనత టీడీపీదే అన్నారు. పోర్టు విస్తరణతో వందల కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. వందల కోట్లు ఆదాయాన్ని కొల్లగొట్టేందుకు జగన్ కుట్రలు చేశారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ దోపిడీపై విచారణ చేపడతామన్నారు. జగన్ దోపిడీని బయటపెట్టి చర్యలు తీసుకుంటామన్నారు. బినామీలను జైళ్లకు పంపిస్తామన్నారు. వైసీసీ అదికారం లోకి రాకపోతే జగన్, విజయసాయి దేశం వదిలి పరారవ్వడం ఖాయమని ఆనం స్పష్టం చేశారు.