అమరావతి(చైతన్యరథం): జగన్ ఐదేళ్ల పాలనే రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు అని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. మంగళగిరిలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరదలు, వర్షాలతో భారీగా నష్టం జరిగిందని, లక్షలాది మంది ప్రజలు ముంపు బారిన పడ్డారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన అనుభవంతో ఈ విపత్తు నుంచి ప్రజలను గట్టెక్కించారన్నారు. వరదల విషయంలో ప్రభుత్వంపై జగన్ రెడ్డి విమర్శలు సిగ్గుచేటని మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో ప్రజలను ఆదుకోక పోగా .. ప్రభుత్వంపై బురద జల్లుతున్నారన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం, వారి పాపాల వల్లే నేడు ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. మూడు నెలల కూటమి పాలన చూసి జగన్ తట్టుకోలేక పోతున్నారన్నారు. ప్రజలను ఆదుకోవాలన్న మనసు జగన్‌కు ఉందా అని ప్రశ్నించారు. జగన్, కానీ వైసీపీ నాయకులు కానీ ప్రజలకు ఏ విధంగా సేవలు అందించారో చెప్పాలన్నారు. పిఠాపురం వెళ్లి పెద్ద జ్ఞాని లాగా పది పేపర్లు చేతిలో పెట్టుకుని జగన్ హడావుడి చేశారన్నారు. వైసీపీ పాలనలో విపత్తులు వస్తే.. పవన్ కళ్యాణ్ ఏనాడూ రాజకీయ విమర్శలు చేయలేదని గుర్తుచేశారు.
పిఠాపురంలో జగనన్న కాలనీని ఎందుకు పరిశీలించలేదని నిలదీశారు. ఏలేరు గురించి జగన్ ఇప్పుడు మాట్లాడుతున్నారని.. ఐదేళ్లు ఎందుకు పనులు చేయలేదని అడిగారు. వర్షాలు ఎక్కువగా పడినందువల్ల చేయలేదని చెప్పడానికి సిగ్గుండాలన్నారు. జగన్ ఏనాడైనా జేబులో నుంచి లక్ష రూపాయలు తీసి సామాన్యునికి సాయం చేశారా అని ప్రశ్నించారు. సీఎం హోదాలో ఉండి.. ప్రజలకు కనిపించకుండా పరదాలు కప్పుకుని తిరిగారన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవటం మ్యాన్ మేడ్ డిజాస్టర్ కాదా.. దీనికి గురించి జగన్‌కు మాట్లాడే అర్హత ఉందా అని అన్నారు. పులివెందుల ఎమ్మెల్యేగా, పార్టీ అధ్యక్షునిగా ఉన్న జగన్.. వైసీపీ శ్రేణులతో వరద సహాయక చర్యలు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. లీడర్ అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లాగా స్పందించే మనసు ఉండాలన్నారు. కాగితాలు చేతిలో పెట్టుకుని ఊగిపోతే.. షో మెన్ తప్ప.. జగన్ లీడర్ అనిపించుకోలేడన్నారు. ప్రజలకు కష్టం వస్తే నిలబడాల్సిన బాధ్యత మీకు, మీ నాయకులపై లేదా.. 74 యేళ్ల వయసులో చంద్రబాబు ప్రతిరోజూ నాలుగు సార్లు వరదల్లో తిరిగారు. మీరు ఎప్పుడైనా నిజాయతీగా ప్రజల కోసం పని చేశారా?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద గత ప్రభుత్వం రూపాయి కూడా చెల్లించలేదన్నారు. 2020 ఖరీఫ్ నుంచి రైతులకు పంట బీమా కూడా ఇవ్వలేదని చెప్పారు. వరద బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటోందని తెలిపారు. అర్థం లేని విమర్శలతో వైసీపీ కాలక్షేపం చేస్తోందని మండిపడ్డారు. కష్టాల్లో ఉన్న వరద బాధితులను ఆదుకోవాలన్న ఆలోచనే జగన్‌కు లేదన్నారు. ఆయన క్షేత్ర స్థాయిలో పర్యటించిన దాఖలాలు లేవని చెప్పారు. ప్రభుత్వ సహాయ కార్యక్రమాల్లో మీరూ భాగస్వాములు కావచ్చు. నాయకుడు ఎలా ఉండాలో పవన్ కళ్యాణ్‌ను చూసి నేర్చుకోండి. ప్రతి పంచాయతీకి రూ. లక్ష చొప్పున విరాళమిచ్చారు. పేదలకు అందాల్సిన బియ్యం ఎగుమతి చేసే వారిపై తప్పకుండా చర్యలు ఉంటాయని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.