- సీఎం జగన్, సజ్జల డైరెక్షన్‌లో..
- సీతారామాంజనేయులు, సవాంగ్ కనుసన్నల్లో భారీ కుంభకోణం
- డిప్యూటీ కలెక్టర్ పోస్టు రూ.2.5 కోట్లకు..
- డీఎస్పీ పోస్టు రూ. 1.5 కోట్లకు అమ్ముకున్నారు
- అధికారంలోకి రాగానే విచారణ జరిపిస్తాం, ఎవరినీ వదలం
- స్పష్టం చేసిన టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరాం
అమరావతి (చైతన్యరథం): ఐదేళ్లలో ల్యాండ్, శాండ్, వైన్, మైన్‌లో జగన్ మాఫియా లక్షలాది కోట్లు దోచుకున్న జగన్ గ్యాంగ్, అవి చాలవన్నట్టు చివరకు గ్రూప్-1 ఉద్యోగాల్ని సైతం బహిరంగా మార్కెట్‌లో అమ్ముకుని రూ.150 కోట్ల అవినీతికి పాల్పడ్డారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ధ్వజమెత్తారు. గురువారం నాడు మంగళ గిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ….. జగన్‌రెడ్డి గత ఎన్నికల్లో యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా వారికి దక్కాల్సిన ఉద్యోగాల్ని సైతం బహిరంగ వేలం పెట్టి అమ్ముకోవటం దుర్మార్గ మని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం 2018, డిసెం బర్ 31న గ్రూప్`1 కు సంబంధించి 169 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ తరువాత దురదృష్టవశాత్తు ఎన్నికల అనంతరం జగన్ ముఖ్యమంత్రయ్యారు. వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. దాదాపు 9 వేల మంది మెయిన్స్‌కి అర్హత సాధించారు. వీరంతా తమ ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డారు. కానీ జగన్ రెడ్డి ఆ ఉద్యోగాలను బహిరంగ మార్కెట్‌లో తెగనమ్ముకుని పేద బిడ్డలకు అన్యాయం చేశారని పట్టాభి దుయ్యబట్టారు. ఒక్కో డిప్యూటీ కలెక్టర్ పోస్టు రూ. 2.50 కోట్లకు, డీఎస్పీ పోస్టును రూ. 1.50 కోట్లకు అమ్ముకున్నారు. ఈ కుంభకోణం అంతా సీఎం జగన్, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్‌లో, ఇంటిలిజెన్స్ డీజీ (నాటి ఏపీపీఎస్సీ సెక్రటరీ) సీతారామాంజనేయులు, ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ కనుసన్నల్లోనే జరిగిందని పట్టాభి ఆరోపించారు.
హైకోర్టు తీర్పుపై ఏం సమాధానం చెబుతారు?
గ్రూప్-1 ఉద్యోగాల పరీక్షల నిర్వహణలో ఏపీపీఎస్సీ అనేక అవకతవకలకు పాల్పండిదని బుధవారం హైకోర్టులో జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు తీర్పు ఇచ్చారు. మెయిన్స్ పరీక్షల జవాబు పత్రాలను 3 సార్లు వాల్యూయేషన్ (ఒకసారి డిజిటల్, రెండు సార్లు మాన్యువల్ ) చేసి వైపీసీ పెద్దలకు కావాల్సిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టారు. ఏపీపీఎస్సీ రూల్ 3(9) ప్రకారం 3 సార్లు వాల్యూయేషన్ చేయటం చట్ట విరుద్ధమని, గతంలో ఉద్యోగాలు పొందిన వారి నియామకాలు చెల్లవని, తిరిగి 6 నెలల్లోపు మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించి నియామక ప్రక్రియ పూర్తి చేయాలని కోర్టు ఆదేశాలిచ్చింది. దీనికి సీఎం జగన్ ఏం సమాధానం చెబుతారు? తెలంగాణలో గ్రూప్ 1,2 ఉద్యోగాల్లో అక్రమాలకు పాల్పడితే అక్కడ యువత ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించివేశారు. రేపు జగన్ పరిస్థితి కూడా అదే. జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా, పరిశ్రమలు తీసుకురాకుండా ఉన్న ఉద్యోగాల్ని పోస్టుకొక రేటు కట్టి యువత జీవితాలతో జగన్‌రెడ్డి ఆడుకున్నారని పట్టాభి విమర్శించారు.
డిజిటల్ మాల్యాంకనం ఎందుకు చేయించారు
చంద్రబాబు ప్రభుత్వం గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్‌లో పేరా. నెం. 1.5 లో మెయిన్స్ పరీక్షల జవాబు పత్రాలు మాన్యువల్ (సాంప్రదాయ) విధానంలో దిద్దాలని స్పష్టంగా ఉంది. కానీ తాడేపల్లి ప్యాలెస్ ఈ ఉద్యోగాల్లో డబ్బులు దండుకునేందుకు పథకం రూపొందించింది. టీడీపీ హయాంలో మంచి ట్రాక్ రికార్ట్ ఉన్న వ్యక్తి, రిటైర్డ్ ప్రొఫెసర్ పీ ఉదయ్ భాస్కర్‌ని ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమిస్తే..జగన్ రెడ్డి ఆయన్ని డమ్మీగా మార్చి ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులుని ఏపీపీఎస్సీ సెక్రటరీగా నియమించి ఈ కుంభకోణానికి తెరలేపారు. మాన్యువల్ వాల్యుయేషన్ విధానం పక్కన పెట్టి డిజిటల్ వాల్యూయేషన్ చేసి తమకు నచ్చిన వారిని ఎంపిక చేశారు. దీనిపై అనేక మంది అభ్యర్థులు కోర్టుకెళ్లారు. నోటిఫికేషన్ కి విరుద్ధంగా డిజిటల్ వాల్యుయేషన్ చేయటం చట్ట విరుద్ధమని, మాన్యువల్ వాల్యుయేషన్ చేయాలని 2021 అక్టోబర్ 1న హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుకు లోబడి ఆనాటి ఏపీపీఎస్సీ సెక్రటరీ సీతారామాంజనేయులు డైరెక్షన్‌లో 21 డిసెంబర్ నుంచి 2022 ఫిబ్రవరి 14 మధ్య మాన్యువల్ వాల్యూయేషన్ జరిగింది. ఆ ఫలితాలు విడుదల చేయకుండా ఆ తర్వాత 2022, ఫిబ్రవరి 24న గౌతమ్ సవాంగ్ పదవిలోకి వచ్చాక మరోసారి మాన్యువల్ విధానంలో పేపర్లు దిద్దించి మరో లిస్టు ఎందుకు తయారు చేశారు? పంపకాల్లో తేడా వచ్చిందనా? దీనికి సమాధానం చెప్పాలి. అంటే వాళ్ల ధన దాహం కోసం ఒక జవాబు పత్రాన్ని 3 సార్లు వాల్యుయేషన్ (ఒకసారి డిజిటల్ వాల్యుయేషన్ రెండు సార్లు మాన్యువల్ వాల్యూయేషన్) చేసి మన బిడ్డల జీవితాల్ని నాశనం చేశారని పట్టాభి తప్పుబట్టారు.
ఒక్కసారే మాన్యువల్ వాల్యూయేషన్ పచ్చి అబద్ధం
సీతారామాంజనేయులు ఏపీపీఎస్సీకి సెక్రటరీగా ఉన్నపుడు హాయ్ ల్యాండ్ రిసార్ట్‌లో ఒకసారి మాన్యు వల్ వాల్యూయేషన్ చేయించారు.ఇది వాస్తవం. గ్రూప్ 1 కి మెయిన్స్ పేపర్ వాల్యుయేషన్ ప్రారంభిస్తున్నా మని, అందుకు సంబంధించిన కంట్రోల్ బండిల్ స్లిప్స్‌ని మాకు సరఫరా చేయాలని డేటాటెక్ మెథడెక్స్ అనే సంస్థకు 2021 నవంబర్ 25న సీతారామాంజ నేయులు లేఖ రాశారు. వాళ్లు సరఫరా చేసిన కంట్రోల్ బండిల్ స్లిప్స్‌కి చేయాల్సిన చెల్లింపులకు సంబంధించిన ప్రొసిడిరగ్స్‌ను 2021, డిసెంబర్ 29న ఇచ్చారు. జవాబు పత్రాలు స్ట్రాంగ్ రూంకి తరలించాలని, అందు కు తగిన పోలీసు భద్రత కావాలని నాటి గుంటూరు ఎస్పీకి 2021, డిసెంబర్ 3వ తేదీన సీతారామాంజ నేయులు లేఖ కూడా రాశారు. హాయ్‌ల్యాండ్‌లో మాన్యువల్ వాల్యుయేషన్ చేయడానికి వచ్చిన అధికారులకు వసతి, భోజన సదుపాయాల కోసం హాయ్‌ల్యాండ్ (ఆవాస) రిసార్ట్‌కి రూ.20 లక్షలు చెల్లించారనేది వాస్తవం. స్ట్రాంగ్ రూం వద్ద భద్రతకు కర్నూలు నుంచి 32మంది కానిస్టేబుళ్లను 2021 డిసెంబర్ 5 నుంచి 2022 ఫిబ్రవరి వరకు పంపిన లిస్ట్ కూడా మా వద్ద ఉంది. ఇవే కాకుండా మేం వాల్యుయేషన్ పూర్తి చేశామని, దానికి సంబంధించిన పోస్ట్ వాల్యుయేషన్ చేయడానికి రావాలని 2022 ఫిబ్రవరి 2న డేటాటెక్ మెథడాలజీ సంస్థకు రామాంజనేయులు లేఖ కూడా రాశారు. ఈ లేఖలన్నీ తాను రాయలేదని నేటి ఇంటలిజెన్స్ డీజీ సీతా రామాంజనేయులు చెప్పగలరా? జగన్‌కు చెందిన సాక్షి పత్రికలో సైతం 2022 ఫిబ్రవరిలో గ్రూప్ 1 ఫలితాలు విడుదల అవుతాయని అని రాశారు. పైన పేర్కొన్న ఆధారాలన్నీ విశ్వసించే కోర్టు సీతారామాంజనేయులు సెక్రటరీగా ఉన్నప్పుడు ఒకసారి మాన్యువల్ వాల్యుయేషన్ జరిగిందని నిర్ధారణకు వస్తూ స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఈ ఆధారాలన్నీ మీడియాకు విడుదల చేస్తున్నామని పట్టాభి చెప్పారు.
మాన్యువల్ వాల్యుయేషన్ ఒక్కసారి (మార్చి 2022 లో) మాత్రమే చేశామని డిసెంబర్ 21 నుంచి ఫిబ్రవరి 2022 మధ్య ఎలాంటి వాల్యుయేషన్ చేయలేదని గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు ఏపీపీఎస్సీ అధికారులు హైకోర్టుకు రెండు సార్లు తప్పుడు అఫిడవిట్ ఇచ్చారు. ఏపీపీఎస్సీ డిప్యూటీ సెక్రటరీ సీవీ రమణయ్య మాన్యువల్ వాల్యూయేషన్ విషయంలో కోర్టును తప్పుదారి పట్టించేలా రెండు సార్లు అఫిడవిట్లు దాఖలు చేశారు. మొదటి అఫిడవిట్ పేరా 4 (1)లో 2021, డిసెంబర్` 2022 జనవరి మధ్య ఎలాంటి మాన్యువల్ మూల్యాంకనం జరగలేదని చెబుతూ సీతారామాంజనేయులు ఏపీపీఎస్సీ సెక్రటరీగా నిర్వహించిన మొదటి మాన్యువల్ వాల్యుయేషన్‌ను పూర్తిగా తొక్కి పెడుతూ కోర్టును తప్పుదారి పట్టించారు. ఇది కాక మరలా రెండవసారి జనవరి 2023 మరొక అఫిడవిట్ హైకోర్టులో దాఖలు చేసి తిరిగి అదే అబద్ధాన్ని వల్లె వేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు 2022 మార్చి 25 నుంచి ఒకేసారి అన్ని జాగ్రత్తలతో అత్యంత శాస్త్రీయంగా, సమర్థవంతంగా, సీసీ టీవీల పర్యవేక్షణలో మాన్యువల్ మూల్యాంకనం చేశామని తెలిపారు. తాము ఒక్కసారి మాత్రమే మాన్యువల్ వాల్యూయేషన్ చేశామని రెండవ అఫిడవిట్ ద్వారా కూడా కోర్టును దగా చేశారు. దీనికి ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ సమాధానం చెప్పాలి. ఒక ఐపీఎస్ అధికారిగా, మాజీ డీజీపీగా ఇంతగా దిగజారి కోర్టులను కూడా మోసగిస్తారా? ఇవన్నీ సీఎం జగన్, సజ్జల డైరక్షన్ లోనే జరిగాయని పట్టాభి అన్నారు.
విచారణ జరిపిస్తాం
ఈ విధంగా 5 ఏళ్లలో జగన్ కనుసన్నల్లో ఉన్నత స్ధాయి అధికారులు ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారో, సీఎంవోకు ఎన్ని కోట్లు చేరవేశారో, వీళ్లు ఎన్ని కోట్లు తిన్నారో రాష్ట్ర ప్రజలు గమనించాలి. మద్యప్రదేశ్ లో జరిగిన వ్యాపమ్ స్కామ్ కంటే, తెలంగాణలో జరిగిన టీఎస్‌పీఎస్సీ కుంభకోణం కంటే ఇది అతి పెద్ద భారీ కుంభకోణం, ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దీనిపై విచారణ జరిపిస్తాం. దీనిలో సీఎం, గౌతమ్ సవాంగ్, సీతారామాంజనేయులు వంటి వారు ఎవరున్నా వదలం. బాద్య్యులైన వారిని కటకటాల పాలు చేసి మన బిడ్డలకు న్యాయం చేస్తామని పట్టాభి స్పష్టం చేశారు.