- తెలియక స్వీకరిస్తే దోష నివారణ మార్గమేమిటి?
- ఆగమ పండితులు తెలియజేయాలి
- తిరుమలలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలి
- జగన్ తప్పులన్నీ బయటకు రావాలి
నేడు తిరుమల లడ్డూ నాణ్యమైన నెయ్యితో మెత్తగా ఉంటోంది
అమరావతి(చైతన్యరథం): జంతు కొవ్వు కలిపిన నెయ్యితో చేసిన లడ్డూ ప్రసాదం స్వీకరించిన దోషం ఎలా పోతుందో ఆగమ శాస్త్రం తెలిసిన పండితులు తెలియజేయాలని టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్ కోరారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ సర్వ నాశనం చేశారని విమర్శించారు. చివరికి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కూడా వదలలేదు. తిరుమల లడ్డూలో నాణ్యత లేదని 2023, ఆగస్ట్‌లోనే మేము చెప్పాం. సరైన నెయ్యి, పదార్థాలు లడ్డూలో ఉండటం లేదని, లడ్డూలో నెయ్యి వాసన లేదని, లడ్డూ రుచికరంగా లేదు అని ఇదే వేదికపై సమావేశం ఏర్పాటు చేసి చెప్పాము. భక్తుల మనోభావాలు తెబ్బతినకుండా చూడాలని కోరాము. వైసీపీ ప్రభుత్వ హయాంలో రకరకాల కంపెనీల నుంచి టీటీడీ ఆవు నెయ్యిని కొనుగోలు చేసింది. నెయ్యి సరఫరాలో కూడా రివర్స్ టెండరింగ్ పాలసీని అవలంబించారు. టీడీపీ హయాంలో తయారు చేసిన లడ్డూలో జీడిపప్పు, బాదమ్, కిస్‌మిస్ లు ఎక్కువగా ఉండేవి. జగన్ హయాంలో అవి కనపడేవి కాదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుమలలో పెద్ద పెద్ద జీడిపప్పులు, బాదమ్, కిస్‌మిస్‌లతో నాణ్యమైన లడ్డూ తయారవుతోంది. పైగా మెత్తగా కూడా ఉంటోంది. లడ్డూని ముట్టుకోగానే చేతికి నెయ్యి తగులుతోంది. వైసీపీ హయాంలో లడ్డూ ఎండిపోయినట్లుగా ఉండేదని బుచ్చి రాంప్రసాద్ అన్నారు.
దోష నివారణ మార్గం తెలియజేయాలి
తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లినవారు ఇంటికొచ్చేవరకు మాంసాహారం తినరు. కానీ వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ తినిపించి మాంసాహారం తినేలా చేశారు. పవిత్రంగా భావించే తిరుమల లడ్డూను అపవిత్రం చేశారు. ఇదంతా మన ఖర్మగా భావించాలి. గత ఐదేళ్లలో హిందువుల దారుణంగా మనోభావాలు దెబ్బతిన్నాయి. తిరుమల లడ్డూలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు పదార్థాలు కలుస్తున్నాయని సీఎం చంద్రబాబు చెప్పినప్పుడు విని బాధపడ్డాను. ఇలాంటి సొసైటీలోనా మనం బతుకుతున్నది అని కలత చెందాను. బ్రాహ్మణులు మాంసాహారం తినరని అందరికీ తెలుసు. జంతు కొవ్వు కలిపిన నెయ్యితో తయారైన లడ్డూలను తిన్నామని తెలిస్తే… పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. తిరుమలను ప్రక్షాళన చేయాలి. తెలియక తప్పు చేస్తే ఏ విధంగా ఆ తప్పును సరి చేసుకోవచ్చో ఆగమ శాస్త్రం తెలిసినవారిని అడగాలి. మాంసాహారం తిననివారు తెలియక తినేస్తే ఏం చేయాలో తెలుసుకొని సరిదిద్దుకోవాలి. ఆగమ శాస్త్రం తెలిసిన వారు ఏ విధంగా ఈ దోషం వదులుతుందో పత్రికా ముఖంగా తెలియ చేయాలని బుచ్చి రాంప్రసాద్ కోరారు.
జగన్ విమర్శల హాస్యాస్పదం
ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి లడ్డూను రాజకీయాలకు వాడుకుంటున్నాడని జగన్ చెప్పడం హాస్యాస్పదం. అలిపిరిలో చంద్రబాబు పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి నాకు మరో జన్మ ఇచ్చారని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆయన ఎప్పుడూ టీటీడీని రాజకీయాలకు వాడలేదు. అటువంటి ఆలోచన జగన్ కే ఉంది. టీటీడీని లాబీయింగ్‌లకు వాడుకున్నది వైసీపీ ప్రభుత్వమే. జగన్ ఐదేళ్లలో ఒక్కసారైనా సతీ సమేతంగా తిరుమలకు వెళ్లారా? వెంకటేశ్వర స్వామినే ఇంటికి తెప్పించుకున్న ఘనత జగన్‌కే దక్కుతుంది. ప్రధాన మంత్రికి లేఖ రాస్తానని జగన్ అంటున్నారు. ఏమని రాస్తారు? చంద్రబాబుకు అక్షింతలు వేయాలంటున్నారు. చంద్రబాబుకు కాదు మీకు పడతాయి. జగన్ చేసిన తప్పులను ప్రజలు గమనించే ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారు. జగన్ చేసిన తప్పులన్నీ బయటికి రావాలి. అవన్నీ ప్రజలకు తెలియాలి. తిరుమలలో జరిగిన అక్రమాలపై విచారణ జరగాలి. జగన్ హయాంలో తిరుమలలో ప్రసాదాలకు వాడే పదార్థాల్లో నాణ్యత లోపించింది. సింహాచలంలో కూడా ప్రసాదాల తయారీలో నాణ్యమైన నెయ్యి వాడడంలేదని తెలిసింది. దీనిపై కూడా చర్యలు తీసుకోవాలి. తిరుమలకు సమీపంలో ఉన్న పది ఎకరాల స్థలాన్ని విలీనం చేయదలచుకుంటే దానికి వైసీపీ నాయకులు అడ్డు తగిలారు. అందుకు జనసేన, బీజేపీ కూడా పోరాడిరది. దీన్ని ముంబై వారికి కట్టబెట్టాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించింది. వీటిపై కూడా విచారణ జరిపించాలి. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇటువంటి తప్పులు అనేకం చేశారు. వారిని వదలిపట్టకుండా కఠినంగా శిక్షించాలి. భక్తుల మనోభావాలకు భంగం కలగకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు చూస్తారనే నమ్మకం ప్రతి ఒక్కరిలో వుంది. భ్రష్టు పట్టించిన వ్యవస్థలను బాగు చేసే పనిలో సీఎం చంద్రబాబు ఉన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసిన ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని బుచ్చిరాం ప్రసాద్ స్పష్టం చేశారు.