అమలాపురం (చైతన్యరథం): జగన్ జీవితం జైైలుకు.. బెయిలుకు మధ్య ఊగిసలాడుతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగసభలో తెదేపా అధినేత చంద్రబాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ‘అమలాపురం క్లాక్ టవర్‌నుంచి చెబుతున్నా. జగన్.. నీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి. నిన్ను జైలుకు పంపిస్తాం. నా సినిమాలు ఆపిన రోజే చెప్పా. ఎవరు మనల్ని ఆపేదని? మళ్లీ ఈరోజు చెబుతున్నా కూటమి ప్రభుత్వం రాకుండా ఎవరు ఆపేది?’ అని పవన్ కల్యాణ్ ఆవేశంగా ప్రశ్నించారు. భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటామని హామీ ఇస్తూ, కోనసీమను కలహాల సీమగా మార్చి కులాల మధ్య చిచ్చు పెడితే సహించేది లేదని పవన్ హెచ్చరించారు. ‘జనసేన, జన సైనికులు రాష్ట్ర సంక్షేమం కోసం నిలబడతారు. కూటమి ప్రభుత్వం వస్తుంది.
నాయకుల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా. జనసేన నుంచి వెళ్లి పోతే నేనేం చేయలేను’ అని పవన్ వ్యాఖ్యానించారు. ‘కోనసీమ అందాలు చూపించేలా ప్యాలెస్ ఆన్ వీల్స్ మాదిరి రైలు పరుగెత్తాలని అంటూ, బాలయోగి కుమారుడు హరీష్‌ను పార్లమెంట్‌కు పంపిస్తే రైలు కూత వచ్చేలా పనిచేస్తామని పవన్ అన్నారు. ఈ ప్రాంత వాసుల ఆకాంక్షను ప్రధాని దృష్టికి తీసుకెళ్తానని పవన్ ధీమా వ్యక్తం చేశారు. వైకాపా పాలన గురించి దళిత సమాజం ఆలోచించాలని, రాష్ట్రంలో 32 వేలమంది ఆడపిల్లలు అదృశ్యమైతే ఈ సీఎం ఒక్కసారీ మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైకాపాకంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని పవన్ భరోసా ఇచ్చారు.
జనసేన కీలక ప్రకటన
ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి విజయబావుటాను ఎగురవేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న పవన్ కల్యాణ్ గురువారం కీలక ప్రకటన చేశారు. ఎన్నికల ప్రచారం, ఎన్నికల సమయంలో సమన్వయమే లక్ష్యంగా రెండు పార్లమెంట్ స్థానాలకు ఎన్నికల సమన్వయకర్తలను నియమించారు. అమలాపురం నియోజకవర్గానికి కొత్తపల్లి సుబ్బారాయుడు, విజయవాడ ఎంపీ నియోజకవర్గానికి అమ్మిశెట్టి వాసు పేర్లను పవన్ ప్రకటించారు. వీరిద్దరూ మిత్రపక్ష పార్టీల విజయం కోసం పర్యటనలు, ప్రచారం చేస్తారని వెల్లడిరచారు.