- శ్రీవారి లడ్డూ కల్తీ పాపంలో దోషులందరూ బయటకు వస్తారు
- తప్పు కప్పిపుచ్చుకునేందుకే తప్పుడు మాటలు
- జనం నమ్మటం లేదని తెలిసే మీడియా ముందు పిచ్చి ప్రేలాపనలు
- ధ్వజమెత్తిన ఆర్థిక మంత్రి పయ్యావుల
అమరావతి(చైతన్యరథం): ఆత్మరక్షణలో పడిన జగన్ రెడ్డి తిరుమల విషయంలో చెప్పిన అబద్ధాలే మళ్లీమళ్లీ చెబుతున్నారని రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో జగన్ రెడ్డి ఆదేశాలతోనే ఉద్దేశపూర్వకంగా టీటీడీని అగౌరపరిచారని విమర్శించారు. శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పయ్యావుల మాట్లాడుతూ తిరుమల శ్రీవారి ఆలయం విషయంలో తప్పు చేసిన వారందరినీ దోషులుగా నిలబట్టే సమయం తొందరలోనే వస్తుందన్నారు. ఇది కోట్లాది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం. రాజకీయాలకు, ఎటువంటి స్వార్థ ప్రయోజనాలకు తావులేకుండా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెంకటేశ్వర స్వామి విషయంలో నిజం తప్ప వేరేదీ చెప్పరని నమ్మారు కాబట్టే లడ్డూ కల్తీపై వెంటనే తీవ్రస్థాయిలో ప్రజా స్పందన వచ్చింది. దానికి జగన్ మోహన్ రెడ్డి భయపడిపోయి, ఆయనను ఈ సమాజం ఎక్కడ వెలివేస్తుందేమోననే భయంతో హిందుత్వానికి వారే ఛాంపియన్స్ అని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. చేసిన తప్పు కళ్ల ముందు కనబడుతోంది కాబట్టే జగన్ రెడ్డి రక్షణాత్మక ధోరణిలో ఏదో చెప్పుకునే ప్రయత్నం చేసి ప్రజల ముందు దోషిగా నిలబడ్డాడు.
వైఎస్సార్సీపీ ఆత్మరక్షణలో పడి కొట్టుకుంటోంది. సొంత బంధువులుగా చెప్పుకునే వారే పక్క పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది రాజకీయ అంశం కాదు. అదొక పవిత్రమైన ధార్మిక అంశం. టీటీడీ పాలక మండలి అంటారు. కానీ అది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కాదు.. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి. చంద్రబాబు నాయుడు సీరియస్ అంశాలను ప్రజల ముందు పెట్టారు. దీనిపై చర్చ జరగాలి. దీంతో రాజకీయాలకు సంబంధం లేదు. వైసీపీ హయాంలో టీటీడీని ఫక్తు వ్యాపార సంస్థగా నడపాలని చూశారు. స్వామి వారిని సామాన్యులకు దూరం చేయాలని తీవ్రంగా ప్రయత్నించారు. తిరుమలలో 150 రూపాయలు రూమ్ అద్దెను 2000 రూపాయలు చేశారు. స్వామివారి దర్శనం విషయంలోనూ సామాన్య భక్తులను ఇబ్బంది పెట్టారని పయ్యావుల విమర్శించారు.
జనం నమ్మటం లేదనే భయంతోనే..
జగన్ మోహన్ రెడ్డి ఆత్మరక్షణలో పడి విలవిలలాడుతున్నాడు. ప్రజలు తనను నమ్మటం లేదనే భయంతో ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక్కసారి కూడా మీడియాకు వచ్చి మాట్లాడలేదు. గతంలో ఎప్పుడైనా తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడాడా.. ఎన్నిసార్లు వెంకటేశ్వరస్వామి గొప్పతనం గురించి మాట్లాడాడో చెప్పండి? ఇప్పుడు టీటీడీ గురించి, తిరుమల స్వామి గురించి, భక్తి గురించి చెబుతున్న పెద్దపెద్ద కబుర్లన్నీ ఆత్మరక్షణ కోసం జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న విన్యాసాలేనని మంత్రి పయ్యావుల తప్పుబట్టారు.