రావులపాలెం: ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిని నడిపించే రిమోట్ ఆయన భార్య భారతి చేతిలో ఉందని పీసీసీ అధ్యక్షరాలు వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. రావులపాలెంలో మంగళవారం ఆమె విలేకురులతో మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రిని భారతి అనే రిమోట్ నడిపిస్తోందన్నారు. భారతి మాటలను జగన్ జవదాటడని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఏపీలో కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు రిమోట్ కంట్రోల్‌తో నడిపిస్తున్నారంటూ జగన్ చేసిన ఆరోపణలను షర్మిల తిప్పికొట్టారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడు అంటూ సీబీఐ ఆరోపిస్తున్న వ్యక్తి.. సీబీఐ చార్జిషీట్ లో పేరున్న అవినాష్‌రెడ్డికి కడప టికెట్ ఏ ప్రాతిపదికన ఇచ్చారో జగన్ వివరించాలని షర్మిల డిమాండ్ చేశారు. సొంత బాబాయి హత్యలో ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని జగన్ కడప లోక్ సభ బరిలో నిలబెట్టడం తట్టుకోలేకే తాను ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నానని షర్మిల చెప్పారు. కడప ప్రజలకు నిజం తెలియాలని, నిజం గెలవాలనే తాను పోరాడుతున్నానని వివరించారు. ఈ ఎన్నికలు ధర్మానికి డబ్బుకు మధ్య జరుగుతున్న ఎన్నికలని, న్యాయానికి నేరానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని చెప్పారు. కడపలో తాను ఓడిపోతే న్యాయం ఓడి, నేరం గెలిచినట్లుగానే భావించాలన్నారు.