- ప్రాజెక్టును చూస్తుంటే బాధేస్తోంది..
- ఎప్పటికి పూర్తవుతుందో తెలీని పరిస్థితి
- బహుళార్థక ప్రాజెక్టుతోనే ప్రగతి పరుగు
- సర్వనాశనం చేసిన జగన్‌ను క్షమించొద్దు
- దళితులపై దాష్టీకాలను ఉపేక్షించలేం..
- దళిత యవతే తరిమి తరిమి కొట్టాలి
- పథకాలు రద్దుచేసిన వ్యక్తి పేదల మనిషా
- కూటమి గెలుపుతోనే రాష్ట్రానికి బాగు
- గోపాలపురం ప్రజాగళంలో చంద్రబాబు
గోపాలపురం (చైతన్యరథం): ఆంధ్ర రాష్ట్ర జీవనాడి పోలవరాన్ని తుత్తునియలు చేసింది జగన్‌రెడ్డేనని తెలుగుదేశం జాతీయాధ్యక్షుడు చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం హయాంలో అష్టకష్టాలుపడి బహుళార్థక ప్రాజెక్టును ఒక రూపానికి తెస్తే, అసమర్థ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి దాన్ని విధ్వంసానికి గురిచేసి.. రాష్ట్ర ప్రగతిమీద బలమైన దెబ్బకొట్టాడని నిప్పులు చెరిగారు. గద్దెనెక్కగానే `పోలవరాన్ని 2021కి పూర్తి చేస్తానన్నాడని, ఇప్పటి పోలవరం రూపాన్ని చూస్తే ఎప్పటికి పూర్తవుతుందో అంచనా వేయలేని పరస్థితి ఉందని చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాగళం ఎన్నికల ప్రచార సభల్లో భాగంగా గురువారం గోపాలపురం నియోజవర్గంలో నిర్వహించిన సభలో తెలుగుదేశం జాతీయాధ్యక్షుడు చంద్రబాబు ఉద్వేగంగా మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టును జగన్‌రెడ్డి ఏవిధంగా దెబ్బతీశాడో వివరిస్తూ `‘డయాఫ్రం వాల్ కొట్టుకుపోయేలా చేశాడు. కాఫర్ డ్యాంను నాశనం చేశాడు. గైడ్‌బండ్‌ను పూర్తిగా నిర్వీర్యం చేశాడు. సైకో ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రయోజనాలను ఏవిధంగా తాకట్టు పెడుతాడో ఆలోచించండి. రాజకీయ కక్షతో ఆకాశంపై ఉమ్మితే అది జగన్ ముఖంపైనే పడుద్ది. అదే జరిగింది నేడు. పోలవరాన్ని గోదావరిలో ముంచిన జగన్‌రెడ్డికి ఓటు అడిగే హక్కుందా? అని చంద్రబాబు తీవ్రస్వరంతో ప్రశ్నించారు.
పోలవరం నిర్మాణనానికి పడిన కష్టాన్ని గుర్తు చేసుకుంటూ `రాష్ట్ర విభజన జరిగినపుడు ప్రాజెక్టుకు సంబంధించిన 7 ముంపు మండలాలను తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కలపితేనే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పాను. దూరదృష్టితో పార్లమెంటు సమావేశాలకు ముందే ఆర్డినెన్స్ తీసుకొచ్చి 7 మండలాలను రాష్ట్రంలో కలపడానికి కృషి చేసిన వ్యక్తిని నేను. ఆ ఏడు మండలాలు రాష్ట్రంలో కలపకుంటే నేడు పోలవరమే లేదు. ఆంధ్రప్రదేశ్ కలను సాకారం చేసిన వ్యక్తిని. 28సార్లు ప్రాజెక్టును సందర్శించాను. 82సార్లు వర్చువల్ సమావేశాలు జరిపాను. 414 రోజుల్లో డయాఫ్రాం వాల్ నిర్మించాం. 72 శాతం పనులు పూర్తి చేశాం. రూ.11,600 కోట్లు ఖర్చు చేసిన ఘనత తెలుగుదేశానిది. అటువంటి ఉదాత్తమైన ప్రాజెక్టును జగన్‌రెడ్డి సర్వనాశనం చేశాడు అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. గోపాలపురంలో గట్టిగా కేకవేస్తే పోలవరానికి వినపడుతుంది. పోలవరం ప్రాజెక్టు ఏపీకి వరం. దేశంలోనే ఇది అతిపెద్ద ప్రాజెక్టు. పోలవరానికి 50 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుంది. ఈ ప్రాజెక్టు ప్రమాదంలో పడితే ఉభయగోదావరి జిల్లాలు ప్రమాదంలో పడతాయి. పోలవరం ద్వారా 2 వేల టీఎంసీ నీళ్లు వాడుకుంటే రాష్ట్రంలో కరువు ఉండదని ప్రాజెక్టు ప్రాధాన్యతను ప్రజలకు వివరించారు.
జగన్‌ను తరిమికొట్టండి
ఎస్సీ నియోజకవర్గమైన గోపాలపురంలో ఎస్సీలకు న్యాయం జరిగిందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. మాట్లాడితే నా ఎస్సీలు అనే జగన్‌రెడ్డి ఆ ఎస్సీలనే గొంతు కోసిన దుర్మార్గుడని దుయ్యబట్టారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఎస్సీలకు సబ్‌ప్లాన్‌ను అమలు చేయాలి. జగన్‌రెడ్డి సబ్‌ప్లాన్ నిధులలో రూపాయికూడా ఎస్సీలకు ఖర్చు చేయలేదు. వాటిని దారిమళ్లించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను 27 సంక్షేమ పథకాలు ఎస్సీల కోసం తీసుకొస్తే వాటినీ రద్దు చేశాడన్నారు. ‘తెలుగుదేశం ప్రభుత్వ హయంలో ఎస్సీల కోసం రూ.28 వేల కోట్లు ఖర్చు చేశాం. జగన్ రెడ్డికి దమ్ముంటే ఎస్సీల కోసం ఎంత ఖర్చు చేశాడో చెప్పాలి. దళితులు ఆత్మగౌరవంతో బ్రతకాలని నేను దళితులకు ఒక్కో ఎకరం రూ.6 లక్షలు పెట్టి భూమి కొని పంపిణీ చేశా. జగన్ రెడ్డి ఐదేళ్లలో ఒక్క ఎకరమైన కొని పంచాడా? అని అడుగుతున్నా’ అన్నారు. ‘కులాంతర వివాహాలకు ఆర్దిక సహాయం చేశా. బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల ద్వారా దళిత పిల్లలను చదివిస్తే బ్రహ్మాండంగా ఎదుగుతారని ఆ పథకాన్ని చిత్తశుద్దితో అమలు చేశాం.
వాటిని జగన్ రెడ్డి రద్దు చేశాడు. అంబేడ్కర్ విదేశీ విద్య ద్వారా సామాన్య దళిత కుటుంబాల్లోని పిల్లలను ప్రపంచంలోనే అత్యున్నతమైన విశ్వవిద్యాలయాల్లో చదివించాలని ఒక్కొక్కరి రూ.15 లక్షలు ఆర్ధిక సహాయం చేశాం. ఆ పథకం ఉపయోగించుకుని కొన్ని వేలమంది దళిత పిల్లలు ఉన్నత విద్యా అభ్యసించారు. అటువంటి పథకాన్ని ఎందుకు తొలగించావు సైకో జగన్ రెడ్డి అని అడుగుతున్నా’ అంటూ నిలదీశారు. అంబేడ్కర్ విదేశీ విద్య పేరు తొలగించి జగన్‌రెడ్డి పేరు పెట్టుకున్న అహంభావి సైకో జగన్‌రెడ్డి. ఇటువంటి పెత్తందారుడికి దళితులు ఓట్లు వేస్తారా అని అడుతున్నా. కేంద్రం ఎస్సీల సంక్షేమం కోసం ఇచ్చే సబ్సిడీ పథకాలన్నీ రద్దు చేశాడు. రాష్ట్రంలో ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను నాశనం చేశాడు. ఎస్సీ పిల్లలు కార్ డ్రైవర్లుగా మిగిలిపోకూడదని వారు ఆ కార్లకు ఓనర్లు కావాలని ఇన్నోవా కార్లు కొనిచ్చాను. జగన్ రెడ్డి ఐదేళ్లలో ఒక్క ఇన్నోవా కారు కొని ఇవ్వలేదు. ఎస్సీలకు ప్రత్యేకంగా ఒక్క కార్యక్రమం కూడా అమలు చేయని దుర్మార్గుడు జగన్ రెడ్డి అని దుయ్యబట్టారు. జగన్ రెడ్డి నాలుగున్నరేళ్లలో దళితులపై 6 వేల కేసులు పెట్టాడు. ఎస్సీలపైనే ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టిన పెద్దమనిషి జగన్‌రెడ్డి. 188 మంది దళితులను దారుణంగా హత్య చేశారు. దళిత డ్రైవర్ సుబ్రమణ్యంను వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చంపి డోర్ డెలివరీ చేశాడు.
ఎస్సీ కుర్రవాడిని చంపిన ఎమ్మెల్సీని ప్రక్కన పెట్టుకుని ఏం మాట్లాడుతావ్ జగన్‌రెడ్డి. నిన్న పోలవరంలో అంబేడ్కర్ విగ్రహానికి దండ వేయడానికి వెళ్లిన అనంతబాబును ఎస్సీ యువకులు తరిమి, తరిమి కొట్టారు. నిజానికి తరిమి కొట్టాల్సింది జగన్ రెడ్డిని, పాతిపెట్టాల్సింది వైసీపీని అని చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగన్‌రెడ్డి పాతిపెట్టినా దెయ్యమై తిరిగిరాకుండా కాంక్రీటు వేసి, సీసం వేసి పాతిపెట్టాలని నా తమ్ముళ్లకు పిలుపునిస్తున్నా అన్నారు. విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన పాపానికి ఆయన్ను పిచ్చివాడిని చేసే చంపేశారు. సీతానగరంలో ఇసుక దోపిడీని ప్రశ్నంచిన దళిత యువకుడు వరప్రసాద్‌కు శిరోముండం చేసి అవమానించారు. నా ఎస్సీలంటూ అనేనిత్యం జపం చేసే జగన్‌రెడ్డి దళిత యువకుడి శిరోముండనాన్ని ఏరోజైనా ఖండిరచాడా? అని ప్రశ్నించారు. అక్కడ ఎన్డీయే అభ్యర్థిని పరిచయం చేస్తూ `వెంకటరాజు బాగా చదువుకున్న అభ్యర్ధి. కంప్యూటర్ విద్య అభ్యసించిన వ్యక్తి. ఒక సాధారణ కుటుంబంలోపుట్టి నేడు రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయనకు మీ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరుతున్నా అని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రాన్ని కాపాడుకోవడానికే పొత్తు
నాకు ఆవేశం ఉంది. కోపం ఉంది. తెలుగు జాతిని కాపాడుకోవాలనే తపన ఉంది. మరలా ఈ జాతిని గాడిన పెట్టి ప్రపంచంలోనే నెం.1 జాతిగా చేయాలనేది నా లక్ష్యం. పేదరికం లేని రాష్ట్రంగా చేయాలనేది నా సంకల్పం. ఈ నా సంకల్పానికి నాతో నడిచేందుకు మీరు సిద్దమా? అని పిలుపునిచ్చారు. మేం పెట్టుకున్న పొత్తు రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే. కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు వస్తే రాష్ట్రాన్ని బాగుచేయడం సులువు అవుతుంది. అందుకే పొత్తు. అందరూ పొత్తను అర్ధం చేసుకుని కూటమిని గెలిపించాలని అభ్యర్ధిస్తున్నాను అన్నారు. వాస్తవాలు తెలుసుకుని నేను చెప్పే విషయాలపై చర్చించండి. కుటుంబాల్లో, రచ్చబండ వద్ద, బస్సుల్లో ఎక్కడుంటే అక్కడ చర్చచేయండి. నేను చెప్పే విషయాలు వాస్తవాలైతే నాతో కలిసిరండి. తెలుగుజాతిని కాపాడుకుందాం అని పిలుపునిచ్చారు. బాపిరాజు గురించి మీకు చెప్పాలి అంటూ, బాపిరాజు పార్టీకి ఎంతో సేవ చేశారు. తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యేగా పెట్టాం. జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చాం. రేపు ఆయనతో మాట్లాడుతా. వెంకటరాజు గెలుపుకోసం అందరూ కలిసిపనిచేయాలని కోరుతున్నా. వెంకరాజు సైతం అందరినీ కలుపుకుని వెళ్లాలని కోరుతున్నాం. జెండాలు మూడు. అజెండా ఒక్కటే. ఆశయం ఒక్కటే’’ అన్నారు. మే13న వెంకటరాజు, ఎంపీ అభ్యర్థి పురందేశ్వరిల గెలుపు కోసం రెండు బటన్లు నొక్కండి. మీ భవిష్యత్తుకు భరోసా నాది అని చంద్రబాబు హామీ ఇచ్చారు.
గోపాలపురంలో చెత్త కొవ్వూరులో బంగారం అవుతుందా
గోపాలపురం వైకాపా ఎమ్మెల్యే బదిలీపై కొవ్వూరుకు వెళ్లాడు. ప్రశాంతమైన గోపాలపురంలో ఆయన హత్య రాజకీయాలను ప్రోత్సహించాడు. నల్లజెర్ల, ద్వారకాతిరుమలలో అక్రమంగా మట్టి, ఇసుక తరలించాడు. చెరువుల్లో మట్టి త్రవ్వి అమ్ముకున్నాడు. సెంటు పట్టాలలో రూ.10 కోట్లు కొట్టేశాడు. ఆయన అక్రమాలు, అరాచకాలను మాఫీ చేయడానికి జగన్ రెడ్డి ఎమ్మెల్యేల ట్రాన్స్‌ఫర్లు అంటూ కొత్త టెక్నాలజీ తీసుకొచ్చాడు. గోపాలపురంలో చెత్త కొవ్వూరులో బంగారం అవుతుందా తమ్ముళ్లు? హోంమంత్రిగా ఉండే మహిళ అక్కడ గెలవలేదా? జగన్‌రెడ్డి మీ చెవుల్లో పూలు పెట్టడానికే ఎమ్మెల్యేల బదిలీలు చేస్తున్నాడు. ఇప్పుడు మీరే తలా ఒక పువ్వు తీసుకెళ్లి జగన్ రెడ్డి చెవులో పెట్టాలి అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఎర్రచెందనం స్మగ్లర్ భాస్కర్ రెడ్డి. ఆయన కొడుక్కి ఎమ్మెల్యే.. ఆయనకు ప్రమోషన్‌లో ఒంగోలు ఎంపీ. పెద్దిరెడ్డి రాష్ట్రాన్ని దోచేసిన వ్యక్తి. కొడుకు, తమ్ముడు, ముగ్గురికీ మూడు సీట్లు. దళితులకు మాత్రం అలా కుదరదు. ఏంటి ఈ అన్యాయం అని మీరు ప్రశ్నించాలి. దళితులంటే చులకన. జగన్‌రెడ్డి మనుషులకు మాత్రం రాష్ట్రాన్ని దోచుకోవడానికి టికెట్లు ఇస్తాడు అని దుయ్యబట్టారు.