- ఐదేళ్ల అవినీతి, ధనదాహం వల్లే ప్రజలపై విద్యుత్ భారం
- మంత్రి డోలా ధ్వజం
అమరావతి (చైతన్యరథం): గత ఐదేళ్లలో ముఖ్యమంత్రిగా జగన్ చేసిన పాపాలు నేటికీ రాష్ట్ర ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ధ్వజమెత్తారు. ప్రజలపై నాడు విద్యుత్ భారాలు మోపి.. నేడు ఏమీ తెలియనట్లు ధర్నాలకు పిలుపునివ్వడం సిగ్గుచేటని మండిపడ్డారు. తాను పెంచిన ఛార్జీలపై తన పార్టీ శ్రేణులతోనే ధర్నాలు చేయించడం సైకో చర్య అని దుయ్యబట్టారు. ఏపీఈఆర్సీ అనుమతించిన దాని కన్నా రూ.19 వేల కోట్లు అదనంగా విద్యుత్ కొనుగోళ్లకు జగన్ ఖర్చు చేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. యూనిట్ రూ.5 కే వచ్చే విద్యుత్‌ను జగన్ ప్రభుత్వం కమీషన్ల కోసం బహిరంగ మార్కెట్లో రూ.8 నుంచి రూ.14కు కొనుగోలు చేసిందని ఆరోపించారు. సర్దుబాటు ఛార్జీల రూపంలో ప్రజలపై భారం మోపేందుకు జగన్ అధికారంలో ఉన్నప్పుడే ఏపీఈఆర్సీ అనుమతి కోరింది వాస్తవం కాదా అని నిలదీశారు. జగన్ అవినీతి, ధన దాహం వల్లే ప్రజలపై భారం పడిరదని విమర్శించారు. పవర్ ఛార్జీలు పెంచినందుకే.. ఆయనకు ప్రజలు పవర్ పీకేశారన్న విషయం జగన్ తెలుసుకోవాలని హితవు పలికారు. ఇకనైనా ప్రజలను మోసం చేయడం మానుకోవాలని హితవు పలికారు.