.వెళ్లవలసిన ప్రాంతాలు, ఇళ్లు ముందే నిర్ణయం
.పరదాలు, బారికేడ్ల చాటున పర్యటన
.ముందస్తు గృహ నిర్బంధాలు
.ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు
అమరావతి: వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి పర్యటన ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లా జరిగిందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గోదావరి వరద బాధితులని ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు. దాన్ని కప్పిప్పుచ్చుకునేందుకు సీఎం పర్యటించారన్నారు. పర్యటించడానికి ముందే ప్రాంతాలను, ఏఏ ఇళ్లకు వెళ్లాలో కూడా ఎంచుకున్నారని చెప్పారు. ముందే అక్కడకి మంత్రులు వెళ్ళి వారికి శిక్షణ ఇచ్చారని, వాలంటీర్లు మానిటరింగ్ చేశారని తెలిపారు. జగన్ రెడ్డి పర్యటన పరదాల మాటున, బారికేడ్ల చాటున సాగిందని విమర్శించారు. అంతేకాకుండా, ముందస్తు గృహనిర్బంధాలు చేశారని చెప్పారు. ఇదంతా మొక్కుబడి పర్యటనలా సాగింది తప్ప ఎక్కడా వరద బాధితులకు భరోసా ఇస్తున్న పరిస్థితి కనిపించలేదన్నారు. వారం రోజులు ముందే పర్యటనకు వచ్చి ఉంటే సహాయ కార్యక్రమాలకు ఆటకం కలిగేదని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అన్నారని, నాయకుడనే వాడు ముందుండి నడిపించాలనేది జగన్‌రెడ్డి తెలుసుకోవాలని హితవు పలికారు. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు వరదలొచ్చి వారం రోజులు గడిచాక పర్యటనకు వెళ్లారని విమర్శించారు.
హుద్ హుద్ తుఫాను వచ్చినపుడు విశాఖపట్నంకు వెళ్లే పరిస్ధితి లేకపోయినా, చంద్రబాబు నాయుడు పలు చోట్ల నుంచి మారుతూ విశాఖపట్నం చేరుకొని కలెక్టర్ ఆఫీసులోనే అయిదు రోజలు ఉండి బాధితులకు సహాయ సహకారాలు అందించారని చెప్పారు. 1996లో గోదావరి జిల్లాల్లో పెనుతుఫాను వచ్చినపుడు ప్రధాన కార్యదర్శి తప్ప అందరు ముఖ్య కార్యదర్శులను రాజమండ్రిలోనే ఉంచి, చంద్రబాబు నాయుడు అక్కడే మినీ సెక్రటేరియేట్ ను ఏర్పాటు చేసి వారం రోజులలోనే పరిస్థితులను చక్కదిద్దారని వివరించారు. నాడు చంద్రబాబు చేసిన సహాయాలకు భిన్నంగా నేడు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి తూతూ మంత్రంగా పర్యటించారన్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పర్యటనకు వస్తున్నారని అధికారులు అక్కడక్కడా కొద్ది మందికి మాత్రం రూ.1000, 2000లు సాయం చేశారని చెప్పారు. జగన్ రెడ్డి వారం రోజులు ముందే వెళ్లుంటే బాధితులకు సకాలంలో సహాయ సహకారాలు అంది ఉండేవన్నారు. జగన్‌రెడ్డి ప్రభుత్వం వరదల సమయంలో అవసర మయ్యే నిత్యావసరాలు, ఇతర సామగ్రి ముందుగా సిద్ధం చేసుకోలేదని చెప్పారు. దీంతో ప్రజలకు కష్ట కాలంలో సాయం అందలేదన్నారు. చిన్నపిల్లలకు పాలు లేక వేడి నీళ్లు కాచి పట్టించినట్లు బాధితులు చెప్పారంటే సహాయకార్యక్రమాలలో ప్రభుత్వం ఎంత వైఫల్యం చెందిందో అర్థమవుతుందనని చెప్పారు.
రూ.10 లక్షలు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇస్తాం అన్నారని, నేడు పది రూపాయలు ఇవ్వని పరిస్ధితి అని చెప్పారు. 2013 ముందు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందుకున్న వారికి కూడా కొత్త ప్యాకేజీ ఇస్తామని పాదయాత్ర సమయంలో చెప్పారని గుర్తు చేశారు. ఆ మాట మరోసారి ఎత్తలేదన్నారు. పొరుగున తెలంగాణలో నష్టపోయిన కుటుంబాలకు రూ.10 వేల చొప్పున పరిహారం ఇచ్చారని, రాష్ట్రంలో మాత్రం వెయ్యి, రెండువేల రూపాయలతోనే సరిపెట్టారని చెప్పారు. ఇక్కడి పరిస్థితులని బట్టి సరిహద్దు విలీన ప్రాంత ప్రజలు తాము తెలంగాణలో ఉంటే మెరుగైన సదుపాయాలు అందేవని భావిస్తున్నారని చెప్పారు. ఆ రకంగా అక్కడి ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందన్నారు. పునరావస కేంద్రాలకు రూ.2000 కోట్లయితే ప్రభుత్వం తరపున అందించి ఉండేవాళ్లమని, రూ.20 వేల కోట్లు కనుక కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ప్రజలకు సహాయం చేస్తాననడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
5 లక్షల కోట్లు అప్పులు తెచ్చిన జగన్‌రెడ్డి నిర్వాసితులకు రూ.20 వేల కోట్లు ఇవ్వలేరా?
మూడు సంవత్సరాలలో రూ.5 లక్షల కోట్ల అప్పులు తెచ్చి, రూ.లక్షా 50వేల కోట్లు సంక్షేమానికి ఖర్చు పెట్టామన్నారు, మిగతా రూ.3. 50లక్షల కోట్లు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. రూ. 5 లక్షల కోట్లు అప్పులో రూ.20 వేల కోట్లు వీలీన మండల ప్రాంత ప్రజలకు ఎందుకు ఇవ్వడం లేదని అడిగారు. ఇంత మంది ఎంపీలు ఉండి ఏం లాభం, కేంద్రాన్ని ఒప్పించి ప్యాకేజీ తెచ్చి నిర్వాసితులకు సహాయం చేయాలి కదా అని అన్నారు. ముఖ్యమంత్రి ముంపు ప్రాంతాల పర్యటనలో రైతులు కూడా తీవ్ర ఆవేదనని వ్యక్తం చేశారని చెప్పారు. ఆక్వా, వరి, తమలపాకు, కూరగాయలు, కొబ్బరి, ఉద్యానవన పంటల రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ముఖ్యమంత్రి నోటి నుంచి రైతులకు భరోసా ఇస్తున్నట్లు రాకపోవడం బాధాకరమన్నారు. రాజధాని కోసం యాగం చేసిన రైతులు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో విశాఖ ప్రజలు, పోలవరం కోసం త్యాగం చేసిన నిర్వాసితులు రోడ్డెక్కిన పరిస్ధితి ఏర్పడిరదని పేర్కొన్నారు. ఈ ముఖ్యమంత్రి వల్ల రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన ప్రతి ఒక్కరి పరిస్థితి ఎంత దయనీయంగా అందరూ చూస్తున్నారని నిమ్మల రామానాయుడు చెప్పారు.