- మార్పు కోసం కూటమికి పోటెత్తిన ఓట్లు
- 57 శాతం ఓట్లతో కూటమి రికార్డు
- 164 శాసనసభ, 21 లోక్‌సభ స్థానాల్లో ప్రభంజనం
- 39శాతం ఓట్లతో వైసీపీకి కేవలం 11 శాసనసభ, 4 లోక్‌సభ సీట్లు
- ప్రతిపక్ష హోదా కూడా దక్కని జగన్‌రెడ్డి పార్టీ
- 23మంది మంత్రుల ఘోర పరాజయం
- 83 శాసనసభ స్థానాల్లో కూటమి అభ్యర్థులకు 30 వేలకు పైగా మెజార్టీలు
- లోక్‌సభ స్థానాల్లోనూ భారీ ఆధిపత్యం
- కుప్పంలో 27వేల ఓట్లకు పైగా పెరిగిన చంద్రబాబు మెజార్టీ
- పులివెందులలో 29 వేల ఓట్లు కోల్పోయిన జగన్‌రెడ్డి
- మంగళగిరిలో లోకేష్‌కు 91 వేల ఓట్ల ఆధిక్యత
అమరావతి (చైతన్య రథం): సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మంగళవారంనాటి ఓట్ల లెక్కింపులో ప్రజాగ్రహం కట్టలు తెంచుకొని పోటెత్తిన సముద్రపు కెరటాల్లా ఎగిసిపడిరది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గత ఐదేళ్ల చీకటి పాలనకు తెరదించుతూ రాష్ట్ర ప్రజలు చారిత్రాత్మక తీర్పునిచ్చారు. ఐదేళ్లుగా ప్రజలు అనుభవించిన వేదనను నిరసిస్తూ కసితో తమ ఓటు ద్వారా జగనాసుర పాలనపై వేటు వేశారు. రాష్ట్రంలో వైసీపీ మూకలు చిందించిన సామాన్యుల రక్తపు బిందువుల రంగు ఒకటే.. అరాచక పాలనలో అవమానాలకు గురైన ప్రజల భాష ఒకటే.. జగన్‌రెడ్డి మోసపు సంక్షేమంతో వంచనకు గురైన అభాగ్యపు పేదల నిట్టూర్పుల తీరు ఒక్కటే.. నిరంతరం పెరిగిన కరెంటు బిల్లుల మోత నాదం ఒక్కటే.. పాలక మూకల అవినీతి, దోపిడీల పర్యవసానం ఒక్కటే.. జగన్ బ్రాండ్ కల్తీ మద్యం బారిన పడినవారి మృత్యుఘోష ఒక్కటే.. దళితులు, గిరిజనులు, బలహీనవర్గాలు, మహిళలపై నిరంతరం సాగిన దాడుల్లో బాధితుల హాహాకారాల సవ్వడి ఒక్కటే.. మోయలేని అప్పుల భారంతో వెల్లడైన సామాన్యుల నిరసనల సరిగమలు ఒకటే. కనుకనే.. కుల, మత, ప్రాంతాలకతీతంగా రాష్ట్ర ప్రజలు ఉమ్మడిగా ఓటు ఆయుధంతో సృష్టించిన ప్రజాస్వామిక నిశ్శబ్ద విప్లవంలో ఐదేళ్లుగా ప్రజాకంటక పాలన చేసిన ముఖ్యమంత్రి అని పిలవబడిన జగనాసురుడు వధించబడ్డాడు.
ఊహకందని చారిత్రాత్మక తీర్పు
2019 ఎన్నికల్లో దేవుని స్క్రిప్టుగా జగన్‌రెడ్డిచే కొనియాడబడిన తీర్పు ఓట్ల లెక్కింపులో పూర్తిగా తిరగబడిరది. తెదేపా- భాజపా -జనసేన కూటమిని రాష్ట్ర ప్రజలు 175 శాసనసభ స్థానాల్లో 164చోట్ల విజయపథంపై నడిపించారు. 25 లోక్‌సభ స్థానాల్లో కూటమికి 21చోట్ల లక్షల మెజార్టీలతో పట్టంగట్టారు. గత ఎన్నికల్లో 151 శాసనసభ స్థానాలు గెలుచుకున్న వైసీపీని ఈ ఎన్నికల్లో కేవలం 11కే పరిమితం చేశారు. శాసనసభ నియమాల మేరకు సభలో ప్రతిపక్ష పార్టీ గుర్తింపు పొందటానికి అవసరమైన 18సీట్లను కూడా గెలుచుకోలేని దుస్థితికి వచ్చిన అధికార వైసీపీ, కొత్తగా ఏర్పడనున్న శాసనసభలో ప్రతిపక్ష హోదా లేకుండా వ్యవహరించాల్సిన పరిస్థితిని కల్పించుకుంది. 2019లో 22 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకున్న జగన్‌రెడ్డి పార్టీకి ముచ్చటగా నాలుగే మిగిల్చారు. ఈవిధంగా రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిపై భారీస్థాయిలో తిరుగుబాటు చేశారు.
ఫలించిన చంద్రబాబు శపథం
రద్దుకానున్న రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి కనుసంజ్ఞలతో ఆయన అనుచరగణం ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును పలుసార్లు హేళనలు, అవమానాలకు గురిచేశారు. ఈ పరంపరలో భాగంగా చంద్రబాబు సతీమణిపైనా వారు తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేయటం ప్రతిపక్ష నేతకు తీవ్రంగా కలచివేసింది. ఆ సందర్భంగా.. తీవ్ర ఆవేదనకు గురైన చంద్రబాబు.. జగన్‌రెడ్డి మూకలు శాసనసభను కౌరవ సభగా మార్చారని.. 2024 ఎన్నికల అనంతరం అధికార వైసీపీని ఓడిరచి శాసనసభను గౌరవ సభగా మార్చి ముఖ్యమంత్రిగా సభలో అడుగు పెడతానని శపథం చేసి చంద్రబాబు అప్పటి నుంచి సభా కార్యక్రమాలను బహిష్కరించారు. నిన్నటి ఓట్ల లెక్కింపుతో చంద్రబాబు శపథం నెరవేరనుంది.
ఫలించిన కూటమి వ్యూహం
రాష్ట్ర ఎన్నికల్లో జగన్‌రెడ్డి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా చేయటం తన లక్ష్యమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా కాలం క్రితమే స్పష్టం చేశారు. అనంతర పరిణామాల్లో.. జగన్‌రెడ్డి కుట్రలో భాగంగా అక్రమంగా అరెస్టు చేయబడి, చంద్రబాబు రాజమహేంద్రవరం జైలులో నిర్బంధంలో ఉన్నప్పుడు గత సెప్టెంబర్ 14న ఆయనను పరామర్శించడానికి వెళ్లిన పవన్ కల్యాణ్ అదే రోజున తెదేపాతో పొత్తు ప్రకటించారు. ఆయన ప్రయత్నాలతో భాజపా కూడా కూటమిలో కలిసింది. ఈ మూడుపార్టీల మధ్య పూర్తిస్థాయిలో ఓటు బదిలీకి కూటమి అగ్ర నాయకులు చేసిన కృషి ఫలించింది.
దీని ఫలితంగా నిన్న జరిగిన ఓట్ల లెక్కింపులో కూటమి 56.94 శాతం ఓట్లతో ప్రభంజనం సృష్టించింది. తెదేపాకు 45.45 శాతం, జనసేనకు 8.52 శాతం, భాజపాకు 2.97 శాతం ఓట్లు దక్కాయి.
గత ఎన్నికల్లో దాదాపు 50 శాతం ఓట్లు దక్కించుకున్న వైసీపీ ఈ ఎన్నికల్లో 10 శాతం ఓట్లను కోల్పోయి 39.42 శాతానికి పరిమితమైంది. కాంగ్రెస్‌కు 1.68 శాతం, సీపీఎంకు 0.13 శాతం, సీపీఐకు 0.04 శాతం ఓట్లు మాత్రమే లభించాయి.
తెదేపా అంచనాల మేరకే ఫలితాలు
మే1న 40కి పైగా వెల్లడైన ఎగ్జిట్ పోల్స్‌లో ఒక్క కేకే సర్వే మాత్రమే మూడు పార్టీల కూటమికి 161 సీట్లు దక్కనున్నాయని తెలిపింది. మిగతా సర్వేల ఫలితాలు నిన్న కూటమి సాధించిన 165 స్థానాలకంటే చాలా దూరంగా మిగిలిపోయాయి.
అయితే తెలుగుదేశం పార్టీ అంతర్గత అంచనాలు వాస్తవానికి చాలా దగ్గరగా వచ్చాయి. మూడు పార్టీల కూటమి ఏర్పాటైన వెంటనే 2019 ఎన్నికల్లో ఆ పార్టీలు సాధించిన ఓట్ల ఆధారంగా ఈ ఎన్నికల్లో రెండుశాతం ఓట్లు అధికంగా వస్తే కూటమికి కనీసంగా 147 శాసనసభ స్థానాలు లభిస్తాయని, ఐదు శాతం ఓట్లు అధికంగా లభిస్తే 160కి పైగా సీట్లు లభిస్తాయని తెదేపా లెజిస్లేచర్ పార్టీ కార్యదర్శి, పోల్‌మేనేజ్‌మెంట్ సమన్వయకర్త కోనేరు సురేష్ పార్టీ అగ్రనాయకుల సమావేశంలో ఒక ప్రజంటేషన్ ద్వారా వివరించారు. అదే నిజమైందని పలువురు తెదేపా అగ్రనేతలు మంగళవారం వ్యాఖ్యానించారు.
తెదేపా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు, రాష్ట్రశాఖ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు పలు సభల్లో కూటమికి 160కి పైగా శాసనసభ సీట్లు లభిస్తాయని, లోక్‌సభ సీట్లను కూడా భారీస్థాయిలో గెలుచుకుంటామని చెప్పారు.
కూటమి అభ్యర్థులకు భారీ మెజార్టీలు
రాష్ట్ర ప్రజలు ఆవిష్కరించిన ఈ ప్రజాస్వామిక విప్లవ ఫలితంగా ప్రతి నియోజకవర్గంలోను కూటమి అభ్యర్థులు తమ వైసీపీ ప్రత్యర్థులపై భారీ ఆధిక్యతను ప్రదర్శించారు. పది శాసనసభ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు 70 వేలకు పైగా మెజార్టీతో గెలుపొందారు. 17చోట్ల 50 వేల నుంచి 70 వేల ఆధిక్యతతో సీట్లను సొంతం చేసుకున్నారు. 24 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు 40నుంచి 50 వేల మెజార్టీతో విజయ దుందుభి మోగించారు. 32చోట్ల 30నుండి 40 వేలు, మరో 41 నియోజకవర్గాల్లో 20 నుండి 30 వేల భారీ మెజార్టీతో కూటమి అభ్యర్థులు శాసనసభకు ఎన్నిక కావటం విశేషం. క్లుప్తంగా.. మొత్తం 175 శాసనసభ స్థానాల్లో 124చోట్ల అనగా 71 శాతం సీట్లల్లో 20 వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొంది కూటమి ప్రభంజనాన్ని సృష్టించింది.
మంగళవారం రాత్రి 10 గంటల వరకు అందిన సమాచారం మేరకు.. మొత్తం 175 శాసనసభ స్థానాల్లో తెదేపా- భాజపా -జనసేన కూటమి 164 స్థానాల్లో విజయావకాశాలపై పట్టుసాధించి 94 శాతం స్టైక్ రేటుతో దూసుకుపోయింది. తెదేపా పోటీ చేసిన 144 స్థానాల్లో 135చోట్ల గెలుపును ఖరారు చేసుకొని 95 శాతం స్టైక్ రేటు సాధించింది. పోటీ చేసిన మొత్తం 21 స్థానాలను గెలుచుకొని జనసేన గెలుపు లక్ష్యాన్ని వంద శాతం ఛేదించి రికార్డు స్థాపించింది. పదింట్లో 8 స్థానాలు గెలుచుకొని భాజపా 80 శాతం స్టైక్ రేటును సొంతం చేసుకుంది. గత ఎన్నికల్లో 151 శాసనసభ స్థానాలను గెలుచుకున్న వైసీపీ స్టైక్ రేటు 86 శాతం ఉండగా.. నిన్న జరిగిన ఓట్ల లెక్కింపులో అది కేవలం 5.71 శాతానికి దిగజారింది.
20 జిల్లాల్లో ఖాతా తెరవని వైసీపీ
రాష్ట్రంలోని 25 జిల్లాల్లో అధికార వైసీపీ 20 జిల్లాల్లో కనీసం ఒక్క శాసనసభ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. కూటమి ప్రభంజనలో మిగిలిన ఐదు జిల్లాల్లో రెండేసి సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. అధికార పార్టీ ఖాతా తెరచిన ఐదు జిల్లాలు.. అరకు, ఒంగోలు, రాజంపేట, కడప, కర్నూలు. ఈమేరకు రాష్ట్రవ్యాప్తంగా పూర్తి ఆధిపత్యాన్ని కనబరచిన కూటమి 20 జిల్లాల్లో అన్ని 144 శాసనసభ స్థానాలను గెలుచుకొని క్లీన్ స్వీప్ చేసింది.
భారీ మెజార్టీల వివరాలు
మంగళగిరి శాసనసభ ఎన్నికలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 91,413 ఓట్ల ఆధిక్యాన్ని సాధించి రాష్ట్రంలో మూడవ స్థానంలో నిలిచారు. గాజువాకనుంచి పల్లా శ్రీనివాసరావు 95,235 ఓట్ల ఆధిక్యంతో అగ్రస్థానంలో ఉన్నారు. భీమిలి నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థి గంటా శ్రీనివాసరావు (92,401 ఓట్ల ఆధిక్యం) మూడవ స్థానంలో నిలిచారు. తణుకునుంచి తెదేపా అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణ (72,121 ఓట్ల ఆధిక్యం), కాకినాడ రూరల్‌నుంచి తెదేపా అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు (72,040 ఓట్ల ఆధిక్యం), రాజమండ్రి సిటీ నుంచి తెదేపా అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ 71,404 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
పెరిగిన చంద్రబాబు మెజార్టీ
కుప్పం నియోజకవర్గం నుండి తెదేపా అధినేత చంద్రబాబును ఓడిరచాలని ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి సకల ప్రయత్నాలు చేసినా ఆయన ఈ ఎన్నికల్లో తన ఆధిక్యతను 27,266 ఓట్లు పెంచుకున్నారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు 20,740 ఓట్ల ఆధిక్యత సాధించగా, నిన్నటి లెక్కింపులో అది 48,006 ఓట్లకు పెరిగింది.
తగ్గిన జగన్ మెజార్టీ
గత ఎన్నికల్లో 90,543 ఓట్ల మెజార్టీని జగన్‌రెడ్డి సాధించగా.. ఈ ఎన్నికల్లో అది 61,176 ఓట్లకు పడిపోయింది. ఈమేరకు ముఖ్యమంత్రి ఈ ఎన్నికల్లో పులివెందులలో 29,367 ఓట్లను కోల్పోవడం గమనార్హం.
తెదేపా అభ్యర్థుల అతి స్వల్ప మెజార్టీలు మడకశిరలో ఎంఎస్ రాజు 351 ఓట్లు, గిద్దలూరులో ముత్తుముల అశోక్‌రెడ్డి 973, రాయచోటిలో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి 2495 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.
వైసీపీ విజేతలు
కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీలతో విజయఢంకా మోగించగా.. అధికార వైసీపీ అభ్యర్థులు ఘోర పరాజయాలపాలయ్యారు. కడపటి సమాచారం మేరకు వారు కేవలం 11 స్థానాల్లోనే ఆధిక్యత సాధించారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమే గెలుపొందగా ఐదుగురు ఉప ముఖ్యమంత్రులతోపాటు మొత్తం మంత్రిమండలిలోని 23మంది మంత్రులు ఓటమి పాలయ్యారు. పెద్దిరెడ్డి ఆరువేలకుపైగా ఆధిక్యత సాధించగలిగారు. అరకు వ్యాలి, పాడేరు, బద్వేలు, తంబళ్లపల్లె, మంత్రాలయం మినహా అధికార పార్టీ గెలిచే.. ఆలూరు, రాజంపేట, ఎర్రగొండపాలెం, దర్శిలలో అధికార పార్టీ అభ్యర్థుల ఆధిక్యత స్వల్పంగా ఉంది.