అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ సరికొత్త రికార్డు నమోదు చేసింది. పోటీ చేసిన అన్నిచోట్లా ఆ పార్టీ విజయం సాధించింది. పదేళ్ల రాజకీయ ప్రయాణంలో సరికొత్త ఘనతను తన ఖాతాలో వేసుకుంది. గత ఎన్నికల్లో కేవలం ఒక్కటంటే ఒక్క స్థానం గెలుపొందిన ఆ పార్టీ.. ఈసారి ఏకంగా పోటీ చేసిన 21 స్థానాల్లోనూ విజయం సాధించింది. తోక పార్టీ అంటూ విమర్శలు చేసిన వారికి ఈ విజయంతో గట్టి బదులిచ్చింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదంటూ మొదటినుంచీ చెప్తూ వచ్చిన జనసేనాని పవన్ కల్యాణ్ కీలక సమయంలో టీడీపీతో పొత్తు ప్రకటించారు. సీట్ల సర్దుబాటు సమయంలో ఆయన 24 స్థానాల్లో పోటీ చేస్తామని తొలుత ప్రకటించారు. తర్వాత మూడు స్థానాలు మిత్రపక్షమైన బీజేపీకి విడిచిపెట్టారు. దీంతో కొందరు ‘సీనియర్’ నేతలు పవన్‌కు ఉచిత సలహాలు ఇచ్చారు. ఆయనకు లేఖాస్త్రాలు సంధించారు. కానీ వారి ‘పల్లకి మోతలకు ఎక్కడా పవన్ కల్యాణ్ తలొగ్గలేదు. వారికి సమాధానం కూడా ఇవ్వలేదు. తన పని తాను చేసుకుంటూ పోయారు. 21 స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. అందరినీ ఒంటిచేత్తో గెలిపించుకోగలిగారు.
98 శాతం కాదు.. 100 శాతం
గెలిచే సామర్థ్యం ఉన్న అభ్యర్థులనే బరిలో నిలుపుతున్నాం. ఎక్కువ సీట్లు తీసుకుని ప్రయోగాలు చేసే బదులు, తక్కువ స్థానాలు తీసుకుని రాష్ట్ర భవిష్యత్ కోసం ముందుకెళ్లాలని నిర్ణయించాం. 98 శాతం స్ట్రైక్ రేటు ఉండేలా అభ్యర్థులను ఎంపిక చేశాం. 60, 70 స్థానాలు తీసుకోవాల్సిందని కొందరు అంటున్నారు. గత ఎన్నికల్లో కనీసం 10 స్థానాలు గెలిచి ఉంటే ఇప్పుడు ఎక్కువ స్థానాలు అడిగేందుకు అవకాశం ఉండేదని ఎన్నికల ముందు పవన్ కల్యాణ్ ఓ సందర్భంలో చెప్పారు. ఎలాంటి పొరపొచ్చాలు వచ్చినా అవన్నీ దాటుకుని టీడీపీ- జనసేన గెలుపునకు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆయన చెప్పినట్లే ఆ పార్టీ అభ్యర్థులు 21 స్థానాల్లో విజయం సాధించారు.
టీడీపీ, బీజేపీ జోరు
ఈసారి జనసేన, బీజేపీతో కలిసి బరిలోకి దిగిన తెలుగుదేశం పార్టీ కూడా సంచలన విజయాన్ని నమోదు చేసింది. 2014 ఎన్నికల్లో 102 స్థానాల్లో గెలుపొందిన ఆ పార్టీ గత ఎన్నికల్లో కేవలం 23 స్థానాలకే పరిమితమైంది. ఈసారి 144 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ 135 స్థానాల్లో విజయం సాధించింది. అటు బీజేపీ కూడా 10 స్థానాల్లో పోటీ చేసి, 8 చోట్ల విజయం సాధించింది. అదే సమయంలో ‘వై నాట్ 175’ అంటూ గొప్పలకు పోయిన వైసీపీ 11 సీట్లకే పరిమితమయింది.