- పోస్టల్ బ్యాలెట్లపై వైసీపీ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం
అమరావతి: పోస్టల్ బ్యాలెట్ల అంశంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారంపై ఆర్వో సంతకం ఉంటే సరిపోతుందని, స్టాంపు, హోదా లేకపోయినా ఫర్వాలేదన్న ఈసీ ఉత్తర్వులను సమర్థిస్తూ ఏపీ హైకోర్టు శనివారం తీర్పు వెలువరించింది. ఈసీ ఉత్తర్వులను సవాలు చేస్తూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టి వేసింది. సీఈసీ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సమయంలో ఓటరు డిక్షరేషన్‌కు సంబంధించిన ‘ఫారం- 13ఏ’’పై అటెస్టింగ్ అధికారి పేరు, హోదా, సీలు లేకపోయినా పర్వాలేదు, ఆ అధికారి సంతకం ఉంటే చాలు, వాటిని పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేస్తూ సీఈసీ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో వైసీపీ వ్యాజ్యం వేసింది. ఈ వ్యాజ్యంలో శుక్రవారమే ఇరువర్గాల వాదనలు పూర్తికావటంతో శనివారానికి తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. ఈ మేరకు పిటిషనర్ వాదనలు తోసిపుచ్చుతూ తీర్పు వెలువరించింది. సీలుపై ఎన్నికల కమిషన్ ఇచ్చిన వివరణతో న్యాయస్థానం ఏకీభవించింది. సీఈసీ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ వైసీపీ పిటిషన్‌ను హై కోర్టు తోసిపుచ్చింది. ఈ పరిణామంతో వైసీపీకి గట్టి షాక్ తగిలినట్లయ్యింది.
పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేయకుండా ఆపలేకపోయాం.. కనీసం ఆ ఓట్లను చెల్లకుండా చేద్దామని వైసీపీ తాపత్రయపడిరది. రిటర్నింగ్ ఆఫీసర్లను అడ్డం పెట్టుకుని సీల్ లేకుండా పెద్ద ఎత్తున ఓట్లను బ్యాలెట్ బాక్సుల్లో వేయించారు. చాలా చోట్ల రిటర్నింగ్ అధికారులు సంతకం చేసినా, సీల్ వేయలేదు. కొన్ని చోట్ల హోదా రాయలేదు. దీంతో వైసీపీ నేతలు ఇక ఆ ఓట్లు చెల్లవనుకున్నారు. కానీ తీరా సీలు లేకపోయినా చెల్లుతాయని ఈసీ ఉత్తర్వులు ఇవ్వడంతో వైసీపీ నేతలు దిగ్భ్రాంతికి గురయ్యారు. దీంతో ఆదుపుతప్పి తప్పి మాట్లాడుతున్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో అలజడులు రేపుతామని.. ఘర్షణలు జరిగితే ఈసీదే బాధ్యతని చెబుతున్నారు. అంతేనా అసలు రూల్స్ పాటించే వాళ్లు కౌంటింగ్ కేంద్రాలకు రావద్దని సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి సెలవిచ్చారు. గొడవలు పెట్టుకునే వారే వెళ్లాలని సలహాలు కూడా ఇచ్చారు. అంటే సీలు లేని పోస్టల్ బ్యాలెట్స్ చెల్లవంటూ వాదించాలనేది ఆయన సూచన. ఈ విషయంలో గొడవలకు దిగి కౌంటింగ్‌ను అడ్డుకోవాలనేది సజ్జల మాటల్లోని అంతరార్థం. అయితే కౌంటింగ్ కేంద్రాల్లో గొడవలు చేస్తే తీసుకెళ్లి జైల్లో వేస్తామని సీఈవో గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ విషయం ఏమిటంటే వైసీపీ కేవలం పోస్టల్ బ్యాలెట్ బాక్సుల్లో పడిన ఉద్యోగుల ఓట్ల గురించే ఆలోచిస్తోంది. వారి కుటుంబసభ్యులు.. ఎన్నికల విధుల్లో పాల్గొనని ఉద్యోగులు.. వారి కుటుంబసభ్యులు ఎటు ఓటు వేసి ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొత్తం 5,39,187 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయితే వాటిలో ప్రభుత్వ ఉద్యోలవే 4,44,216 ఓట్లున్నాయి.
ప్రభుత్వ ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ వివరాలు:
టీచర్లు-1,60,000
పోలీస్‌లు -1,30,000
రెవిన్యూ అధికారులు -60,000
సచివాలయం ఉద్యోగులు- 50,000
ఇతర శాఖ ఉద్యోగులు – 44,216
మొత్తం పోస్టల్ బ్యాలెట్లు: 4,44,216
అదనపు పోస్టల్ బ్యాలెట్/ హోం ఓటింగ్ వివరాలు:
వృద్ధులు`13,755
ఎమర్జెన్సీ కార్మికులు `27,100
వికలాంగులు `12,718
సర్వీస్ ఓటర్లు`41,398
మొత్తం 94,971
మొత్తం బ్యాలెట్లు: 5,39,187 ఓట్లు.