- 23 వరకు రిమాండ్ విధించిన కోర్టు
- అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఏసీబీ చర్యలు
అమరావతి: వైసీపీ మాజీ మంత్రి, నోటిదురుసు నాయకుడు జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఉన్న నివాసంలో రాజీవ్‌ను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఆయనను ఏసీబీ కోర్టు ముందు హాజరపరచగా ఈ నెల 23 వరకు రిమాండ్ విధించారు. ఆయనతో పాటు అరెస్ట్ చేసిన సర్వేయర్ రమేష్‌కూ 23వ తేదీ వరకు కోర్టు రిమాండ్ విధించింది. అగ్రిగోల్డ్’ భూములకు సంబంధించిన అవకతవకల వ్యవహారంలో సీఐడీ ఇప్పటికే కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఇబ్రహీంపట్నంలోని జోగి ఇంట్లో మంగళవారం తెల్లవారుజాము నుంచే ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. సుమారు 15 మందితో కూడిన అధికారుల బృందం పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సోదాల అనంతరం రాజీవ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
రెండు దశాబ్దాల కిందట అగ్రిగోల్డ్ సంస్థ.. ప్రజల నుంచి సొమ్ములు సేకరించి బోర్డు తిప్పేసింది. దీనిపై దాఖలైన కేసుల విచారణ సందర్భంగా అగ్రిగోల్డ్ ఆస్తులను విక్రయించి.. డిపాజిట్ దారులకు న్యాయం చేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పలు ప్రాంతాల్లో అగ్రిగోల్డ్‌కు చెందిన భూములను సీఐడీ జప్తు చేసింది. సీఐడీ జప్తులో ఉన్న భూములను జోగి రమేష్ కుటుంబీకులు కొనుగోలు చేశారన్నది ప్రధాన ఆరోపణ. విజయవాడ రూరల్ మండలంలోని అంబాపురంలో అగ్రిగోల్డ్ భూములను తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించి కాజేశారు. సర్వే నెం.88లోని 2160 చ.గ. భూమిని జోగి రమేష్ కుమారుడు జోగి రాజు, రమేష్ బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు కొనుగోలు చేశారు. అగ్రిగోల్డ్ కేసు వ్యవహారంలో ఈ భూమిని సీఐడీ గతంలోనే అటాచ్ చేసింది. అయితే, నాటి మంత్రి జోగి రమేష్ తన అధికారాన్ని అడ్డంపెట్టుకుని.. భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. నకిలీ రిజిస్ట్రేషన్ వేరే వారిపై చేసి.. మళ్లీ తమ కుటుంబ సభ్యులకు రిజిస్ట్రేషన్ చేయించేందుకు జోగి రమేష్ కుట్ర పన్నారు.
ఇదే విషయాన్ని రెవెన్యూ డిపార్ట్‌మెంట్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక ఆధారంగా ఏసీబీ అధికారులు విచారణ ప్రారంభించారు. కొనుగోలు చేసిన భూమి రికార్డులు తారుమారు చేసి సర్వే నెంబరు కూడా మార్చేశారు. సర్వే నెం.88లోని భూమిని కొని దానిని సర్వే నెం.87లోకి మార్చాలంటూ రిజిస్ట్రేషన్ శాఖపై ఒత్తిడి తీసుకొచ్చారు. జోగి బాబాయ్, తనయుడి పేరిట 29.04.2023న స్వీయ దిద్దుబాటు దస్తావేజులంటూ దొంగ పత్రాలు సృష్టించారు. అదే భూమిని 31.05.2023న పడిగిపాటి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులకు విక్రయించారు. గ్రామ సర్వేయర్ దేదీప్య ఎటువంటి సర్వే నిర్వహించకముందే సర్వే చేసినట్లు దొంగ రికార్డులు సృష్టించారు. సర్వే సమయంలో సరిహద్దు దారుల్కెన అద్దేపల్లి కిరణ్, రాంబాబులకు నోటీసులు ఇచ్చి వాళ్లు కూడా నిర్థారించినట్లు కట్టుకథలు అల్లారు. అయితే, జోగి కుటుంబ అక్రమాలపై అగ్రిగోల్డ్ సంస్థ ఫిర్యాదుతో దొంక కదిలింది. పూర్తి ఆధారాలతోనే ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపట్టి.. జోగి రాజీవ్‌ను అరెస్ట్ చేశారు.
అగ్రిగోల్డ్ భూమి కొనుగోలు కేసులో నిందితుల వివరాలు.. 1. జోగి రాజీవ్, 2. జోగి సోదరుడు వెంకటేశ్వరరావు, 3. అడుసుమిల్లి మోహన రంగ దాసు, 4. వెంకట సీతామహాలక్ష్మీ, 5. సర్వేయర్ దేదీప్య 6. మండల సర్వేయర్ రమేశ్, 7. డిప్యూటీ తహశీల్దార్ విజయ్ కుమార్, 8. విజయవాడ రూరల్ తహసీల్దార్ జాహ్నవి, 9. విజయవాడ రిజిస్ట్రార్ నాగేశ్వరరావులు ఈ జాబితాలో ఉన్నారని అధికారులు తెలిపారు. కాగా మిగతా వారిని పోలీసులు త్వరలో విచారించే అవకాశం ఉంది.
ఈ మొత్తం వ్యవహారంపై ఏసీబీ అడిషినల్ ఎస్పీ సౌమ్యలత మీడియాతో మాట్లాడుతూ అగ్రిగోల్డ్ భూముల విషయంలో అవకతవకలు జరిగాయని చెప్పారు. మంగళవారం ఈరోజు అరెస్టు చేశాం. అగ్రిగోల్డ్ భూముల సర్వే నెంబర్‌ను కూడా మార్చారు. ఏసీబీ అధికారుల విచారణలో అవకతవకలు నిజమని తేలాయి. సీఐడీ అధికారుల నివేదికను కూడా తెప్పిస్తున్నాం. అగ్రిగోల్డ్ ఆస్తులు సీఐడీ అటాచ్‌మెంట్‌లో ఉన్నాయి. మా విచారణ లో పిసీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశాం. ప్రభుత్వ అధికారులు ఈ కేసులో దోషులుగా ఉన్నారు. అందుకే మా విచారణ వేరుగా సాగిస్తున్నాం. సీఐడీ, ఏసీబీ అధికారుల విచారణ నివేదికలు ఉన్నతాధికారులకు వివరిస్తాం. మా దర్యాప్తులో ఐదుగురి పేర్లు ఉన్నాయి. విచారణలో మరికొన్ని పేర్లు ఉండొచ్చు.
మాజీమంత్రి జోగి రమేష్ పాత్రపై విచారణ జరుగుతుంది. నిర్దారణ అయితే కేసు నమోదు చేస్తాం. 87 సర్వేలో ఎలాంటి సబ్ డివిజన్‌లు జరగలేదు. అవ్వా శేష నారాయణ ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించాం. అక్రమ రిజిస్ట్రేషన్ లు జరిగాయని తేలాకే కేసు నమోదు చేశాం. 88 సర్వేలో స్థలం కొని.. 87 సర్వేలో ఉందని మార్పు చేసుకున్నారు. ఇదంతా ఒక కుట్ర ప్రకారమే జరిగింది. గ్రామ, మండల సర్వేయర్లను మేనేజ్ చేశారు. సర్వేయర్ రమేష్, జోగి రాజీవ్‌లను అరెస్టు చేశాం. వారిద్దరినీ కోర్టులో హాజరు పరుస్తామని సౌమ్యలత చెప్పారు.