అమరావతి: మద్యం కేసులో తెదేపా అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును ఉన్నత న్యాయస్థానం రిజర్వు చేసింది. ఈ కేసులో తుది తీర్పు వచ్చే వరకు తొందరపాటు చర్యలొద్దని ఏపీ సీఐడీని హైకోర్టు ఆదేశించింది. ఈనెల 23న జరిగిన విచారణలో చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాదులు నాగముత్తు, దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు.
మద్యం దుకాణాల లైసెన్స్‌దారులకు 2015-17 సంవత్సరాల్లో ప్రివిలేజ్ ఫీజు తొలగింపునకు ప్రతిపాదించిన పైలు అప్పటి సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి, కమిషనర్ స్థాయిలోనే నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఫైలును ఆర్థిక శాఖకు పంపకపోవడాన్ని సీఐడీ ఆక్షేపించడం సరికాదని, ఈ విషయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. అందుకు అప్పటి ముఖ్యమంత్రి, మంత్రిని బాధ్యులను చేయడం సరికాదన్నారు. పిటిషనర్‌పై దురుద్దేశపూర్వకంగా కేసు నమోదు చేశారని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు.
ఆ రోజు జరిగిన విచారణలో ఇరువైపులా వాదనలు ముగించిన న్యాయస్థానం… మౌలికంగా తెలిపిన వివరాలను రాతపూర్వకంగా కోర్టు ముందుంచాలని పిటిషనర్లకు సూచిస్తూ విచారణను వాయిదా వేసింది. దీనిపై తీర్పును రిజర్వు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. తీర్పు వచ్చేవరకు తొందరపాటు చర్యలు వద్దని సీఐడీని హైకోర్టు ఆదేశించింది.
గత ప్రభుత్వ హయాంలో మద్యం కంపెనీలకు అనుచిత లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలతో బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి ఫిర్యాదు ఆధారంగా చంద్రబాబు, కొల్లు రవీంద్ర, ఎక్సైజ్ శాఖ కమిషనర్‌పై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.