- నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై వేటు
- డీఎస్పీతో పాటు గోశాల డైరెక్టర్ సస్పెన్షన్
- ఎస్పీ, జేఈవో, టీటీడీ సీఎస్‌వో శ్రీధర్ బదిలీ
- భక్తుల మృతి తనను ఎంతగానో కలిచివేసింది
- ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం
- వారి కుటుంబాల్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం
- తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.5 లక్షలు
- సాధారణ క్షతగాత్రులకు రేపు ప్రత్యేక దర్శనం
- తిరుపతిలో టోకెన్లు ఇస్తున్నారని నాకూ తెలియదు
- ఇకముందు ఎలాంటి దుర్ఘటన జరగకూడదు
- మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
- ఘటనా స్థలం పరిశీలన…క్షతగాత్రులకు పరామర్శ
తిరుపతి(చైతన్యరథం): పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో జరిగిన బాధాకరమైన ఘట న నన్ను తీవ్రంగా కలిచివేసింది. భక్తుల మరణ వార్త విని ఎంతో బాధపడ్డా. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకునేలా టీటీడీ అధికారులను ఆదేశి స్తున్నా. తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ఒక వుంకటేశ్వరస్వామి భక్తుడిగా, ముఖ్యమంత్రిగా నాపై ఉంది. తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సంద ర్భంగా బుధవారం జరిగిన తోపులాటలో ఆరుగురు భక్తులు మృతిచెందడంపై ముఖ్య మంత్రి విచారం వ్యక్తం చేశారు. తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని గురువారం నిశితంగా పరిశీలించి దుర్ఘటనపై అక్కడే అధికారులను ప్రశ్నించారు. అనంతరం స్విమ్స్, పద్మావతి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఆసుపత్రుల్లోనే రెండు గంటల పాటు ఉండి గాయపడ్డ వారందరికీ ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం టీటీడీ పరిపాలనా భవనంలో ఘటనపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయడు, ఈవో శ్యామలారావు, మంత్రులు, అధికారుల తో సమీక్షించారు.
ఒక్కో మృతుల కుటుంబానికి రూ.25 లక్షలు
తిరుమల కొండపై ఇంతటి విషాదం ఎంతో బాధిస్తోంది. తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు విడిచారు. లావణ్య(విశాఖ), శాంతి(విశాఖ), నాయుడు బాబు (నర్సీపట్నం), రజనీ(విశాఖ), నిర్మల (కోయంబత్తూర్), మల్లిక(మెట్టు సేలం) భక్తులు మరణించారు. వారి ఆత్మకు శాంతికలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందిస్తాం. మృతుల కుటుంబసభ్యుల్లో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తాము. తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ వారికి రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తాము. చికిత్స పొందేవారికి ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుంది. ఈ ఘటనలో మరో 33 మంది గాయపడ్డారు. వారికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తాము. వీరందరికీ వైకుంఠ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కల్పిస్తాం. దర్శనం అనంతరం రవాణా ఖర్చులు భరించి వారిని ఇంటికి చేరుస్తామని తెలిపారు.
భక్తుల మరణవార్త కలచివేసింది
విశాఖపట్నంలో బుధవారం ప్రధానమంత్రి రూ.2.8 లక్షల కోట్ల పెట్టుబడులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఆ కార్యక్రమం పూర్తి చేసుకుని ఇంటికి వస్తున్న తరుణంలో ఈ విషాద వార్త విని మనసు కలిచివేసింది. చాలా బాధపడుతున్నాను. వెంకటేశ్వరుని సన్నిధిలో ఎలాంటి అపచారాలు జరగకూడదు. తిరుమల పవిత్రతను నిలబెట్టడం ఒక భక్తుడిగా, ముఖ్యమంత్రిగా నా బాధ్యత. ఈ దివ్యక్షేత్రం పవిత్రతను కాపాడేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. మనం చేసిన పనుల వల్ల దేవుని పవిత్రత దెబ్బతినకూడదు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. రాజకీయాలకు అతీతంగా కలియుగ దైవమైన వేంకటేశ్వరునికి సేవ చేస్తున్నామని ప్రతిఒక్కరూ అనుకోవాలి. క్రిస్టియన్లు జెరూసలేం, ముస్లింలు మక్కాకు వెళతారు. హిందువులు తిరుమల కొండకు వస్తారు. జీవితంలో ఒక్కసారైనా వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారిని దర్శించుకోవాలని భక్తులు అనుకుంటారు. వైకుంఠ ఏకాదశి నాడు స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠానికి వెళ్తామని భక్తుల ప్రగాఢ నమ్మకమని పేర్కొన్నారు.
టోకెన్లు ఇచ్చే సంప్రదాయం గతంలో లేదు
ఎప్పుడూ లేని టోకెన్ల సంప్రదాయాన్ని గతంలో తెచ్చారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పవిత్రమైన రోజులు. వైకుంఠ దర్శనాన్ని 10 రోజులకు ఎందుకు పెంచారో తెలియదు. తిరుపతిలో టోకెన్లు ఇవ్వడంపై భక్తులు ఆగ్రహంగా ఉన్నారు. మొదటి నుంచి ఉన్న సం ప్రదాయాలను మార్చడం సరికాదు. ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయ పద్ధతులు ఉండాలి. సంప్రదాయాలను ఉల్లంఘించడం సరికాదని అభిప్రాయ పడుతున్నా. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో అపచారాలు జరగకుండా చర్యలు చేపడతాం. పర్వదినాల్లో శ్రీవారి దర్శ నం చేసుకోవాలని భక్తులు బలంగా కోరుకుంటారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుం డా దర్శనం చేయించే బాధ్యత టీటీడీపై ఉందని తెలిపారు.
ఇద్దరు అధికారుల సస్పెన్షన్..మరో ముగ్గురు బదిలీ
ఇలాంటి సమయాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. కానీ కొందరు బాధ్యతా రాహిత్యంగా ఉన్నట్లు కనిపిస్తోంది. డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నాం. ఎస్పీ సుబ్బారాయుడు, టీటీడీ జేఈవో గౌతమి, టీటీడీ సీఎస్ వో శ్రీధర్‌ను బదిలీ చేస్తున్నాం. జరిగిన మొత్తం ఘటనపై న్యాయ విచారణకు ఆదేశి స్తున్నాం. టీటీడీ బోర్డు చైర్మన్, సభ్యులు, జేఈవో సహా కొండపై అందరూ సమన్వ యంతో పనిచేయాలి. దేవుని పవిత్రతకు భంగం కలిగించకూడదు. పెత్తందార్లుగా కాకుండా సేవకులుగా దేవుని సేవలో పాల్గొనాలి. తిరుమల పవిత్రతను కాపాడతానని మరోసారి చెబుతున్నాము. 45 ఏళ్లుగా నేను రాజకీయాల్లో ఉన్నాను. 23 ఏళ్లు టీడీపీ అధికారంలో ఉంది. తిరుపతిలో టోకెన్లు ఇస్తున్నారని నాకు కూడా తెలియదు. అక్కడ మరిన్ని జాగ్రతలు తీసుకోవాల్సి ఉంది. తిరుమలలో ఉన్న తృప్తి.. తిరుపతిలో రాదని భక్తులు అంటున్నారు. గత ఐదేళ్లలో కొండపై చాలా అరాచకాలు జరిగాయి. కానీ రాజకీ యాలు మాట్లాడదలుచుకోలేదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తిరుమలకు వచ్చినప్పుడు నేను సామాన్య భక్తుడిగానే ఉంటా. వైకుంఠ ఏకాదశికి ఎన్ని టికెట్లు ఇవ్వా లనే దానిపైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.