- నిస్సిగ్గుగా గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించిన జగన్‌రెడ్డి
- వైఫల్యాలను మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం
- గవర్నర్ వ్యవస్థ అపహాస్యం
- అభూతకల్పనతో ప్రజలను మోసగించే యత్నం
- గవర్నర్ ప్రసంగంపై టీడీపీ సభ్యుల ఆగ్రహం
అమరావతి:రాష్ట్రప్రభుత్వం శాసనసభలో గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించిందని టీడీపీ సభ్యులు విమర్శించా రు. గవర్నర్ ప్రసంగం మొత్తం అబద్ధాలు, అసత్యాల మయమని మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగాన్ని నిరసి స్తూ శానససభ, శాసనమండలి నుంచి వాకౌట్ చేసిన అనంతరం టీడీపీ ఎమ్మెల్యేలు మీడియాతోమాట్లాడుతూ ఎన్నికలముందు గవర్నర్ ప్రసంగం ద్వారా ప్రజల్ని మరోసారి మోసగించేందుకు జగన్‌రెడ్డి ప్రయత్నించా డని ఆగ్రహం వ్యక్తంచేశారు.గవర్నర్ ప్రసంగానికి ధన్య వాదాలు తెలిపే సమయంతో ప్రజలకువాస్తవాలు చెప్పి, ప్రసంగంలోని తప్పుల్ని ఎత్తిచూపుతామని స్పష్టం చేశారు.
లోయకు, ఎవరెస్ట్ శిఖరానికి ఉన్నంత తేడా ఉంది: నిమ్మల రామానాయుడు
గవర్నర్ ప్రసంగం అంతా తప్పుల తడకే అని పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. పాదయాత్రలో ఎలాగైతే జగన్‌రెడ్డి అబద్ధాలు, అసత్యాలు చెప్పి అధికారంలోకి వచ్చాడో, అదే విధంగా నేడు ముఖ్య మంత్రిగా ఉండి గవర్నర్‌తో కూడా అలానే అబద్ధాలు చెప్పించాడు. అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరానికి, దాని దిగువన ఉండే లోయకు మధ్య ఎంతదూరం ఉంటుందో, అదే విధంగా వాస్తవాలకు, గవర్నర్ ప్రసంగానికి మధ్య తేడా ఉంది. నిస్సిగ్గుగా అసెంబ్లీ సాక్షిగా గవర్నర్‌తో ఈ ప్రభుత్వం అసత్యాలు పలికించిందని నిమ్మల విమర్శించారు.
ప్రజల్ని మోసగించే యత్నం
నాడు-నేడు పథకం గురించి గవర్నర్‌తో గొప్పగా చెప్పించారు. వాస్తవంలో మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రాథమిక పాఠశాలలు మూతపడి లక్షలాది మంది విద్యార్థులు విద్యకు దూరమయ్యారు. దళిత, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ప్రాథమిక విద్యను ప్రభుత్వం అందుబాటులో లేకుండా చేసింది. అమ్మఒడి గురించి కూడా అబద్ధాలు చెప్పారు. గవర్నర్ ప్రసంగంలో 43.61 లక్షల మంది తల్లులకు అమ్మఒడి కింద ఆర్థికసాయం అందిస్తున్నట్టు చెప్పారు. 83లక్షల మంది పిల్లలకు లబ్ధి కలుగుతోందని చెప్పించారు. 43.61 లక్షల మంది తల్లులకు అమ్మఒడి సాయం అందితే, పిల్లల సంఖ్య కూడా అంతే ఉండాలి కానీ, లబ్ధి పొందిన పిల్లల సంఖ్య 83లక్షలు ఎలా అవు తుందో చెప్పాలి. ఎన్నికల ముందు అమ్మఒడి కింద ఏటా ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అందరికీ రూ.15వేల చొప్పున ఇస్తానన్నాడు. తీరా అధికారం లోకి వచ్చాక ఇంటికి ఒక్కరికే అన్నాడు. రూ.15 వేలను చివరికి రూ.13వేలు చేశాడు. ఆ సొమ్ముకూడా అందరికీ సక్రమంగా ఇవ్వడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎన్నికల ముందు మరోసారి మోసగించడానికి ఏకంగా గవర్నర్నే ఈ ముఖ్యమంత్రి వినియోగించు కోవడం సిగ్గుచేటు.ఫీజు రీయింబర్స్‌మెంట్ అద్భుతంగా అమలు చేస్తున్నట్టు చెప్పారు. జగనన్న విద్యాదీవెన అని పేరుమార్చి, ఒకసారి కాకుండా నాలుగుసార్లు రీయిం బర్స్‌మెంట్ సొమ్ముఇస్తున్నారు. సంవత్సరంలో నాలుగు సార్లు ఇస్తూ, 4సార్లు పత్రికల్లో భారీ ప్రకటనలు ఇస్తూ, ప్రజలసొమ్ముతో ప్రచారం చేసుకుంటున్నారు. నాలుగో విడత ఫీజు రీయింబర్స్‌మెంట్ సొమ్ము ఎగ్గొట్టడంతో విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వబోలమని కళాశాల యాజ మాన్యాలు తెగేసి చెబుతున్నాయి. చదువులు మధ్యలో ఆగిపోయే పరిస్థితి రావడంతో విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో పడ్డారని నిమ్మల అన్నారు.
దళిత, బీసీ, మైనారిటీ విద్యార్థులకు రూపాయి ఇచ్చిందిలేదు
విదేశీ విద్య పథకాన్ని జగన్‌రెడ్డి నిర్వీర్యం చేశారు. అంబేద్కర్ విదేశీ విద్య అనే పేరుతీసేసి, జగనన్న విదేశీ విద్య అని ముఖ్యమంత్రి తనపేరు పెట్టుకున్నాడు. పేరు మార్చడంతో పాటు దళితులు, బీసీలు, మైనారిటీల విద్యార్థులకు పథకంకింద నిధులు ఇవ్వడం ఆపేశాడు. విదేశాలకు వెళ్లి చదువుకోకుండా వారి ఆశలపై నీళ్లు చల్లాడు. అలానే ఈ ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్,ఎస్టీ కార్పొరేషన్,మైనారిటీ కార్పొరేషన్ ఏవీ లేవు. చంద్రబాబు హయాంలో కాపులు, బ్రాహ్మ ణులు, వైశ్యులకు కూడా కార్పొరేషన్లు పెడితే, జగన్ ఒక్క కార్పొరేషన్ కూడా లేకుండా చేశాడు. ఉన్న కార్పొ రేషన్ల ద్వారా ఆయా వర్గాల్లో ఒక్కరికి కూడా రూపాయి అదనంగా ప్రభుత్వం ఇచ్చింది లేదు. కానీ గవర్నర్ ప్రసంగంలో నిధులు ఇస్తున్నట్టు చెప్పించారని నిమ్మల తప్పుబట్టారు.
కౌలురైతుల ప్రస్తావన లేదు
రైతుభరోసా కింద ఏటా ప్రతి రైతుకి రూ.13,500 లు ఇస్తున్నట్టు గవర్నర్‌తో చెప్పించారు. కేంద్రం ఇచ్చే సొమ్ముని ముఖ్యమంత్రి తన గొప్పగా చెప్పుకుంటున్నా డు. గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా కౌలు రైతుల ప్రస్తా వన లేదు. జగన్‌రెడ్డి రైతు వ్యతిరేక విధానాల వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశం లో రెండోస్థానంలో ఉంది. ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా గురించి ప్రసంగంలో చెప్పించారు. రైతుల తరుపున పంటల బీమా సొమ్ము కట్టడమనేదే ఈ ప్రభు త్వం మర్చిపోయింది. గతంలో చంద్రబాబు అసెంబ్లీలో కూర్చొని నిరసన తెలిపితే, అప్పుడు అర్థరాత్రి ఆ సంవ త్సరానికి బీమా సొమ్ము కట్టారు. తర్వాత నుంచీ మర లా మామూలే. కౌలు రైతుని మరిచిపోయిన ఈ ప్రభు త్వానికి రైతుల గురించి మాట్లాడే అర్హతలేదు. ఆంధ్రాని ఆక్వాహబ్‌గా మార్చామని చెప్పుకుంటుంటే నవ్వాలో జాలిపడాలో తెలియడం లేదు. జగన్ జే ట్యాక్స్ దెబ్బకు ఆంధ్రావ్యాప్తంగా ఆక్వా రైతులు క్రాప్ హాలిడే తీసుకు న్నారు. 61వేల మంది ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ ఇచ్చినట్టు గవర్నర్ ప్రసంగంలో చెప్పించారు. రాష్ట్రం లో 40 నుంచి 50లక్షల మంది ఆక్వా రైతులుంటే, వారిలో 60వేల మందికి ఇస్తే, ఆక్వారంగం మొత్తానికి ఇచ్చినట్టా? ఆక్వారంగానికి సంబంధించి విద్యుత్ సబ్సిడీ తీసేసింది కాక, గవర్నర్ ప్రసంగంలో అబద్ధాలు చెప్పిస్తారా అని నిమ్మల మండిపడ్డారు.
చంద్రబాబు కట్టించిన ఇళ్లు కూడా పేదలకు ఇవ్వలేదు
పేదలకు ఇళ్లు అంటూ ఎన్నికలకు ముందు కథలు చెప్పారు. అధికారంలోకి రాగానే సంవత్సరానికి 5 లక్షల చొప్పున 5 ఏళ్లలో పేదలకోసం 25లక్షల ఇళ్లు నిర్మిస్తానని జగన్‌రెడ్డే తన మేనిఫెస్టోలో చెప్పాడు. 5 ఏళ్లు పూర్తయ్యాయి. 25 లక్షల ఇళ్లు కట్టాల్సింది.. కనీ సం వేలల్లో కూడా కట్టలేదు. ఇళ్లు కట్టకపోతే కట్టక పోయాడు..చంద్రబాబుహయాంలో పేదలకోసం కట్టిం చిన ఎన్టీఆర్ టిడ్కో ఇళ్లు కూడా పేదలకు ఇవ్వకుండా కక్షసాధింపులకు పాల్పడ్డాడని నిమ్మల ధ్వజమెత్తారు.
విద్యుత్‌పై అన్నీ అబద్ధాలే
24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నా మని చెప్పుకోవడం పచ్చి అబద్ధం కాదా? 8సార్లు విద్యు త్ ఛార్జీలు పెంచి, కరెంట్ లేకుండా చేస్తున్నారని ప్రజ లు ఈ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. 24 గంటల పాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ ప్రజలకు అందిస్తున్నట్టు గవర్నర్‌తో చెప్పించారు. విద్యుత్ డిస్కం లను అప్పుల ఊబిలోకి నెట్టిన ఈ ముఖ్యమంత్రి, 8 సార్లు ప్రజలపై విద్యుత్ ఛార్జీలు పెంచాడు. నాణ్యమైన కరెంట్ కాదు… అసలు కరెంట్ ఎప్పుడు వస్తుంది.. ఎప్పుడు పోతుందో కూడా తెలియని పరిస్థితి. ఒకపక్క ప్రజలు విద్యుత్ కోతలు,పెంచిన ఛార్జీలపై ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తుంటే, గవర్నర్‌తో 24 గంటలపాటు నాణ్య మైన విద్యుత్‌ను తక్కువ ధరకు అందిస్తున్నట్టు అబద్ధా లు చెప్పిస్తారా అని నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు.
8వ వింత సృష్టించాడు
జగన్‌రెడ్డి రాష్ట్రంలో 8వ వింత సృష్టించాడు. గుంత లు లేకుండా 3వేల కిలోమీటర్ల రోడ్లు వేశామని గవ ర్నర్‌తో చెప్పించారు. మరీ ఇంత అబద్ధమా? జగన్‌రెడ్డి శ్రేయోభిలాషి అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఇటీ వలే ఏపీలో రోడ్లపై తిరిగి నడుములు పడిపోయాయని చెప్పారు. వాస్తవంలో పరిస్థితి దారుణంగా ఉంటే, గుం తలు లేని రోడ్లు వేశామని గవర్నర్‌తో చెప్పించండం సిగ్గుచేటు. ఇన్ని అబద్ధాలు, అసత్యాలు వినలేకనే గవ ర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించి బయటకు వచ్చేశాం. బీఏసీ సమావేశాన్ని కూడా మేం బహిష్కరించాం.బీఏసీ సమావేశంలో చెప్పేవి ఏవీ అసెంబ్లీలో అమలుకావడం లేదు. ప్రతిపక్ష సభ్యులకు మైక్ కూడా ఇవ్వనీయకుండా జగన్‌రెడ్డి శాసనసభను లోటస్‌పాండ్‌లా మార్చి,నియం త్రత్వ పాలన సాగిస్తున్నాడు.ఈరోజు ఉదయం 10 గం టలకు అసెంబ్లీప్రారంభం కావాలి..కానీ ముఖ్య మంత్రి రాకకోసం 15మిషాలు ఆలస్యంగా ప్రారంభించారు. శాసనసభ అంటే గౌరవంలేని ఇలాంటి ముఖ్యమంత్రిని దేశంలో ఎప్పుడూ చూడలేదు. రాష్ట్రాన్ని ఎలా గైతే నాశనం చేశాడో,అదేవిధంగా అసెంబ్లీనికూడా భ్రష్టు పట్టించాడని రామానాయడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజకీయ సన్యాసం తీసుకుంటా ` బెందాళం అశోక్
ఏపీ అసెంబ్లీకి సంబంధించి జరుగుతున్న ఆఖరి సమావేశాల్లో జగన్‌రెడ్డి తన మోసపూరిత చర్యలను, చేతగానితనాన్ని గవర్నర్ ప్రసంగం ద్వారా కప్పిపుచ్చే ప్రయత్నం చేశాడని ఇచ్ఛాపురం టీడీపీ ఎమ్మెల్యే బెందా ళం అశోక్ విమర్శించారు. గవర్నర్‌తో ముఖ్యమంత్రి సత్యదూరమైన అంశాలు చెప్పించాడు. మత్స్యకారుల్ని తానేదో ఉద్ధరించినట్టు గవర్నర్‌తో చెప్పించారు. మత్స్య కార భరోసా గతంలోకంటే ఎక్కువగా ఇప్పుడు రూ.10 వేలు ఇస్తున్నట్టు జగన్‌రెడ్డి చెప్పించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఒక మత్స్యకార కుటుం బంలో ఎంత మంది ఉంటే అందరికీ భరోసా కింద రూ.4వేలు (ఒక్కొక్కరికీ) అందించింది. జగన్‌రెడ్డి మాత్రం ఒక కుటుంబంలో ఒకరికే మత్స్యకార భరోసా సాయం అందిస్తున్నాడు. ఆ విషయం గవర్నర్ ప్రసం గంలో ఎక్కడాలేదు. దురదృష్టవశాత్తూ మత్స్య కారులు చనిపోతే, వారి కుటుంబానికి ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను రూ.10లక్షలకు పెంచినట్టు జగన్‌రెడ్డి చెప్పించారు. నా నియోజకవర్గం ఇచ్ఛాపురంలో ఎక్కువ మంది మత్స్యకా రులే. ఇన్నేళ్లలో జగన్‌రెడ్డి నా నియోజకవర్గంలో ఒక్క కుటుంబానికైనా రూ.10లక్షలు ఇచ్చినట్టు, ఒక్క క్లెయి మ్‌నయినా పరిష్కరించినట్టు నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. ఇలా అన్నీ అబద్ధాలే. అధికా రంలోకి వచ్చాక నాలుగేళ్లలో ఉత్తరాంధ్రలో కేవలం 2బహిరంగసభలు మాత్రమే పెట్టిన జగన్‌రెడ్డి, మొన్న నిర్వహించిన ప్రచారసభలో కూడా ఆ ప్రాంత సాగు నీటి ప్రాజెక్టులు గురించి మాట్లాడలేదు. వంశధారనది ని బాహుదా నదికి అనుసంధానిస్తూ చేపట్టిన ప్రాజెక్ట్ పూర్తయితే 2.50లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని జగన్మోహన్‌రెడ్డికి తెలియదా? గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రూ.600 కోట్లతో డీపీఆర్‌లు సిద్ధంచేసిన ప్రాజెక్టుల్ని కూడా జగన్ ఆపే యించి,ఉత్తరాంధ్ర రైతులకు తీరనిఅన్యాయం చేశాడు.
శాంతి భద్రతలపై కూడా గవర్నర్‌తో అబద్ధాలు చెప్పిం చారు. విశాఖపట్నంలో తహసీల్దార్‌ను చంపేస్తే ఈ ప్రభుత్వం ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సభలో గవర్నర్ మాట్లాడుతుంటే చప్పట్లు కొట్టడం, బల్లలు చరవడం కాదు చేయాల్సింది. ముఖ్యమంత్రి ప్రజల్లోకి వెళ్తే వారికష్టాలు,బాధలు ఏంటో తెలుస్తాయి. ప్రజల్ని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్న జగన్‌రెడ్డిని ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. గవర్నర్ ప్రసంగం ఆద్యంతం అసత్యాలతోనిండి ఉన్నందునే మేమంతా సభల్ని బహిష్కరించామని అశోక్ స్పష్టం చేశారు.
గవర్నర్ వ్యవస్థ అపహాస్యం: బీటీ నాయుడు
శాసనమండలి తరుపున టీడీపీ సభ్యులందరం సభ కు హాజరై గవర్నర్ ప్రసంగం విన్నాం.. గవర్నర్ వ్యవ స్థను ఈ ముఖ్యమంత్రి ఏవిధంగా దుర్వినియోగం చేశా డు.. ఎంతగా అపహాస్యం చేశాడనేందుకు నేటి గవ ర్నర్ ప్రసంగమే నిదర్శనమని ఎమ్మెల్సీ బీటీ నాయుడు అన్నారు.ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అన్నీ అబ ద్ధాలు చెబుతుంటే, ముఖ్యమంత్రేమో ఏదో సాధించిన ట్టు బల్లలు చరుస్తున్నాడు. ముఖ్యమంత్రి ఈ విధంగా ఒక కొత్త ట్రెండ్ సృష్టించాడు. బడ్జెట్ సమావేశాలు అంటే 5కోట్ల మంది రాష్ట్ర ప్రజలతో పాటు ప్రపంచం లోని తెలుగువారు కూడా ఆసక్తిగా గమనిస్తారు. కానీ జగన్మోహన్‌రెడ్డి గవర్నర్‌తో చెప్పించిన అబద్ధాలు విన్నా క అందరూ కిందపడి గిలగిల కొట్టుకునే పరిస్థితి వచ్చిందని బీటీ నాయుడు ఎద్దేవా చేశారు.
బరితెగించి అవాస్తవాలు
ఏ ప్రభుత్వమైనా విద్య, వైద్యరంగాలను ప్రోత్సహి స్తుంది. కానీ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రాథమిక విద్యను లేకుండా చేసింది. పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర విద్యార్థులే దేశంలో చాలా తక్కువ ప్రతిభ చూపా రు. ఎక్కువ మంది ఉత్తీర్ణులైతే తర్వాత ఫీజు రీయింబ ర్స్‌మెంట్, ఇతర సౌకర్యాలు ఇవ్వాల్సి వస్తుందనే జగన్ ఇలా చేశాడు. ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ అన్నాడు.
5వ జనవరి కూడా పోయింది.. జాబ్ క్యాలెండర్ ఊసే లేదు. రాష్ట్రానికి ఒక్కపరిశ్రమ తీసు కొచ్చి, ఒక్క ఉద్యోగం ఇచ్చింది లేదు. అభివృద్ధి కార్య క్రమాలు పూర్తిగా కుంటుపడ్డాయి. గవర్నర్‌తో ముఖ్య మంత్రి 127పాయింట్లను 134పేజీల పుస్తకాన్ని ప్రజల కోసం చదివించే ప్రయత్నం చేశారు. శాసనసభ సాక్షి గా వ్యవస్థల్ని దుర్వినియోగం చేసింది కాక, బరితెగించి అవాస్తవాలు చెప్పడంతో తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్షం సమావేశాల్ని వాకౌట్ చేసింది. తర్వాతి రోజుల్లో సభ ద్వారా వాస్తవాల్ని ప్రజలముందు ఉంచే ప్రయత్నం చేస్తామని బీటీ నాయుడు తెలిపారు.
జగన్‌రెడ్డి నవ్వుల పాలయ్యారు: భూమిరెడ్డి రామ్‌గోపాల్‌రెడ్డి
ప్రభుత్వంలో లేని గొప్పల్ని ఉన్నట్టుగా గవర్నర్‌తో అర్ధసత్యాలు, అసత్యాలు పలికించే ప్రయత్నంచేసి జగన్‌రెడ్డి నవ్వుల పాలయ్యారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్‌గోపాల్‌రెడ్డి విమర్శించారు. విద్యా వ్యవస్థను పటిష్టపరిచినట్టు, నాడు-నేడు ద్వారా పాఠశాలల్ని ఆధునికీకరించినట్టు గవర్నర్‌తో చెప్పించారు. తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో నాడు-నేడు పథకం కింద ఎన్ని పాఠశాలలు కొత్తగా ఏర్పాటు చేశారో, ఎన్ని పాఠశాలలకు ఫర్నీచర్, ఇతర సామాగ్రి అందించారో ముఖ్యమంత్రి చెప్పాలి. ఇడుపుల పాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు తమకు ఫీజు రీయింబర్స్ మెంట్ సొమ్ము అందలేదని, 4 విడతలకు గాను 3 విడతల సొమ్ము ఇచ్చి, ఒక విడత ఎగ్గొట్టారని నిరసన చేపట్టారు. పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఎగ్గొట్టిన ఘనుడు జగన్ రెడ్డే. నాడు-నేడు, అమ్మఒడి పథకాలతో అద్భుత ఫలితాలు సాధిస్తున్నట్టు చెప్పుకోవ డం సిగ్గుచేటు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల నుంచి 7.50లక్షల మంది విద్యార్థులు విద్యకు దూరమయ్యా రని రామ్‌గోపాల్ రెడ్డి తెలిపారు.
సొంత జిల్లా రైతాంగాన్నే ఎక్కువగా నష్టపరిచాడు
వ్యవసాయానికి సంబంధించి కూడా ఉద్యాన పంట ల సాగువిస్తీర్ణం పెరిగిందని చెప్పారు.2019కి ముందు రాష్ట్రంలో డ్రిప్, స్ప్రింక్లర్ పద్ధతులు పాటించి సాగుచేసే రైతులకు 90శాతం సబ్సిడీపై పరికరాలు అందేవి. ఇప్పుడు అలా అందుతున్నాయని ముఖ్యమంత్రి చెప్పగ లడా?పండ్లతోటల పెంపకం దారులకు గతంలో టీడీపీ ప్రభుత్వం సబ్సిడీపై మొక్కలు అందించింది. జగన్‌రెడ్డి ఒక్క సంవత్సరమైనా రాయితీపై పండ్లమొక్కలు అందిం చాడా? కరువు మండలాలు ప్రకటిస్తే తనకు అవమా నమని భావించిన జగన్‌రెడ్డి సొంత జిల్లా కడపలోని రైతుల్ని దారుణంగా వంచించాడు.ప్రధానమంత్రి ఫసల్ బీమాయోజన పథకం నుంచి వైదొలిగిన ప్రభుత్వ నిర్వా కంతో రాయలసీమ రైతులే ఎక్కువగా నష్టపోయారు. గత 20ఏళ్లలో అత్యల్ప వర్షపాతం ఈఏడాది రాయల సీమలో నమోదైనా రైతులకు జగన్ ప్రభుత్వం ఎలాంటి సాయం అందించలేదు.2019తర్వాత జగన్ ప్రభుత్వం ఒక్క ఎకరాకైనా అదనంగా నీరిచ్చిందా? పులివెందుల నియోజకవర్గంలో ఒక్క కాలువనైనా, ఒక్క కిలో మీటర్ అయినా పొడిగించాడా?జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ అని యువతను, సీపీఎస్ రద్దు అని ఉద్యోగుల్ని వంచిం చాడు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే సమ యంలో ఆయనతో చెప్పించిన అబద్ధాలను ఎత్తిచూపే ప్రయత్నం చేసామని రామ్‌గోపాల్‌రెడ్డి చెప్పారు.
మద్య నిషేధం హామీ ఏమైందో ముఖ్యమంత్రి చెప్పాలి: కంచర్ల శ్రీకాంత్
అసత్యాలను పుస్తకరూపంలో ముద్రించి మరీ జగన్‌రెడ్డి, గవర్నర్‌తో చదివించే ప్రయత్నం చేయడం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ విమర్శిం చారు. 99శాతం హామీలు నెరవేర్చామని చెప్పుకుంటున్న జగన్‌రెడ్డి, మద్యనిషేధంపై ఏం చెబుతారు? ముఖ్యమంత్రిగా ఉన్న 5ఏళ్లలో దశలవారీగా మద్యా న్ని నిషేధిస్తానని చెప్పిన జగన్మోహన్‌రెడ్డి, రాబోయే 25ఏళ్లలో మద్యం అమ్మకాలపై ఆదాయాన్ని తాకట్టుపెట్టి రూ.25వేల కోట్ల అప్పులు తెచ్చాడు. విషం కంటే దారుణమైన జే బ్రాండ్‌ల మద్యం అమ్మిస్తూ ఎన్నో కుటుంబాలకు పెద్దదిక్కు లేకుండా చేశాడు. నాడు-నేడు, అమ్మఒడి పేరుతో గవర్నర్‌తో చెప్పించినవన్నీ అబద్ధాలే. జీవో నెం-117 తీసుకొచ్చి, పాఠశాలల్ని విలీనం చేసి, నాడు-నేడు కింద అభివృద్ధి చేసి నట్టు చెప్పుకుంటున్నపాఠశాలల్ని కూడా నిరుపయోగంగామార్చారు.ఎంత మంది విద్యార్థులు ప్రాథమిక విద్యకు దూరమ య్యారో ముఖ్య మంత్రికి తెలియదా? అమ్మఒడి పథకంలో 83లక్షల మంది విద్యార్థులు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పాలని శ్రీకాంత్ డిమాండ్ చేశారు.
ఒక్క ఎకరాకు కూడా నీరివ్వలేదు
కుప్పం నియోజకవర్గానికి హంద్రీ నీవా ద్వారా నీళ్లు ఇవ్వడానికి చంద్ర బాబు హయాంలో 87శాతం పూర్తైన పనుల్ని, తన ఐదేళ్ల పాలనలో జగన్‌రెడ్డి ఎందుకు పూర్తిచేయలేకపోయాడు? రైతు లకు మేలు చేశానని చెప్పుకునే ముఖ్య మంత్రి కుప్పం నియోజకవర్గ రైతులకు ఎందుకు నీరు ఇవ్వలేక పోయారు? కాలువల నిర్మాణం పేరుతో కమీషన్లు కొట్టేసి, చంద్రబాబు తన నియోజకవర్గానికి వస్తు న్నాడని తెలిసి, అప్పటికప్పుడు హడావుడిగా అనం తపురం వెళ్లాల్సిన నీటిని కుప్పానికి తరలించే ప్రయత్నం చేసి విఫలమైంది నిజం కాదా? రైతులు, మహిళలు, విద్యార్థులు, యువత, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాలకు అన్యాయం చేసి, ఎన్నాళ్లు అబద్ధాలు చెప్పి మోసగించే ప్రయత్నం చేస్తారని శ్రీకాంత్ నిలదీశారు.
తరలిపోయిన 18 పరిశ్రమలు
నిరుద్యోగులకు ప్రభుత్వపరంగా ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇవ్వకుండా, చివరకు టీడీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు, పరిశ్రమలు కూడా తరలిపోయేట్టు చేశారు. ఎస్‌టీపీఏ (సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండి యా) ఇచ్చిన సమాచారం ప్రకారం ఒక్క విశాఖపట్నం నుంచే 18 కంపెనీ లు జగన్‌రెడ్డి హయాంలో రాష్ట్రం నుంచి తరలిపోయాయి. టీసీఎల్, ఫాక్స్ కాన్, కియా అనుబంధ పరిశ్రమలు, రిలయన్స్ వంటి సంస్థలు ఈ ప్రభుత్వ తీరుతో విసిగిపోయి రాష్ట్రం నుంచి వెళ్లిపోయింది నిజం కాదా? జీతాలు పెంచకుండా అంగన్ వాడీ సిబ్బందిని వేధిస్తున్నారు. సిద్ధం.. సిద్ధం అంటూ ముఖ్యమంత్రి ప్రజల సొమ్ముతో భారీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేశాడు. ఎన్నికల తర్వాత తాను రాష్ట్రం నుంచి వెళ్లిపోవడానికి సిద్ధం అని జగన్‌రెడ్డే చెప్పుకుంటున్నాడని శ్రీకాంత్ ఎద్దేవా చేశారు.