- అధికారం పోయినా ఫేక్ ప్రచారాన్నే నమ్ముకున్న జగన్‌రెడ్డి
- కౌలు రైతుల ముసుగులో దోపిడీకి స్కెచ్ అంటూ సాక్షిలో తప్పుడు కథనాలు
- బడుగువర్గాల కౌలురైతులకు మేలు జరగటం జగన్‌రెడ్డికి ఇష్టం లేదా
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలపై ఎందుకంత ద్వేషం
అధికారంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డి ప్రసంగం మొదలు పెడితే చాలు తమది రైతు సంక్షేమ ప్రభుత్వమంటూ అబద్ధాలను వల్లె వేసేవాడు. ఇప్పుడు అధికారం పోయినా అబద్ధాలతో తన బ్లూ మీడియాలో తప్పుడు కథనాలను వండివారుస్తూ, ఫేక్ ప్రచారంలో తనకు తానే సాటి అని నిరూపించుకుంటున్నాడు. అందులో భాగంగానే మంగళవారం (27.08.2024) సాక్షి దినపత్రికలో కౌలు రైతుల ముసుగులో దోపిడీకి స్కెచ్ అనే శీర్షికతో తప్పుడు వార్తను ప్రచురించారు. కౌలు రైతుల ముసుగులో టీడీపీ నేతలు లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారనేది ఆ కథనం సారాంశం. వాస్తవానికి నిజమైన కౌలు రైతులకు మేలు జరిగిందంటే అది టీడీపీ హయాంలోనే.
రాష్ట్రంలో 2017-18 లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అగ్రికల్చర్ వెబ్‌సైట్‌లో 15.26 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. కానీ గత వైసీపీ ప్రభుత్వం కేవలం 5.22 లక్షల మంది కౌలు రైతులుగా గుర్తించి వారికి సీసీఆర్సీ (పంట హక్కు సాగుదారుల పత్రం) పత్రాలు అందచేసింది. ఆర్‌బీకేలకు వెళ్తే..అక్కడ సీసీఆర్సీ కార్డు ఇస్తారన్న జగన్ హామీ నీటి మీద రాతే అయింది. దీని కారణంగా 10లక్షల మంది కౌలు రైతులు నష్టపోయారు. ఈ లెక్కన గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో కౌలు రైతులకు రూ.9,639 కోట్లు ఎగ్గొట్టింది. కౌలు రైతు ఆత్మహత్యల్లో వైసీపీ పాలనలో దేశంలోనే రాష్ట్రం 3 స్థానంలో ఉంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో 2019లో 1918 మంది రైతులు, 2020 లో 889 మంది రైతులు ఆత్మహత్య చేసుకుని మరణించారు. ఇది అధికారిక లెక్కలు మాత్రమే. కానీ దాదాపు 4500 పై చిలుకు ఆత్మహత్య చేసుకుని చనిపోయారని అంచనా. ఆత్మహత్య చేసుకున్న రైతులకు, కౌలు రైతులకు రూ.7 లక్షలు నష్ట పరిహారం ఇస్తున్నట్లు గొప్పలు చెప్పుకున్న జగన్ రెడ్డి తన హయాంలో ఎంత మందికి పరిహారం ఇచ్చారో లెక్కలు తీస్తే ఆయన బండారం బయటపడుతుంది.
టీడీపీ హయాంలో కౌలు రైతులకు మేలు
2014-19 మధ్య టీపీపీ హయాంలో 58 లక్షల మంది రైతులకు రూ 15,279 కోట్ల మేర రుణమాఫీ చేసిన ఘనత చంద్రబాబుకు దక్కింది. కౌలు రైతుల కోసం టీడీపీ ప్రభుత్వం 2016లో కౌలు రైతు చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం.. కౌలు రైతులకు సీసీఆర్సీ (పంటహక్కు సాగుదారు పత్రం) కార్డు ఇస్తారు. సీసీఆర్సీ కార్డ్ ఉన్న రైతులకు రైతు భరోసా, ఇన్‌పుట్ సబ్సిడీ లాంటివి అన్నీ అందుతాయి. ఈ చట్టం ద్వారా 2019 వరకు కౌలు రైతులు తమ దగ్గర ఉన్న అర్హత పత్రాలతో నేరుగానే నష్ట పరిహారం, రుణం పొందేవారు.
నీరుగార్చిన జగన్‌రెడ్డి
కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో ఆ చట్టాన్ని నీరుగార్చారు. టీడీపీ హయాంలో ఉన్న కౌలు రైతు చట్టాన్ని రద్దు చేస్తూ 2019 సెప్టెంబర్ 23 న జీఓ 410 పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం ఎవరైతే కౌలు రైతులు ఉంటారో వారంతా భూమి యజమానుల నుంచి కౌలు ఒప్పంద పత్రాలు పొందాలి. అలాంటి వారికే రుణ అర్హత అంటూ వైసీపీ ప్రభుత్వం నిర్దేశించింది. ఈ సవరణతో కౌలు రైతుల రూపే మారింది. భూమి యజమానులు కౌలు ఒప్పంద ప్రతాలను జారీ చేయకపోవడం వల్ల లక్షల మంది కౌలు రైతులు నష్టపోయారు. దీని వల్ల విపత్తు సమయాల్లో పంట నష్టపరిహారం భూమి యజమానుల ఖాతాల్లోనే జమయ్యింది. ఆఖరుకి ధాన్యం కొనుగోళ్లు, విత్తనాల సబ్సిడీ విషయంలోనూ కౌలు రైతులకు అన్యాయమే జరిగింది.
కౌలు రైతులపై అంత పగ ఎందుకు?
ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గత ఎన్నికల హామీ ప్రకారం 2016లో టీడీపీ ప్రభుత్వం కౌలు రైతుల కోసం తెచ్చిన చట్టాన్ని అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ చట్టం ద్వారా పంట రుణాల విషయంలో పెత్తందారుల (భూయాజమాని)కు కాకుండా నిజమైన కౌలు రైతులకు న్యాయం జరుగుతుంది. భూమి యజమానుల నుంచి కౌలు ఒప్పంద పత్రాలు పొందాల్సిన అవసరం లేదు. దీని ద్వారా రాష్ట్రంలో ప్రతి కౌలు రైతుకు న్యాయం జరుగుతుంది. వాస్తవంగా సాగు చేసే రైతుకు అధిక ప్రాధాన్యత దక్కుతోంది. అందులో భాగంగా కూటమి ప్రభుత్వం వచ్చిన రెండు నెలల్లోనే 8.50 లక్షల కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు మంజూరు చేశారు.
రాష్ట్రంలో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారే కౌలు రైతులుగా ఉన్నారు. టీడీపీ ప్రభుత్వంలో పెట్టుబడి సాయం కింద రూ.20వేలు ఆ వర్గాల రైతులకు అందడం జగన్ రెడ్డికి ఇష్టం లేదా? పంట రుణాలు, విపత్తుల సమయంలో పరిహారం భూ యజమానులకు కాకుండా బలహీన వర్గాలకు చెందిన కౌలు రైతులకు అందడం జగన్‌రెడ్డి సహించలేక పోతున్నారా? అందుకే తన సొంత మీడియాలో కౌలు రైతులపై ఫేక్ కథనాలు ప్రచారం చేస్తున్నారా? బడుగువర్గాల కౌలు రైతులపై అంత ద్వేషం, పగ ఎందుకు? దీనికి జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి.
ఎం.ఎలీషా, అనలిస్ట్