- జిందాల్ సారథ్యంలో వరద ప్రాంతాల పరిశీలన
- భారీ వర్షాలు, వరద నష్టాలపై అంచనాలు
- ఏపీ విపత్తు నిర్వహణ సంస్థలో విస్తృత సమీక్ష
- ఫ్లడ్ ఆపరేషన్ సెంటర్‌ను పరిశీలించిన బృందం
- ప్రకాశం బ్యారేజీ దెబ్బతిన్న గేట్లు పరిశీలన
- బుడమేరు గండ్లను పూడ్చే పనులు చూసిన బృందం
- ముంపు ప్రాంతాల్లో ట్రాక్టర్‌పై ప్రయాణించిన సభ్యులు
- వర్షాలు, వరద నష్టాలపై నేరుగా కేంద్రానికే నివేదిక
- రాష్ట్రానికి రానున్న ఆర్మీ ఇంజినీరింగ్ టాస్క్ ఫోర్స్
అమరావతి (చైతన్య రథం): కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం గురువారం ఏపీలో పర్యటించింది. భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులను, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను పరిశీలించింది. వరద ముంపు ప్రాంతాల్లో స్వయంగా పర్యటించి జరిగిన నష్టాన్ని అంచనా వేసింది. దీనికి సంబంధించిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి వీలైనంత త్వరగా అందించి రాష్ట్రానికి తక్షణ సాయం అందించేలా చర్యలు తీసుకోనుంది.
ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో సమీక్ష
ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయంలో అధికారులతో కేంద్ర బృందం సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన పరిస్థితులను, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సహాయ పునరావాస చర్యలను రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, జలవనరుల శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ (ఈఎన్‌సీ) వెంకటేశ్వరరావు వివరించారు. అనంతరం.. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్‌ను కేంద్ర బృందం పరిశీలించింది.
ప్రకాశం బ్యారేజీ- దెబ్బతిన్న గేట్ల పరిశీలన
అనంతరం.. ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్లను కేంద్ర బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా.. బ్యారేజీ ప్రవాహం, ఇతర వివరాలను కేంద్ర బృందానికి రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు వారికి వివరించారు.
బుడమేరు గండ్లను పూడ్చే పనుల పరిశీలన
ఆ తర్వాత.. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి శాంతినగర్ – కవులూరు వద్ద బుడమేరుకు పడిన గండ్లను, గండ్లను పూడ్చే పనులను కేంద్ర బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన చర్యలను అధికారులు కేంద్ర బృందానికి వివరించారు.
వరద ముంపు ప్రాంతాల్లో ట్రాక్టర్‌పై పర్యటన
భారీ వర్షాలు, వరదల ధాటికి నీట మునిగిన రామవరప్పాడు రింగ్ రోడ్డుతోపాటు కండ్రిక, పైపుల రోడ్డు, విశాలాంధ్ర కాలనీ, రాధా నగర్, పాత రాజీవ్‌నగర్, కట్టరోడ్, సుందరయ్య నగర్, వడ్డెర కాలనీ, అంబాపురం 16వ లైన్, అజిత్ సింగ్‌నగర్, ప్రకాష్ నగర్, ఎల్‌బిఎస్ నగర్, న్యూ అజిత్ సింగ్‌నగర్, పాయకపురం చేపల మార్కెట్ తదితర ప్రాంతాల్లో ట్రాక్టర్‌పై కేంద్ర బృందం ప్రయాణించింది. వరద ధాటికి నీట మునిగిన కాలనీలు, ప్రస్తుత పరిస్థితులు, ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను స్వయంగా పరిశీలించింది.
వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్న రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ ఆర్‌పి సిసోడియా కేంద్ర బృందంవెంట ట్రాక్టర్‌పై ప్రయాణించి వారికి ముంపు ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితులు, ప్రభుత్వ సహాయక చర్యలను స్వయంగా వివరించారు.
ఈ సందర్భంగా.. ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందికి 10వ బెటాలియన్ కమాండెంట్ వివిఎన్ ప్రసన్న సహాయక చర్యల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందికి పలు సలహాలు, సూచనలు అందించారు. కార్యక్రమంలో జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) సలహాదారు (ఆపరేషన్స్ అండ్ కమ్యూనికేషన్) కల్నల్ కెపి సింగ్, కేంద్ర జల సంఘం డైరెక్టర్ (సీడబ్ల్యూసీ) స్రిద్ధార్థ్ మిత్రా, కేంద్ర జల సంఘం ఎస్‌ఈ (సీడబ్ల్యూసీ-కృష్ణా సర్కిల్) యం రమేశ్‌కుమార్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) డైరెక్టర్ ఆర్ గిరిధర్, ఎన్డీఆర్‌ఎఫ్ 10వ బెటాలియన్ కమాండెంట్ వివియన్ ప్రసన్న, ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.కూర్మనాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.