వ్యూహాత్మకంగానే కన్నాను ఎంపిక చేసిన చంద్రబాబు
రాష్ట్రవ్యాప్తంగా బలమైన సంకేతమిచ్చిన టిడిపి
హర్షం వ్యక్తం చేస్తున్న టిడిపి శ్రేణులు
ఉమ్మడి గుంటూరు జిల్లాపై ప్రభావం
…..
తెలుగుదేశం పార్టీ సత్తెనపల్లి అసెంబ్లి నియోజకవర్గ ఇంచార్జ్ గా సీనియర్ నాయకుడు, మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపుఅచ్చెన్నాయుడు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు ప్రాతినిద్యం వహిస్తున్న సత్తెనపల్లి అసెంబ్లి సెగ్మెంట్ కు కన్నా లక్ష్మీనారాయణను టిడిపి ఇంచార్జ్ గా నియమించటంప్రాధాన్యత సంతరించుకున్నది.
ఈ స్థానం కోసం పార్టీకి చెందిన పలువురు నాయకులు పోటీ పడినప్పటికి అన్నికోణాలలో పరిశీలించి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, సత్తెనపల్లి ఇంచార్జ్ గా కన్నాను నియమించారు. రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు మంత్రిగా పనిచేయటమే గాక, ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిన కన్నాను సత్తెనపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ గా నియమించటం పట్ల టిడిపి శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కన్నా నియామక వార్త తెలియగానే నియోజకవర్గ వ్యాప్తంగా టిడిపి శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. పలువురు నాయకులు కన్నాను స్వయంగా కలిసి అభినందించారు. గతంలో ఇదే నియోజకవర్గానికి దివంగత నాయకుడు డాక్టర్ కోడెల శివప్రసాదరావు ప్రాతినిద్యం వహించారు.
తాజాగా కన్నాకు నియోజకవర్గంలో ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించటంతో పార్టీ కేడర్ లో జోష్ పెరిగింది. టిడిపి పార్టీ పైన, అధినేత చంద్రబాబు, లోకేష్ లపై వ్యక్తిగతంగా విమర్శలు, ఆరోపణలు గుప్పించే అంబటి రాంబాబుకు కన్నా వంటి నాయకుడు సమర్ధంగా చెక్ పెట్టగలరని భావిస్తున్నారు. సత్తెనపల్లి కి బాధ్యతలు కన్నాకు అప్పగించటం చంద్రబాబు వ్యూహంలో భాగమని చెప్పవచ్చు. సత్తెనపల్లి నియోజకవర్గానికి కన్నాను నియమించటం ద్వారా పార్టీ కేడర్ తో పాటు ప్రత్యర్ధి పార్టీలకు సైతం చంద్రబాబు బలమైన సంకేతాలు పంపినట్టయింది. కన్నా నియామకంతో మంత్రి అంబటిని అష్టదిగ్బంధనం చేసినట్టయింది.