ప్రభుత్వానికి దమ్ముంటే భూసేకరణపై సీబీఐ విచారణ జరిపించాలని మాజీమంత్రి, టిడిపి నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. గుంటూరులో మంగళవారం విలేకరుల సమావేశంలో కన్నా మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పేదల ఇళ్ళ కోసం జరిపిన భూసేకరణ లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కన్నా ఆరోపించారు. ప్రజలను భయపెట్టి ఇళ్లకు స్టికర్ లు అంటిస్తున్నారన్నారు. ఏం సాధించారని స్టికర్ లు అంటిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం తెచ్చిన అప్పులో కేవలం రూ. 2లక్షల కోట్లు సంక్షేమానికి ఖర్చుపెట్టి, మిగిలినదంతా వైసీపీ నాయకులు భోంచేసారని ఆరోపించారు. చంద్రబాబు పాలనలో మిగులు విద్యుత్ ఉండేదన్నారు.
ప్రస్తుతం 5 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి సామాన్యులపై పెనుభారం మోపారని విమర్శించారు. నాలుగు సంవత్సరాల జగన్ పాలన రాష్ట్రానికి శాపమని ఆయన పేర్కొన్నారు. జగన్ పాలన చేయకుండా వ్యాపారం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. అసమర్ధులు అయిన వ్యక్తులను ఇరిగేషన్ శాఖ మంత్రులుగా చేశారని ఆయన విమర్శించారు. నకిలీ విత్తనాలు అమ్మిన వ్యక్తులను ప్రశ్నిస్తే రైతులపై నే కేసులు పెడుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ ను గంజాయికి చిరునామాగా మార్చి రాష్ట్రం పరువుతీస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక, మద్యం, ఎర్రచందనం వంటి వాటి అక్రమరవాణా ను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారన్నారు.