తెలుగుదేశం పార్టీ అధినేత. నారా చంద్రబాబు నాయుడు పై యర్రగొండపాలెం లో దాడికి పాల్పడటం హేయమైన చర్య అని టిడిపి సీనియర్ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన పేర్కొన్నారు. ఆ సంఘటనపై ప్రసూన తీవ్రంగా స్పందించారు. భావితరాల భవిష్యత్ కు భరోసాగా వున్న చంద్రబాబు కోసం ప్రాణాలైనా అర్పించేందుకు తామంతా సిద్ధంగా వున్నామని ఆమె తెలిపారు.
చంద్రబాబు కు ప్రజలలో వస్తున్న స్పందన చూసి ఓర్వలేక ఈ విధమైన దుశ్చర్యలకు పాల్పడుతున్నారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి విద్యా శాఖామంత్రిగా పని చేసిన వ్యక్తి ఒక వీధి రౌడీ లాగా ప్రవర్తించటం దేనికి సంకేతం అని ఆమె ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజకీయాలు దిగజారిపోయారని ఆమె విమర్శించారు. ప్రశ్నించే వారి పై దాడులు, దళితులు, మహిళలపై దౌర్జన్యాలు స్వస్తి చెప్పక పోతే అందుకు తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని ఆమె హెచ్చరించారు.
ఒకవైపు చంద్రబాబు పర్యటనకు, మరోవైపు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటనలకు వస్తున్న ప్రజాస్పందన చూసి తట్టుకోలేక, వాటిని అడ్డుకునేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది అని ఆమె ఆరోపించారు. తెలంగాణ సమాజం మొత్తం ఈ దుశ్చర్యలను ఖండిస్తుందని చెప్పారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ రూపొందించిన ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చి స్వీయ రాజ్యాంగంలో ప్రజాకంటకంగా వ్యవహరించే వారికి రానున్న ఎన్నికలలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆమె హెచ్చరించారు.