- మంత్రి లోకేష్‌కు తుని ఆర్టీసీ డ్రైవర్ లోవరాజు కృతజ్ఞతలు
- దేవర సినిమా పాటకు డ్యాన్స్ వేయటంతో సస్పెన్షన్ వేటు
- మంత్రి లోకేష్ చొరవతో సస్పెన్షన్ రద్దు
- కుటుంబంతో సహా మంత్రి లోకేష్‌ని కలిసిన లోవరాజు
అమరావతి (చైతన్యరథం): తుని ఆర్టీసీ డిపో డ్రైవర్ లోవరాజు బుధవారం రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్‌ను కలిసి తన ఉద్యోగం నిలబెట్టినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. విధి నిర్వహణలో ఉండగా దేవర సినిమాలోని పాటకు స్టెప్పులు వేసి నాగరాజు సస్పెన్షన్‌కు గురి కాగా.. మంత్రి లోకష్ స్పందించి, ఆయన సస్పెన్షన్ రద్దు చేయించిన విషయం తెలిసిందే. తన సస్పెన్షన్ రద్దుచేయించి, తిరిగి విధుల్లోకి తీసుకునేలా చొరవ చూపించిన మంత్రి లోకేష్‌ను బుధవారం కుటుంబంతో సహా కలిసి లోవరాజు కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడ జిల్లా తుని ఆర్టీసీ డిపోలో లోవరాజు అవుట్ సోర్సింగ్ విధానంలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అక్టోబర్ 24న బస్సు రౌతులపూడి నుంచి తుని డిపోకు వెళ్తుండగా మార్గమధ్యలో కర్రల లోడ్ ట్రాక్టర్ అడ్డొచ్చింది. చిన్న రోడ్డు కావడం, బస్సు ముందుకు వెళ్లలేని పరిస్థితుల్లో బస్సును నిలిపివేశారు.
ఈ లోగా ప్రయాణికులకు వినోదం పంచడానికి సరదాగా కాసేపు దేవర సినిమాలోని పాటకు డ్యాన్స్ వేశాడు. ఇది కాస్తా ఓ యువకుడు వీడియో తీయడంతో వైరల్ అయింది. సోషల్ మీడియాలో డ్రైవర్ లోవరాజు డ్యాన్స్ చూసిన మంత్రి లోకేష్ మెచ్చుకున్నారు. ఈ లోగానే నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో లోవరాజును అధికారులు సస్పెండ్ చేశారు. ఈ విషయం మంత్రి లోకేష్ దృష్టికి రావడంతో సస్పెన్షన్ ఉత్తర్వులు రద్దు చేయిస్తానని హామీ ఇచ్చారు. అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా కలుస్తానని మాట ఇచ్చారు. దీంతో లోవరాజు కుటుంబంతో సహా వచ్చి మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా లోవరాజు యోగక్షేమాలను మంత్రి లోకేష్ అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాల అండగా ఉంటానని చెప్పారు.