- నీవు చొక్కాలు మడతపెడితే… ప్రజలు నీ కుర్చీనే మడత పెడతారు
- వైసీపీ పాలనలో రాష్ట్రం విధ్వంసం
- జగన్ రెడ్డి సైకో విధానమే అరాచకాలకు కారణం
- అమరావతి నిర్మించి ఉంటే రూ.2లక్షల కోట్ల ఆదాయం వచ్చి ఉండేది
- బానిసలుగా ఉంటారో… తిరగబడతారో ప్రజలే తేల్చుకోవాలి
- ‘విధ్వంసం’ పుస్తకావిష్కరణలో చంద్రబాబు
అమరావతి, చైతన్యరథం: రానున్న ఎన్నికల కోసం వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మతడపెట్టాల్సిన సమయం వచ్చిందని జగన్రెడ్డి అంటున్నారని, అదే జరిగితే టీడీపీ, జనసేన కార్యకర్తలు, ప్రజలు కుర్చీలు మడత పెడతారని, చివరికీ జగన్రెడ్డికి కుర్చీనే లేకుండా పోతుందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికలంటే ద్వంద్వ యుద్ధమని, అలా కాకుండా అక్రమాలకు పాల్పడాలని చూస్తే ఎవ్వరూ చేతులు కట్టుకొని లేరని.. ఖబడ్డార్ జగన్రెడ్డి అంటూ హెచ్చరించారు. మంచికి కూడా ఒక హద్దు ఉంటుందని, పిచ్చి పిచ్చి కూతలు కూస్తే ప్రజలే బుద్ది చెప్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్రెడ్డి ఐదేళ్ల పాలనలో చేసిన అరాచకాలు, విధ్వంసాలను వివరిస్తూ సీనియర్ జర్నలిస్టు ఆలపాటి సురేష్ కుమార్ రచించిన ‘విధ్వంసం’ పుస్తకాన్ని గురువారం విజయ వాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్లో చంద్రబాబు నాయుడు ఆవిష్కరించి మొదటి కాపీని జనసేన అధ్యక్షు డు పవన్ కళ్యాణ్కు అందజేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఎన్నడూ జరగనంత విధ్వంసం జరిగిందని, ఒక నియంత పాలనలో రాష్ట్ర భవిష్యత్తు విధ్వంసమయిం దని, ఒక సైకో పాలనలో భవిష్యత్ తరాల భవిష్యత్తు విధ్వంసమయిందని, రివర్స్ పానలో రాష్ట్రం ప్రభుత్వం విధ్వంసమైందని అన్నారు. సురేష్ రాసిన ‘విధ్వంసం’ పుస్తకం కేవలం పుస్తకం కాదని ఒక జర్నలిస్టు ధర్మా గ్రహమని అన్నారు. జగన్రెడ్డి పాలనలో తనతో సహా అందరూ బాధితులేనని, రేపు ఈ పుస్తకం రాసిన సురేష్ కూడా బాధితుడుగా మారతారని అన్నారు. భారత దేశ చరిత్రలో ఒక ప్రభుత్వ పాలన పైన ‘విధ్వంసం’ పేరుతో పుస్తకం రావడం ఇదే మొదటిసారి అని అన్నారు.
జగన్రెడ్డిది సైకో విధానం
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని రాష్ట్రంలోని ప్రజలందరూ సైకో అని పిలుస్తున్నారంటే అతని మానసిక స్థితి ఏంటో అందరికీ అర్ధమౌతుందన్నారు. సంపాదేనే ధ్యేయంగా అన్నింటినీ దోచేస్తూ అడొచ్చిన వారందర్నీ వేధించడమే పనిగా జగన్రెడ్డి వ్యవహరిస్తు న్నారని అన్నారు. అధికారంలోకి రావడంతోనే ప్రజా వేదికను కూల్చి ప్రతిరోజూ దాని శిధిలాలను చూసి తాను బాధపడాలని ఐదేళ్లుగా వాటిని అలాగే వదిలేసిన ముఖ్యమంత్రిని సైకో కాక మరేమనాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ పరిశ్రమలు రావాలని, మన పిల్లలకు ఉపాధి రావాలనే కోరుకుంటారని, అలాంటిది పారిశ్రామిక వేత్తలను వెంటాడి వెంటాడి వేధించి ఉన్న పరిశ్రమలను కూడా పారిపోయేట్లు చేశాడని చెప్పారు.
అన్న క్యాంటీన్లను ఎత్తివేశాడని, పేదవాడికి తిండిపెడితే కూడా సహించలేని వ్యక్తి జగన్రెడ్డి అని, దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలో కూడా తన బుర్రకు అసలు తట్ట డం లేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ సభకు స్థలమిచ్చారని కక్ష గట్టి ఇప్పటం గ్రామంలో ప్రజల ఇళ్లను కూల్చి వేయించిన సైకో.. జగన్రెడ్డి అని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పోస్టు పెట్టిం దని రంగనాయకమ్మ అనే మహిళను రాష్ట్రం విడిచివెళ్లి పోయేదాకా వేధించారని, అసలు రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేదని అన్నారు. చివరకు స్వంత చెల్లి, జన్మనిచ్చి న తల్లిపైన కూడా సోషల్ మీడియాలో కించపరిచే వ్యాఖ్యలు చేయిస్తున్నారని, తన దోపిడీకి అడ్డువచ్చే ఎవరినైనా వేధించే జగన్రెడ్డి సైకో విధానమే రాష్ట్రంలో అన్ని అరాచకాలకు కారణమని అన్నారు.
అమరావతి కట్టి ఉంటే రూ.2 లక్షల కోట్ల ఆదాయం వచ్చి ఉండేది
అమరావతి రైతులు త్యాగం చేసి 35 వేల ఎకరాలను రాజధాని నిర్మాణానికి ఇస్తే సైకో జగన్రెడ్డి దాన్ని మొత్తం విధ్వంసం చేశారని చంద్రబాబు అన్నారు. జగన్రెడ్డి అనే దుర్మార్గుడు అధికారంలోకి వస్తాడని తెలిసి ఉంటే అమరావతి రైతులు అసలు భూములు ఇచ్చేవారే కాదని అన్నారు. ఈ పదేళ్ల కాలంలో అమరావతి రాజధానిని కట్టి ఉంటే రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వచ్చి ఉండేదని తెలిపారు. అమరావతి రాజధానిని ధ్వంసం చేసి రాష్ట్ర ప్రజల ఆస్తిని విధ్వంసం చేశారని, రాజధాని కట్టి ఉంటే అందరికీ ఉపాధి అవకాశాలు వచ్చి ఉండేవని, జిఎసిటి, ఐటి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చేదని, ప్రజలకు కొనుగోలు శక్తి పెరిగి కొన్ని లక్షల కోట్ల రూపాయల సంపద సృష్టి జరిగేదని అన్నారు. అమరావతి రైతులు, ముఖ్యంగా మహిళలు వీరోచిత పోరాటం చేస్తున్నారని, వారికి వచ్చిన కష్టం శత్రువుకు కూడా రాకూడదని కోరుకుంటున్నానని అన్నారు. ఇన్నాళ్లూ మూడు రాజధానులంటూ నాటకలాడి, ఇప్పుడు మరలా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలని అంటున్నారని, చేసిన తప్పులకు సమర్ధించుకునే వీళ్లకు సిగ్గు, ఎగ్గు కూడా లేదని దుయ్యబట్టారు.
బానిసలుగా ఉంటారో… తిరగబడతారో తేల్చుకోండి
ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వానికి చెప్పుకుంటారని, అధికారులు మాట వినకపోతే సీఎంకు చెప్పుకుంటారని, అలాంటిది ప్రభుత్వమే సమస్య అయినప్పుడు ఏం చేస్తామని చంద్రబాబు ప్రశ్నించారు. పరిపాలించేవాడు చెడ్డవాడు, నియంత అయినప్పుడు ప్రజల్లో భయం వస్తుందని, భయం ప్రజలను బానిసలుగా మారుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
భయం ఉన్న చోట స్వేచ్ఛ ఉండదని, స్వేచ్ఛ లేని చోట అభివృద్ధి ఉండదని, అభివృద్ధి లేని చోట అసలు అలోచనే ఉండదని, ఇటువంటి పరిస్థితే ఉంటే ప్రజలకు ఏ హక్కులు లేకుండా బానిసలుగా బతకాల్సి వస్తుందని చెప్పారు. బానిసలుగా బతుకుతారో… తిరగబడతారో ప్రజలే తేల్చుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రజలందరూ కుల,మత, ప్రాంతాలకు అతీతంగాO జగన్రెడ్డి ఇంటికి నడుంబిగించాలని చంద్రబాబు కోరారు.
ప్రతి పాలకుడికి హెచ్చరిక ఈ పుస్తకం: పవన్ కళ్యాణ్
ప్రజల పక్షాన అలోచించి రాసిన పుస్తకం ఈ ‘విధ్వంసం’ పుస్తకమని పవన్ కళ్యాణ్ అన్నారు. పాలకులందరికీ ఈ పుస్తకం ఒక గీటురాయిలా ఉంటుందని, పాలన ఎలా చేయకూడదో ఈ పుస్తకం చదవడం ద్వారా ప్రతి నాయకుడూ నేర్చుకుంటాడని, పాలకులందరికీ ఈ పుస్తకం ఒక హెచ్చరిక అని అన్నారు. ప్రజావేదిక కూల్చివేతతో ఈ ప్రభుత్వం పని ప్రారంభమయిందని, కూల్చివేతలతో మొదలైన ఈ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమన్నారు. రానున్న ఎన్నికల్లో సీఎం జగన్రెడ్డికి గట్టి గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదని తాను చెప్తున్న దానికి ఈ పుస్తకం అద్దం పడుతోందని అన్నారు.
పదే పదే జగన్ క్లాస్ వార్ గురించి చెబుతుంటాడని, రాష్ట్రంలోని ఇసుక మొత్తాన్ని దోచుకోమని ఒక కంపెనీకి కట్టబెట్టిన జగన్రెడ్డి క్లాస్ వార్ గురించి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వాలంటీర్ల వ్యవస్థకు తాను వ్యతిరేకం కాదని, వారి భవిష్యత్తుకు తాము భరోసా ఇస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి విశాలాంధ్ర పత్రిక సంపాదకులు ఆర్వీ రామారావు అధ్యక్షత వహించగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షులు ఏ.శివారెడ్డి, అమరావతి బహుజన జెఏసీ అధ్యక్షులు పోతుల బాల కోటయ్య, సీనియర్ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు కూడా ప్రసంగించారు.