.పోలవరంపై చేతులెత్తేసిన అసమర్థుడు జగన్‌రెడ్డి
.45.72 మీటర్లకు పరిహారం ఇచ్చి తీరాల్సిందే
.జగన్‌రెడ్డి మెడలు వంచైనా పరిహారం ఇప్పిస్తా!
.పేటిఎం బ్యాచ్‌తో చప్పట్లు కొట్టించుకోవడం కాదు…
.త్యాగాలకు గుర్తుగా ముంపు మండలాలతో ప్రత్యేకజిల్లా
.41.15 మీటర్లకే పరిహారమంటూ కొత్త నాటకం
.త్యాగాలు చేసిన వారికి మొండతి చేయి చూపిస్తారా?
.4 ఉల్లిపాయలు, 4టమోటాలిచ్చి దులిపేసుకుంటారా?
.22 మంది రాజీనామా చేస్తే పరిహారం ఎలారాదో చూస్తా
.విలీన గ్రామాల్లో చంద్రబాబునాయుడు సింహగర్జన
భద్రాచలం : పోలవరం నిర్మాణం విషయంలో చేతులెత్తేసిన అసమర్థ సిఎం జగన్ రెడ్డి 41.15 మీటర్లకే పరిహారమంటూ చేతగాని మాట్లాడుతున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. పోలవరం ముంపు గ్రామాల్లో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన చంద్రబాబుకు దారిపొడవునా జనం నీరాజనాలు పలికారు. ఏలూరు జిల్లా వేలేరుపాడు, కుక్కునూరు, బూర్గుంపహాడ్ మండలాల్లో గోదావరి వరదకు దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి వరదబాధితులకు అమరావతి రైతులు, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరపున సహయం అందించారు. ఈ సందర్భంగా వరద బాధితులను ఉద్దేశించి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ… దమ్ముంటే 22మంది వైసిపి ఎంపీలు రాజీనామా చేయండి… పునరావాస ప్యాకేజీ ఎందుకురాదో తాను చూస్తానని సవాల్ విసిరారు. జగన్ రెడ్డి మెడలు వంచైనా 45.72 మీటర్లవరకు ముంపునకు గురయ్యే బాధితులకు పరిహారం అందించేవరకు పోరాడతానని స్పష్టంచేశారు. అసమర్థ సిఎం అనాలోచిత చర్యల వల్ల అటు పోలవరం కట్టలేదు….ఇటు పరిహారం ఇవ్వలేదని దుయ్యబట్టారు. ముంపు గ్రామాల ఇళ్లలో మేజర్ గా ఉన్న వారందరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోడికత్తి కమలహాసన్ జగన్ రెడ్డి నాటకాలు కట్టిపెట్టి నిర్వాసితులందరికీ చిత్తశుద్ధితో పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి నిర్వాకం కారణంగా పోలవరం ముంపు మండలాల్లోని వారికి పిల్లనిచ్చేందుకు కూడా భయపడే దుస్థితి దాపురించిందని అన్నారు. నిర్వాసితులకు పునరావాసం చెల్లింపులో కాంటూర్ లెవల్ కుదించి కొత్త కుట్రకు జగన్ రెడ్డి తెరలేపారని అన్నారు.
పేటిఎం బ్యాచ్‌తో చప్పట్లు కాదు… ఒకసారి బాధితులకు వద్దకు రండి!
ముంపు ప్రాంతాల్లో ఇటీవల పర్యటనకు వచ్చిన జగన్ పేటిఎం బ్యాచ్ తో చప్పట్లు కొట్టించుకొని అంతా బాగుందని జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని, ఒకసారి వరద బాధితుల వద్దకు వస్తే వారి కష్టాలు తెలుస్తాయని అన్నారు. హుద్ హుద్ తుఫాన్ సమయంలో టీడీపీ ప్రభుత్వం నాడు పరిహారం పెంచుతూ ఇచ్చిన జీవో నంబర్ 9 ను ప్రస్తావిస్తూ తాజాగా వచ్చిన వరద బాధితులకు మెరుగైన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వరదలు ఉంటే సిఎం గాల్లో తిరుగుతున్నాడు. తనకు అవసరం ఉన్నప్పుడు పాదయాత్ర చేసిన జగన్….ఇప్పుడు ప్రజలను వరదకు వదిలేశాడని దుయ్యబట్టారు. నేను ముంపు గ్రామాల పర్యటనకు రాకపోయి ఉంటే నిన్న సిఎం జగన్ వచ్చేవాడు కాదని అన్నారు. ఎన్నికలకు ముందు బుగ్గలు నిమిరి ముద్దులు పెట్టిన జగన్… ఇప్పుడు మళ్లీ అదే డ్రామాకు తెరలేపాడని ఎద్దేవా చేశారు. 16 రోజులపాటు ప్రజలు వరద ముంపుతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ ప్రజలు తమ ఇళ్లలో నుంచి బయటకొచ్చే పరిస్థితి లేదని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన రెండు వేల రూపాయలు ఏ మూలకు సరిపోదని తెలిపారు. బుద్దున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఆపత్కాలంలో వెకిలినవ్వులు నవ్వుతారా అంటూ మండిపడ్డారు. పునరావాస కేంద్రంలో ప్రభుత్వం కనీసం మంచి భోజనం కూడా పెట్టలేదన్నారు.
హుద్ హుద్ సమయంలో
9రోజులు విశాఖలోనే ఉన్నా!
వరద కష్టాల్లో ప్రజలుంటే అంతకంటే సిఎంకు ముఖ్యమైన పని ఏమి ఉంటుందని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. హుద్ హుద్ వచ్చిన సమయంలో నేను సిఎంగా ఆ ప్రాంతంలో తొమ్మిదిరోజులు బస్సునే కార్యాలయంగా చేసుకొని ప్రజల కోసం పని చేశానని చెప్పారు. పోలవరం వల్ల నష్టపోయిన వారందరికీ న్యాయం చెయ్యాలన్నది తన ఆలోచన అని అన్నారు. తరతరాలుగా ఉన్న ఊళ్లు, ఇళ్లు పోలవరం కోసం త్యాగం చేసిన రైతాంగం త్యాగాలకు గుర్తుగా పోలవరం ముంపు మండలాలన్నింటినీ కలపి ప్రత్యేక జిల్లా చేస్తానని చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం కోసం భూములను త్యాగం చేసిన వారందరికీ ప్యాకేజ్ ఇవ్వాలన్నారు. జగన్ ప్రతి ఎకరానికి అదనంగా 5 లక్షలు ఇస్తానన్నాడు… 10 లక్షలు ఆర్ అండ్ ఆర్ పరిహారం ఇస్తానన్నాడు… ఆ మాటలు ఏమయ్యాయని నిలదీశారు. జగన్ సేవలను నోరుంటే పశువులు కూడా మెచ్చుకుంటాయని అంటున్నారు… వాటిని వదిలితే గడ్డి కూడా ఇవ్వనందుకు ఎదురెళ్లి కుమ్ముతాయని అన్నారు. హుద్ హుద్ తుఫాన్ సమయంలో తన ప్రభుత్వంలో మంచి పరిహారం అందించామని, జగన్‌కు చేతనైతే…ప్రజలకు ఇంకా మెరుగైన సహాయం అందజేయాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.
సిఎంకు మానవత్వం ఉందా?
వరద ప్రాంత గ్రామాల్లో ఇళ్ళన్నీ పూర్తిగా కూలిపోయాయి… ఇళ్లల్లోకి నీరొచ్చాయి… ముంపుప్రాంత ప్రజలంతా రోడ్డున పడ్డారు…గోదావరిలో మునిగిపోయే పరిస్థితికొచ్చారు…ముఖ్యమంత్రికి మానవత్వం ఉంటే వెంటనే ఇక్కడకు వచ్చి బాధితులను ఆదుకునేవారని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని 15 రోజులుగా మీరంతా ఎక్కడెక్కడో తలదాచుకున్నారు. కొంతమంది అడవుల్లోకి వెళ్లారు. కొంతమంది మెట్ట ప్రాంతానికి వెళ్లారు. కొంతమంది గుడారాలు వేసుకున్నారు. ఈ ముఖ్యమంత్రికి మానవత్వం ఉంటే అతను కూడా ఒక మనిషి మాదిరిగా ఆలోచిస్తే ఇక్కడే ముఖ్యమంత్రి కాపురం ఉండి మీరందరూ కూడా స్థిరపడిన తరువాత తిరిగి తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లాల్సిందని చంద్రబాబునాయడు అన్నారు.