హైదరాబాద్: బీజేపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కమలం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు అధికారికం గా ప్రకటించారు. రాజీనామా అనంతరం మొదటిసారి మొయినాబాద్‌లోని తన ఫామ్‌హౌస్ వేదికగా మీడియా మీట్ నిర్వహించి.. అసలు తాను రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చింది..? ఎందుకు కాంగ్రెస్‌లోకి మళ్లీ ఎందుకు చేరాల్సి వచ్చిందనే విషయాలను నిశితంగా వివరించారు. ఇదే మీడియా ముఖంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురించి కూడా మాట్లాడారు.
అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో 27వ తేదీన కాంగ్రెస్‌లో చేరుతున్నాను. మునుగోడు, ఎల్బీ నగర్ టికెట్ ఇస్తానని బీజేపీ చెప్పింది. బీజేపీకి నేను పనికి రాను అని అధిష్ఠానానికి చెప్పాను. నాకు టికెట్ వద్దని అధిష్ఠానానికి స్పష్టంగా చెప్పాను. టికెట్ కోసం కాంగ్రె స్లోకి రావడం లేదు. రాష్ట్రంలో నియంత పాలన పోవాలంటే కాంగ్రెస్‌కు మద్దతు తెలపాలి. నేను ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అయ్యాను..ఇంకేం పదవులు కావాలి నాకు..?. బీజేపీ-బీఆర్ఎస్ ఒకటే. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా అంటే ఇప్పటికీ గౌరవం ఉంది. కాంగ్రెస్ మహా సముద్రం. బీజేపీలోనే ఉండాలని నిన్నటి వరకు అనుకున్నాను. సర్వేల్లో ప్రజలు కాంగ్రెస్‌ను కోరుకుంటున్నారని తేలింది. ప్రజల మనిషి ని కాబట్టి ప్రజలు చెప్పినట్టే వింటాను అని రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు.
రాజగోపాల్‌రెడ్డి పార్టీలోకి వస్తానంటే ఒక మెట్టు దిగుతా అని రేవంత్‌రెడ్డి చాలా సార్లు అన్నారు. నా జీవితంలో ఇది అతిపెద్ద నిర్ణయం. రేవంత్ నాకేమైనా శత్రువా?. కొన్ని సందర్భాల్లో భేదాభిప్రాయాలు ఉంటాయి. పీసీసీ పదవి శాశ్వతం కాదు. మునుగోడులో గెలిచామని బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకొగలుగుతున్నారా?. కేసీఆర్‌ని తప్పుకుండా జైలుకు పంపుతాం’ అని రాజాగోపాల్ చెప్పుకొచ్చారు.
‘కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశిస్తే గజ్వేల్‌లో కేసీఆర్ పై పోటీ చేస్తాను. కేసీఆర్‌కు దమ్ముంటే మునుగోడులో పోటీ చేసి గెలవాలని సవాల్ విసురుతున్నాను. అధిష్టానం అవకాశం ఇస్తే కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను. నా జీవిత ఆశయం కేసీఆర్‌ను గద్దె దించడమే. దుబ్బాక, హుజూరాబాద్ ఫలితాలు చూసి బీజేపీ పై అప్పట్లో నమ్మకం కలిగింది. కేసీఆర్‌ను ఓడించాలంటే బీజేపీనే సరైన ప్రత్యామ్నాయం అని భావించి ఆ పార్టీలో చేరాను. అయితే తర్వాత ఆ పార్టీ తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా బీజేపీ, కేసీఆర్ ఒక్కటే అనే అభిప్రాయం ప్రజల్లో ఎర్పడింది. బీజేపీ నాయకత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల కారణంగా ప్రజల్లో నమ్మకం పోయింది. అందుకే కేసీఆర్‌ను ఓడించాలలే లక్ష్యంతో కాంగ్రెస్‌లో చేరుతున్నా. చిల్లిగవ్వలేని కేసీఆర్ ఇప్పుడు లక్షల కోట్లు దోచుకున్నాడు. కేసీఆర్ మొహం లో రక్తం లేదు. ఓడిపోతామనే భయం కేసీఆర్‌లో కనిపిస్తోంది. ఉద్యమంలో పని చేసిన వాళ్ళని కలిసి తప్పు చేశామని కాళ్ళు పట్టుకుంటున్నారు. బావ బామ్మర్దులు కలిసి చిన్న చిన్న నాయకులను కూడా కొనే ప్రయత్నం చేస్తున్నారని కేసీఆర్‌పై రాజగోపాల్ విమర్శల వర్షం కురిపించారు.