.ముందు పులివెందులలో బస్టాండు కట్టండి
.ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి
అమరావతి: జగన్ మోహన్ రెడ్డి 5 రోజుల క్రితం కుప్పం నుంచి స్థానిక నాయకులు 15 మంది గల్లీనేతలను తాడేపల్లికి పిలిపించుకొని కుప్పంను పులివెందుల స్థాయికి తీసుకెళతానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని టిడిపి ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి (బి.టెక్ రవి) పేర్కొన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధికి 63కోట్లు విడుదల చేశామని ప్రచారం చేసుకుంటున్నారు. గతంలోనే చంద్రబాబు కుప్పంను ఎంతో అభివృద్ధి చేశారు. ఎవరైనా అభివృద్ధి చెందని ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామంటారుగానీ అభివృద్ధి చెందిన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామనడం విడ్డూరంగా ఉంది. దీన్ని బట్టి రాష్ట్రాన్ని పురోగమనంవైపు తీసుకెళ్తున్నారో, తిరోగమనం వైపు తీసుకెళ్తున్నారో అర్థం కావడంలేదని ఎద్దేవా చేశారు. విలేకరుల సమావేశంలో బి.టెక్ రవి మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో రూ. 600కోట్లు ఖర్చుచేసి పులివెందులకు కృష్ణా జలాలు తెచ్చారు. జగన్ పులివెందుల బస్టాండ్ ను అభివృద్ధి చేయలేక పోయారు. నేడు జగన్ 63కోట్లు కుప్పం మున్సిపాలిటీకి ఇచ్చి గొప్పగా చెప్పుకుంటున్నారు. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి గాలి జనార్థన్ రెడ్డికి 1400 ఎకరాలు ఇస్తే దాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.వెయ్యి కోట్లు తీసుకొని పరారయ్యారు. 15 వేల కోట్లు విలువైన మైన్స్ ని కూడా గాలి జనార్థన్ రెడ్డికి ధారాదత్తం చేశారు. ఇప్పటికీ దీనిపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తోంది. గాలి జనార్థన్ రెడ్డిపై వివాదాలు రేగినప్పుడు గాలి జనార్థన్ రెడ్డి ఎవరో నాకు తెలియదని అన్నారు. ఇప్పుడు మైన్స్ ధారాదత్తం చేస్తున్నారు. మద్యం, ఇసుక నుండి రాష్ట్రానికి అధిక ఆదాయం వస్తోంది. దాన్ని ఏం చేస్తున్నారో తెలియదు. రాయలసీమవాసులకు జగన్ తీరని ద్రోహం చేశారని బి.టెక్ రవి దుయ్యబట్టారు. 2019లో జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 2వేల 5వందల కోట్ల అంచనాలతో గండికోట నుంచి చిత్రావతికి సెకండ్ లిఫ్ట్ ఇరిగేషన్ అని పేరు పెట్టి కేవలం 10కోట్ల పని చేసి చేతులు దులుపుకున్నారు. చిత్రావతికి కావలసినంత నీరు ఉన్నా పనులు మాత్రం సున్నా. పులివెందల ఇరిగేషన్ అంతా కూడ మైక్రో ఇరిగేషన్ మీద ఆధారపడి ఉంది. మైక్రో ఇరిగేషన్ మంజూరు చేయకపోవడం బాధాకరం. వంద ఎకరాలకు ఒక సంపు నిర్మించి అక్కడ నుంచి పైపుల ద్వారా మైక్రో ఇరిగేషన్ ద్వారా రాజశేఖర్ రెడ్డి డెవలప్ చేయడం జరిగింది. జగన్ రెడ్డి మైక్రో ఇరిగేషన్ కోసమని టెండర్ కి పిలిచి వాళ్ళకు ఒక్క రూపాయి కూడ బిల్లు చెల్లించకపోవడంతో మెగా సంస్థ పలాయనం చిత్తగించిందని బి.టెక్ రవి పేర్కొన్నారు.