- మామిడి మొక్కలు పీకేసి ఆటోనగర్ పేరుతో బోర్డులు
- బుగ్గనతో మాట్లాడాలంటూ తహసీల్దారు బ్రోకర్ పనులు
- ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో బాధితుల ఫిర్యాదు
- అర్జీలు స్వీకరించిన మంత్రి ఎన్.ఎం.డి.ఫరూక్, అశోక్‌బాబు
మంగళగిరి(చైతన్యరథం): టీడీపీలో 1995 నుంచి క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తున్న తనను వైసీపీలోకి చేరలేదని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆయన అనుచరులు కక్షగట్టి తన వెంట తిరుగుతున్న కొందరి పొలాలు 4.26 ఎకరాలు కబ్జా చేసి రాత్రికి రాత్రే తోటలో ఉన్న మామిడి మొక్కలను పీకేసి ఆటోనగర్ పేరుతో బోర్డు పెట్టారని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం బేతంచర్లకు చెందిన మేకల నాగరాజు వాపోయాడు. ఈ వ్యవహారంపై తహసీల్దారును ప్రశ్నిస్తే బుగ్గనను కలవాలని చెప్పాడని ఆవేదన వ్యక్తం చేశాడు. వైసీపీ కండువా వేసుకోవాలని బెదిరించారని, భూమిని లాక్కుని నేటికీ పరిహారం ఇవ్వలేదని, ప్రశ్నించినందుకు పోలీసుస్టేషన్ తీసుకెళ్లి జైలుకు పంపిస్తామని భయపెట్టారని నాగరాజు వాపోయాడు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో బుధవారం ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో మంత్రి ఎన్.ఎం.డి.ఫరూక్‌కు తన గోడు చెప్పుకుని న్యాయం చేయాలని వేడుకున్నాడు. వెంటనే మంత్రి అక్కడి అధికారులకు ఫోన్ చేసి సమస్య ను పరిష్కరించాలని ఆదేశించారు. మంత్రితో పాటు ఎమ్మెల్సీ అశోక్‌బాబు, డూండి రాకేష్, స్వామిదాసులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
వైసీపీ నేత అండతో అక్క దేవతల ఆలయం ఆక్రమణ
అన్నమయ్య జిల్లా వాయల్పాడు మండలం మూరేవాండ్లపల్లె వైసీపీ నేత అండతో తాటిగుం టిపల్లె పంచాయతీ బర్నేపల్లిలో పూర్వకాలం నుంచి ఉన్న అక్క దేవతల ఆలయాన్ని గుండ్లూ రు వెంకటరమణ, ఆయన కుమారుడు సుబ్రహ్మణ్యం ఆక్రమించుకుని జేసీబీతో కూలగొట్టి గుడి కోనేరును దున్నేశారని వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. గుడిని కూల్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రశ్నించినందుకు మహిళపై పిడిగుద్దులు
తమ స్థలంలో అక్రమంగా ఫెన్సింగ్ రాళ్లు వేస్తుండటంపై ప్రశ్నించినందుకు ఒక మహి ళనని కూడా చూడకుండా దారుణంగా కొట్టారని ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం చీమలపాడు పెద్దతండా గ్రామానికి చెందిన జరబల కొండా భార్య జానకి ఫిర్యాదు చేశారు. డొక్కలో పొడుస్తూ.. పైట లాగేసి పిడిగుద్దులు గుద్దారని, కర్రలతో కొట్టారని అడ్డుకోబోయిన తన భర్తను చంపడానికి చూశారని వాపోయింది. వారి నుంచి తప్పించుకుని డయల్ 100 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశామని, తమను కొట్టి చంపడానికి వచ్చి వారిపై, స్థలంలో ఫెన్సింగ్ రాళ్లు వేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
భూమి సర్వే కోసం సర్వేయర్ లంచం డిమాండ్
` తన భూమికి సర్వే చేసి పట్టా పాసుపుస్తకం ఇవ్వాలని ఐదేళ్లుగా ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని..మండల సర్వేయర్ శ్రీనివాసుల నాయక్ లంచం డిమాండ్ చేశాడని అన్నమయ్య జిల్లా వాయల్పాడు మండలం తాటి గుంటిపల్లికి చెందిన కృష్ణయ్య మంత్రికి మొరపెట్టుకున్నాడు.
` గత ప్రభుత్వ అసంబద్ధమైన నిర్ణయాలతో తాము తీవ్రంగా నష్టపోయామని ఏపీ సమగ్ర శిక్షా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వైసీపీపై మండిపడ్డారు. సమ్మె సందర్భంగా కొంతమందికి మాత్రమే వేతనాలు పెంచి మిగిలిన వారిని పట్టించుకోలేదని మంత్రికి విన్నవించారు. జిల్లా మండల స్థాయి విద్యాశాఖ కార్యాలయాల్లో పనిచేస్తోన్న డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మిస్ కోఆర్డినేటర్లు, మండల లెవల్ అకౌంటెంట్లు, క్లస్టర్ రీసోర్స్ మొబైల్ టీచ ర్లకు వేతనాలు పెంచలేదని వాపోయారు. పెరిగిన నిత్యావసరాల దృష్ట్యా జీతాలు పెంచాలని వేడుకున్నారు. ఈపీఎఫ్, సామాజిక భద్రతా పథకాన్ని అమలు చేయాలని, సమగ్ర శిక్షా ప్రాజెక్టులో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, డైలీ వేజ్ పద్ధతిలో పనిచేస్తున్న ఏఎన్‌ఎం, అకౌంటెంట్, కేజీబీవీ నాన్ టీచింగ్ సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచి రిటైర్ అవుతున్న ఉద్యోగులకు వన్‌టైం అలవెన్స్ కింద రూ.10 లక్షలు ఇవ్వాలని కోరారు.
భూమి తీసుకుని పరిహారం ఇవ్వలేదు
` పల్నాడు జిల్లా మాచవరం మండలం రేకులగడ్డ గ్రామానికి చెందిన పూజ వెంకయ్య సమస్యను వివరిస్తూ పులిచింతల ప్రాజెక్ట్ భూసేకరణలో భాగంగా ఎకరా 90 సెంట్లు తీసుకుని నేటికీ పరిహారం ఇవ్వలేదని, నష్టపోయిన భూమికి పరిహారం ఇప్పించాలని వెంకయ్య వేడుకున్నాడు.
` గత టీడీపీ ప్రభుత్వంలో ఇల్లు మంజూరైందని, తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇంటిని ఇవ్వలేదని విజయవాడ బుడమేరుకు చెందిన దివ్యాంగుడు మల్లు శ్రీరాములు వినతిపత్రం అందజేశాడు. తమకు కేటాయించిన ఇంటిని ఇప్పించాలని, తాను నడవలేని దివ్యాంగుడినని వికలాంగ పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని కోరాడు.
ఇంటిపై కరెంట్ వైర్లను పక్కకు మార్పించండి
తన ఇంటిని తగిలేలా కరెంట్ వైర్లు వెళుతున్నాయని, వర్షం పడినప్పుడు ఇంటికి కరెంట్ పాస్ అవుతుందని నంద్యాల జిల్లా రుద్రవరం మండలం యల్లావత్తుల గ్రామానికి చెందిన చాకలి రజినీకాంత్ వివరించాడు. కరెంట్ షాక్ కొట్టి తన పిల్లలకు చేతులు కాలాయని.. తన ఇంటిపై నుంచి వెళుతున్న వైర్లను పక్కకు మార్పించాలని వేడుకున్నాడు. అలాగే ఆళ్లగ డ్డ నుంచి నంద్యాలకు వయా గాజులపల్లి మీదుగా మధ్యాహ్న సమయంలో బస్సు లేక పోవడంతో విద్యార్థులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారని.. బస్సు సౌకర్యం కల్పిం చాలని వేడుకున్నాడు.
కాలనీకి వైఎస్సార్ పేరు తొలగించాలి
` 2018లో ఆలపాటి రాజేంద్రప్రసాద్, దివంగత అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ చేతులమీదుగా తెనాలి నియోజకవర్గం జగ్గిరెడ్డిగుంటపాలెం శివారులో దాదాపు 300 ప్లాట్లు ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కాలనీకి రోడ్లు వేయిస్తామని చెప్పి వైఎస్సార్ కాలనీ అని పేరు పెట్టింది. అధికారంలోకి వచ్చాక రోడ్లు వేయించలేదని కాలనీవాసులు అర్జీ ఇచ్చా రు. వైఎస్సార్ పేరును తొలగించి నాదెండ్ల మనోహర్ కాలనీ లేదా ఆలపాటి రాజేంద్రప్రసాద్ కాలనీగా నామకరణం చేయాలని వినతిపత్రం ఇచ్చారు.
` మినీ గోకులం పథకంలో అర్హులకు న్యాయం చేయాలని పల్నాడు జిల్లా నూజెండ్ల మండలానికి చెందిన మాలేపాటి శివశంకరావు వేడుకున్నారు.
` తన తండ్రికి వారసత్వంగా వచ్చిన భూమిని ఆన్‌లైన్‌లో షేక్ ఖాదర్ తండ్రి చిన ఖాశీం పేరు మీద తప్పుగా మార్చారని న్యాయం చేయాలని గుంటూరు జిల్లా తుళ్లూరుకు చెందిన షేక్ అబ్దుల్లా మొరపెట్టుకున్నాడు.
` చిత్తూరు జిల్లా కొండయ్యగారిపల్లి పంచాయతీ తట్టివారిపల్లి ప్రజలు సమస్యను వివరిస్తూ శ్మశాన వాటిక లేకపోవడంతో దహన సంస్కారాలకు ఇబ్బందిగా మారిందని శ్మశాన వాటిక స్థలాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.