- భూములు కాపాడి, ప్రాణరక్షణ కల్పించాలి
- శిథిలావస్థలో పాఠశాల భవనం, నూతన భవనం నిర్మించాలి
- 50వ రోజు మంత్రి లోకేష్ ప్రజాదర్బార్‌లో ప్రజల విన్నపాలు
- సమస్యల పరిష్కారానికి మంత్రి హామీ
అమరావతి (చైతన్యరథం): విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్‌కు విన్నపాలు వెల్లువెత్తాయి. ఉండవల్లిలోని నివాసంలో 50వ రోజు ప్రజాదర్బార్‌కు శుశుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలివచ్చి, మంత్రి లోకేష్‌ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి.. ఆయా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు.
వైసీపీ పాలనలో మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారం అండతో అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 15 కుటుంబాలకు చెందిన రూ.200 కోట్ల విలువైన భూములను నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేశారని పట్టణానికి చెందిన బాసాని సునీత, రెడ్డి గోపాలనాయుడు దంపతులు.. మంత్రి నారా లోకేష్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. మదనపల్లె లేడీ డాన్ కట్టా సులోచనను బినామీగా పెట్టి ఫోర్జరీ డాక్యుమెంట్లతో పట్టణంలో రూ.10 కోట్ల విలువైన తమ 50 సెంట్ల భూమిని ఆక్రమించి వేధిస్తున్నారని మంత్రి ఎదుట కన్నీటిపర్యంతమయ్యారు. రెండు రోజుల క్రితం మాజీ మంత్రి పెద్దిరెడ్డి, సులోచన అనుచరులు తమ స్థలంలోకి దౌర్జన్యంగా ప్రవేశించి తాము నిర్మించుకున్న ప్రహరీ గోడ, సీసీ కెమెరాలు ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించిన తమపై అక్రమ కేసులు పెట్టి వేధించడంతో పాటు అనుచరులతో భౌతికదాడులకు దిగుతున్నారని వాపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేదన్నారు. విచారించి తమ భూములను కాపాడటంతో పాటు ప్రాణరక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.
ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలంలోని గంగవల్లి గ్రామాన్ని ప్రత్యేక పంచాయితీగా ఏర్పాటుచేయాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం పోచవరం పంచాయతీలో కలిసి ఉన్న గంగవల్లి ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. పక్కనే మున్నేరు నది ప్రవహిస్తున్నా తమ గ్రామానికి తాగునీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. గత టీడీపీ పాలనలో గంగవల్లిలో ఆర్వో ప్లాంట్ ఏర్పాటుచేసినా వైసీపీ ప్రోద్బలంతో ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గంగవల్లిని ప్రత్యేక పంచాయతీగా చేయాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా టిప్పర్ లారీ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆంధ్ర రాష్ట్ర టిప్పర్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఓవర్ లోడ్, మైనింగ్ బిల్లులు, రవాణా, తదితర విషయాల్లో కొంతమంది దళారులు, మైనింగ్ క్వారీ యజమానులు బిల్లులు లేకుండా వాహనాలను నడుపుతూ టిప్పర్ వ్యవస్థ మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టిప్పర్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థపై లక్షల కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయని.. ఓవర్ లోడ్, అనధికార మైనింగ్ వల్ల చిన్న, సన్నకారు టిప్పర్ యజమానులు జరిమానాలు, అధికారుల వేధింపులు తట్టుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. తమ సమస్యలు పరిష్కరించి అండగా నిలవాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.
ఎన్నికల కోడ్ వల్ల నిలిచిపోయిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేస్తున్న 117 మంది వర్క్ షాప్ అటెండర్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను పునరుద్ధరించాలని ఏపీ పాలిటెక్నిక్ కాంట్రాక్ట్ వర్క్‌షాప్ అటెండెంట్స్ స్టాప్ అసోసియేషన్(ఏపీ పీసీడబ్ల్యూఏఎస్‌ఏ) ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. గత 18 ఏళ్లుగా చాలీచాలనీ జీతాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. జీవో 8ని అనుసరించి 22 మందిని మాత్రమే రెగ్యులర్ చేశారని, మిగిలిన వారికి కూడా న్యాయం చేయాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు చేపడతామని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు.
శిథిలావస్థకు చేరుకున్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనం స్థానంలో నూతన భవనం నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ఏలూరు జిల్లా టి.నర్సాపురం మండలం గట్టుగూడెంకు చెందిన స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు. 1976లో నిర్మించిన పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని, పెచ్చులూడి విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.
కోవిడ్ వ్యాధితో తీవ్ర అనారోగ్యానికి గురై చూపు కోల్పోయిన తమ కుమార్తెకు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన కే.దాసు విజ్ఞప్తి చేశారు. డిగ్రీ చదివే సమయంలో కోవిడ్‌తో పాటు డెంగ్యూ వ్యాధి కూడా సోకి తమ కుమార్తె చూపు కోల్పోయిందని, ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని కన్నీటిపర్యంతమయ్యారు. పరిశీలించి తగిన ఉపాధి కల్పిస్తామని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు.
సకాలంలో వైద్యం అందినందుకు కృతజ్ఞతలు
ఎన్టీఆర్ వైద్యసేవ కార్డులో పేరు అనుసంధానించడంతో తమ కుమార్తెకు సకాలంలో వైద్యం అందిందని ఎన్టీఆర్ జిల్లా కొండపల్లికి చెందిన సీహెచ్ శ్రీనివాసరావు.. మంత్రి నారా లోకేష్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ముక్కు ఇన్‌ఫెక్షన్‌తో తీవ్ర అనారోగ్యానికి గురైన శ్రీనివాసరావు కుమార్తె పలగాని అనూషకు తక్షణమే ఆపరేషన్ చేయాలని వైద్యులు తెలిపారు. అయితే వివాహం అయిన తర్వాత ఆమె పేరును ఎన్టీఆర్ వైద్యసేవ కార్డులో తొలగించటంతో ప్రజాదర్బార్‌లో మంత్రి నారా లోకేష్‌ను కలిసి విన్నవించారు. తక్షణమే స్పందించిన సిబ్బంది.. భర్త కుటుంబానికి చెందిన ఎన్టీఆర్ వైద్యసేవ కార్డులో ఆమె పేరు అనుసంధానించారు. దీంతో వైద్యులు ఆరోగ్యశ్రీ కింద ఆమెకు ఆపరేషన్ నిర్వహించడంతో కోలుకున్నారు. సకాలంలో స్పందించి ఆదుకున్న మంత్రి నారా లోకేష్‌ను ప్రజాదర్బార్‌లో కలిసి శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు.