- 2014, 2024 పార్టీ విజయాలలో కీలక పాత్ర
- 2019లో ఓటమితో రాటుదేలిన చిచ్చరపిడుగు
- చట్టాల్ని ఉల్లంఘించిన వారిపై రెడ్‌బుక్ అస్త్రం
అమరావతి (చైతన్య రథం): తెలుగుదేశం మీసం తిప్పాడు నారా లోకేష్. తెలుగుదేశం పార్టీలో 2013నుంచి క్రియాశీలక పాత్ర పోషిస్తున్న నారా లోకేష్, 2014 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతల్లో ఉన్నా.. పోటీకి దూరంగా ఉండటంతో.. ఎన్నికల వ్యూహాలు, పొత్తుల చర్చలు, లీడర్లమధ్య సమన్వయం, పోల్ మేనేజ్మెంట్, కార్యకర్తలకు నాయకత్వ శిక్షణ ఇప్పించి వారిని భావినాయకులుగా తీర్చిదిద్దడంలో నారా లోకేష్ కీ రోల్ పోషించారు. 2014లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో యువనేత లోకేష్ చొరవ ప్రధాన కారణం. 2019 ప్రత్యక్ష ఎన్నికల్లో పార్టీ ఓటమి లోకేష్‌ని రాటుదేల్చింది. అపజయం నుంచి గుణపాఠం నేర్చుకున్నారు. ఓడిపోవడమంటే, ఆగిపోవడం కాదు.. మరింత గొప్పగా పనిచేస్తూ విజయాన్ని సొంతం చేసుకోవడమని నిర్ణయించుకున్నారు. పోయినచోటే వెతుక్కోవాలి అన్న నానుడిలాగే ఓడినచోటే గెలవాలనే పట్టుదలతో మంగళగిరి నియోజకవర్గంలో పాగా వేశారు. మరోవైపు 23 సీట్లకే పరిమితమై, అధికార వైసీపీ దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగుదేశం పార్టీకి కోటగోడై నిలబడ్డాడు. కేడర్‌కి కష్టమొస్తే క్షణం ఆలస్యం చేయకుండా సాయమందించే యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. లీడర్లతో మాట్లాడుతూ ధైర్యం నింపాడు. ఒక్క కేసు పెడితే వందకేసులు పెట్టుకోండంటూ సవాల్ విసిరాడు. చట్టాల్ని చుట్టాల్ని చేసుకుని టీడీపీ నాయకులు, కార్యకర్తల్ని వేధిస్తున్న వారికి రెడ్ బుక్ వార్నింగ్ ఇచ్చి సంచలనం సృష్టించారు. ఎదురైన ప్రతీ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని 2024లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయానికి దారులు వేశాడు లోకేష్.
మంగళగిరికి తొలి యువ ఎమ్మెల్యే
మంగళగిరి నియోజకవర్గం ఏర్పడిన నుంచీ ఇప్పటివరకూ ఎన్నికైన ఎమ్మెల్యేలలో అతి పిన్న వయస్కుడు నారా లోకేష్. 1952లో ఏర్పడిన మంగళగిరి నియోజకవర్గం నుంచి 11 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 12వ ఎమ్మెల్యేగా ఎన్నికైన లోకేష్ వయస్సు 41 సంవత్సరాలు. 1952 నుంచి 2024 వరకూ 16 సార్లు ఎన్నికలు జరగ్గా, కొందరు రెండు సార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఈ లెక్కన నారా లోకేష్ తో 12 మంది ఎమ్మెల్యేలుగా పనిచేయగా, అత్యంత చిన్న వయస్సు వాడిగా నారా లోకేష్ మరో రికార్డు నెలకొల్పారు.
కార్యకర్తల పెన్నిధి.. టీడీపీ సంక్షేమనిధి
కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా భావిస్తుంది. వారి సంక్షేమానికి భారతదేశంలోనే ఏ ఒక్క రాజకీయ పార్టీకిలేని కార్యకర్తల సంక్షేమ విభాగాన్ని ఏర్పాటు చేసి.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో దిగ్విజయంగా నడిపిస్తున్నారు. కార్యకర్తలు.. వారి కుటుంబసభ్యుల విద్య, వైద్యం, వివాహం, ఆర్థిక అవసరాలలో ఆదుకుంటూ కొండంత అండగా నిలుస్తున్నారు. ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే వారి కుటుంబానికి ప్రమాదబీమా అందించి ధీమా కల్పిస్తున్నారు.
టీడీపీ కార్యకర్తల బాగోగులు చూసుకునే బాధ్యత లోకేష్‌కి అప్పగిస్తున్నామని 2014 మహానాడులో పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. నాటినుంచి నేటివరకూ కార్యకర్తల పెన్నిధిగా వ్యవహరిస్తున్న లోకేష్ సంక్షేమనిధితో ఆదుకుంటున్నారు. ఇప్పటివరకు 1500 మందికి పైగా కార్యకర్తల పిల్లల చదువులకు సహాయం చేశారు. వివిధ ప్రమాదాల్లో మరణించిన సుమారు 5000 మంది కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల రూపాయలు బీమా అందచేశారు.
అనారోగ్యంతో బాధపడుతున్న అనేక మంది కార్యకర్తలకు వైద్య సహాయం అందించారు. సుమారు 2000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. సుమారు 5000 మంది కార్యకర్తల కుటుంబాలకు కష్టకాలంలో అండగా నిలిచి ఆర్థిక సహాయం చేశారు. రూ.100తో సభ్యత్వం తీసుకున్న తెలుగుదేశం కార్యకర్తల సంక్షేమం చూసేందుకు లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ వెల్ఫేర్ వింగ్ అవిశ్రాంతంగా పని చేస్తోంది. ఎన్టీఆర్ మోడల్ స్కూళ్ల ద్వారా ఉచిత విద్య, ఉపకారవేతనాలు, ప్రైవేట్ స్కూళ్లలోనూ ఫీజుల్లో రాయితీలు, చదువు పూర్తయిన వారికి ఉపాధి. ఉద్యోగావకాశాలు సాధించేలా నైపుణ్యశిక్షణ ఇస్తున్నారు. జెండా మోసే కార్యకర్తకు అండగా నిలిచిన యువనాయకుడు నారా లోకేష్‌పై తెలుగుదేశం లీడర్ నుంచి కేడర్ వరకూ అంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. శెహభాష్ లోకేష్ అని కితాబిస్తున్నారు.
కష్టమొస్తే ఆదుకుంటూ.. సమస్యొస్తే పరిష్కరిస్తూ..
సమస్యలను ప్రభుత్వాలే పరిష్కరించాల్సిన పనిలేదని నిరూపించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. మంగళగిరి నియోజకవర్గంలో ఐదేళ్లుగా ప్రజలకు ఏ కష్టమొచ్చినా నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు. సమస్య ఏదైనా, పరిష్కారాన్ని చూపుతున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ నారా లోకేష్ సాయమో, పలకరింపో, కానుకో అందుతుందంటే ఆశ్చర్యపోనవసరం లేదు. సొంత నిధులు, దాతల సహకారంతో 29 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజలకు లోకేష్ చేరువయ్యారు. నూతన వధూవరులకు పెళ్లి కానుక, మంగళగిరి, తాడేపల్లిలో అన్న క్యాంటీన్లు, చిరు వ్యాపారులకు టిఫిన్, తోపుడు బండ్లు, స్త్రీ శక్తి పేరుతో మహిళలకు టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ, సంజీవని ఆరోగ్యకేంద్రాలు /సంజీవని ఆరోగ్యంథం ద్వారా ప్రజలకు ఉచిత వైద్యసేవలు, యువ పేరుతో నిరుద్యోగులకు సాఫ్ట్‌వేర్ కోర్సుల్లో ఉచిత శిక్షణ, జలధార పేరుతో టాంకర్లద్వారా మంచినీరు సరఫరా, వాటర్ ప్లాంట్ల ఏర్పాటు, నారా లోకేష్ క్రీడా ప్రాంగణాల నిర్వహణ, దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, రజకులకు ఇస్త్రీ బండ్లు, లక్ష్మీ నరసింహ స్వర్ణకార సంక్షేమ సంఘం ద్వారా సేవలు, పురోహితులకు, పాస్టర్లకు, ఇమామ్ -మౌజన్ లకు పండుగ కానుకలు, నియోజకవర్గంలో గ్రావెల్ రోడ్లు, రోడ్ల మరమ్మత్తులు, నాయి బ్రాహ్మణులకు సెలూన్ చైర్లు, కార్మికులకు వెల్డింగ్ మెషీన్లు, కోవిడ్ సమయంలో వైద్య సహాయం, టీడీపీ కార్యకర్తలకు ఆర్థిక సాయం, ఆర్‌ఎంపీలకు వైద్య సేవ పరికరాలు, వేసవిలో మజ్జిగ పంపిణీ కేంద్రాలు, క్రీడా టోర్నమెంట్ల నిర్వహణ, యస్సీ వరుని వివాహానికి తాళిబొట్టు, సోదరీమణులకు రాఖీ కానుక, చేనేతలకు రాట్నాల పంపిణీ, నిరుపేదలు మృతి చెందితే వారి కుటుంబాలకు మట్టి ఖర్చులు, ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు నిత్యావసరాల పంపిణీవంటి సహాయాలు ప్రజలకు అందించి నిస్వార్థంగా సేవలు అందించారు లోకేష్. మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే ఒక నియోజకవర్గంలో ఇన్ని సంక్షేమ పథకాలు సొంత నిధులతో అందించిన నేతలు లేరుగాక లేరు.