- అమరావతిలో స్వాతంత్య్ర వేడుకలు హర్షణీయం
- స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు
- అసెంబ్లీ ప్రాంగణంలో జెండా ఆవిష్కరణ
అమరావతి(చైతన్యరథం): రాష్ట్ర ఉభయసభల్లో ప్రజా సమస్యలపై అర్థవంతమైన, ఫల వంతమైన చర్చలు జరగాలని అప్పుడే ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనాలైన చట్ట సభలకు మరింత గౌరవం పెరుగుతుందని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొ న్నారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా గాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ రాజధాని అమరావతిలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్య్రం కోసం ఎంతోమంది స్వాతంత్య్ర సమరయోధులు చేసిన త్యాగాల ఫలమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛాయుత జీవనమని గుర్తు చేశారు.
ఈ శుభవేళ ప్రతి పౌరుడు దేశం పట్ల బాధ్యతాయుతంగా తన కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ప్రజాస్వామ్యానికి దేవాలాయాలుగా భాసిల్లే చట్టసభల్లో ముఖ్యంగా రాష్ట్ర అసెంబ్లీ ఉభయసభల్లో ప్రజా సమస్యలకు సంబంధించిన అనేక అంశాలపై అర్థవంతమైన, ఫలవంతమైన చర్చలు జరిగినప్పుడే చట్ట సభలపై మరింత గౌరవం పెరుగుతుందని పేర్కొ న్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర, ఉప కార్యదర్శులు పి.వి.సుబ్బారెడ్డి, రాజ్‌కుమార్, పలువురు అసెంబ్లీ అధికా రులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.