- దళిత యువకుడిని నాలుగు గంటలు చిత్రహింసలు పెడితే బెయిలబుల్ సెక్షన్లా
- దాహంగా ఉందంటే మూత్రం పోసి అవమానించినా జగన్ ప్రభుత్వానికి పట్టదా
- సీఎం సామాజికవర్గమైతే తేలికపాటి కేసులతో సరిపెడతారా
- సామాజిక సాధికార బస్సుయాత్రలు చేస్తున్న మంత్రులకు సిగ్గనేది ఉందా
విజయవాడ: ఈ రాష్ట్రంలో జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక దళితులకు జీవించే హక్కు కూడా లేకుండా పోయిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి నక్కా ఆనందబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ ప్రతి వేదికపై ముఖ్యమంత్రి జగన్ వారిపై ఎనలేని ప్రేమ ఒలకబోస్తున్నా.. వైకాపా పాలనలో దళితులపై దాష్టీకాలు రోజరోజుకు పెచ్చరిల్లిపోతూనే ఉన్నాయ న్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల లో వైసీపీకి చెందిన అగ్రవర్ణాల యువకుల దాడిలో గాయపడి విజయవాడ లోని ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న కంచికచర్ల అంబేద్కర్ నగర్‌కి చెందిన దళిత యువకుడు కాండ్రు శ్యామ్ కుమార్‌ను తెదేపా రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు, ఇతరులతో కలిసి ఆనంద బాబు శనివారం పరామర్శించి దైర్యం చెప్పారు.
ఆ సందర్భంగా ఆనంద బాబు మాట్లాడుతూ దళితుడైన శ్యామ్ కుమార్‌పై అగ్రకులానికి చెందిన హరీష్ రెడ్డి అతని స్నేహితులు మరో ఆరుగురు కలిసి అమానుషంగా ప్రవర్తించారన్నారు. శ్యామ్ కుమార్ ని కారులో తీసుకెళ్లి నాలుగు గంటలపాటు ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో తిప్పుతూ తీవ్రంగా కొడుతూ చిత్రహింసలు పెట్టి నరకం చూపించారు. దాహంగా ఉంది మంచినీళ్లు కావాలని అతను ప్రాధేయపడితే రహదారి మధ్యలో కారు ఆపి మూత్రం పోసి అవహేళన చేస్తూ అమానుషంగా ప్రవర్తించారు. బాధితుడిని కులం పేరుతో దూషిస్తూ, ఇవీ మీ బతుకులు అంటూ అవమానకరంగా దూషించారు. ఏం చేసినా వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, అన్నీ చూసుకుంటాడు అన్న ధైర్యంతోనే వీళ్ళు ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు. ఇంత జరిగితే పోలీసులు వాళ్ళ మీద పెట్టిన కేసులు చూస్తే అన్ని బెయిలబుల్ సెక్షన్లే పెట్టారు. హత్యాయత్నం కేసు మాత్రం పెట్టలేదు. ఇలాంటి పాలనలో సామాజిక సాధికార బస్సు యాత్రలు చేస్తున్న మంత్రులకి సిగ్గుండాలి. దళిత యువకుడి మీద జరిగిన ఈ దారుణంపై మంత్రులు ఏమి సమాధానం చెబుతారని ఆనందబాబు ప్రశ్నించారు.
ఈ రాష్ట్రంలో దళిత, బడుగు బలహీన వర్గాల మీద దాడులు నిత్యకృత్యం అయిపోయాయి. దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే అతడికి రెడ్ కార్పొరేట్ పరిచి సభలు సమావేశంలో పెద్దపీట వేస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్‌కు కూతవేటు దూరంలో దళిత మహిళపై అత్యాచారం చేసిన వెంకటరెడ్డి బయటే తిరుగుతున్నాడు. రేపల్లె నియోజకవర్గం ఉప్పలవారి పాలెం లో అమర్నాథ్ గౌడ్ అనే 15 ఏళ్ల కుర్రాడిని చంపిన వ్యక్తి కూడా బయట తిరుగుతున్నాడు. గతంలో మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్ ని పిచ్చివాడిని చేసి చంపారు. మాస్క్ ధరించలేదని చీరాలలో కిరణ్ కుమార్ అనే యువకుడిని కొట్టి చంపారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లెక్కకు అంతుండదన్నారు. ఈ రాష్ట్రంలో దళితులకు జీవించే హక్కు లేదా అని ఆనందబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.