- మానవ వనరుల సద్వినియోగంతోనే అభివృద్ధి
- అధికారులు బాధ్యతతో పనిచేయాలి
- ప్రపంచంతో పోటీకి విద్యారంగం కీలకం
- విజన్ స్వర్ణాంధ్ర` 2047 సమావేశంలో మంత్రి గొట్టిపాటి
బాపట్ల (చైతన్యరథం): సీఎం చంద్రబాబు మార్గనిర్దేశంలో 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధన లక్ష్యంగా అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పిలుపు ఇచ్చారు. బాపట్లలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ‘విజన్ స్వర్ణాంధ్ర` 2047’ సమావేశంలో బాపట్ల జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పాల్గొన్న మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ..2047 నాటికి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను నిలపడానికి కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు వెళుతోందని మంత్రి రవికుమార్ చెప్పారు. అందులో భాగంగా స్వర్ణాంధ్ర`2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు సీఎం చంద్రబాబు సంకల్పించారన్నారు. అధిóకారులు బాధ్యతతో శ్రమిస్తేనే ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోగలమన్నారు. పెద్దసంఖ్యలో ఉన్న మానవ వనరులను సద్వినియోగం చేసుకుంటేనే రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నారు.
భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలన్నారు. జిల్లాలో బకింగ్ హామ్ కెనాల్ అభివృద్ధి చేసుకోగలిగితే బోట్ల ద్వారా రవాణా పెరిగి, ఆదాయ వనరుగా మారుతుందన్నారు. తద్వారా కాలుష్యాన్ని పూర్తిస్థాయిలో నియంత్రించవచ్చన్నారు. 13వ శతాబ్దం నాటి మోటుపల్లి ఓడరేవును పునఃనిర్మించడానికి అధిక ప్రాధాన్యతనివ్వాలన్నారు. ప్రతి గ్రామానికి తాగునీరు అందాలి, అందరికీ మరుగుదొడ్లు ఉంటేనే స్వచ్ఛత సాధ్యమవుతుందని సూచించారు. విద్యతోనే ప్రజల్లో అంతరాల అడ్డు నూరు శాతం తొలగిపోతుందన్నారు. విద్యా రంగంలో పాఠ్యాంశాలు మారాలి, అభివృద్ధికి తగినట్టుగా విద్యా విధానంలో మార్పులు జరగాలని సూచించారు. ప్రపంచస్థాయిలో పోటీపడేలా యువత అభివృద్ధి చెందాలంటే విద్యారంగం కీలకమన్నారు.
బాపట్ల జిల్లాలో వ్యవసాయ, ఆక్వా రంగాల్లో ఉత్పత్తులు గణనీయంగా పెరిగేలా ప్రణాళికలు రచించడం అభినందనీయమని మంత్రి రవికుమార్ అన్నారు. వ్యవసాయంపై ఆధారపడిన బాపట్ల జిల్లాలో చివరి ఎకరా వరకు నీరు అందిస్తే ఉత్పత్తులు మరింత పెరుగుతాయన్నారు. సాంకేతిక ఆధునీకరణలను వ్యవసాయ రంగంలోకి తెస్తే సత్ఫలితాలు సాధించవచ్చన్నారు. పరిశ్రమలు ఏర్పడితే ఉద్యోగ సమస్య తీరుతుందని, ఉపాధి, ఆదాయ వనరులు పెరుగుతాయన్నారు. బీచ్‌ల వద్ద రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. తద్వారా పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. దీంతో వారానికి 2000 నుంచి 10000 మంది పర్యాటకులు వస్తారన్నారు. గుంటూరు ఛానల్ విస్తరణ చేపట్టాలన్నారు.ఈ సందర్భంగా అద్దంకి నియోజకవర్గం నుండి వచ్చిన పలు గ్రామాల ప్రజల వినతులను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళారు.
బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ హైవే పరిధిలో భూములు కోల్పోయిన కొటికలపూడి, జాగర్లమూడివారి పాలెం గ్రామాల రైతులకు నష్టపరిహారం అందించడంలో జాప్యం జరిగిందని యుద్ధ ప్రాతిపదికన నష్టపరిహారం అందేలా చూడాలని సూచించారు. అదేవిధంగా నామ్ రోడ్డు పరిధిలోని చక్రాయపాలెం, గోపాలపురం, ఏల్చూరు గ్రామాలలో రోడ్డు నిర్మాణం కోసం భూమి కోల్పోయిన రైతులకు సరైన ధర అందేలా నామ్ హైవే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యేలా చొరవ చూపాలన్నారు. కొరిశపాడు మండలం తిమ్మన పాలెం గ్రామ పరిధిలోని జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోయిన ఎస్సీ కాలనీవాసుల సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
16వ నెంబర్ జాతీయ రహదారి పరిధిలోని జాగర్లమూడి వారి పాలెం, భగవాన్ రాజుపాలెం, గ్రామాలలో ఇరువైపులా మరుగు కాలువల నిర్మాణాలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో డిఏపీ సహా ఇతర ఎరువుల నిల్వలు సరిపడా అందుబాటులో ఉన్నా, కొంతమంది డీలర్లు కృత్రిమ కొరత సృష్టించడం ద్వారా రైతులపై మోయలేని భారం పడుతుందని,అధికారులు నకిలీ విత్తనాలు , ఎరువుల పట్ల విస్తృత తనిఖీలు చేపట్టాలన్నారు. సంతమాగులూరు మండలం మక్కెనవారిపాలెం గ్రామంలో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా రాయితీపై పరికరాలు అందించాలన్నారు.